Share News

Gold Chain Thief Sanjay Roy: ఆంధ్రాలో దోపిడీలు.. అసోంలో ఆస్తులు!

ABN , Publish Date - Nov 10 , 2025 | 04:51 AM

ఆ వ్యక్తిని చూడగానే ఎవరైనా వ్యాపారవేత్త అనుకుంటారు. కానీ అతడో అంతర్రాష్ట్ర ఘరానా దొంగ! అతడే అసోంకు చెందిన సంజయ్‌ రాయ్‌. ఎంచక్కా విమానం ఎక్కి విజయవాడకు వస్తాడు....

Gold Chain Thief Sanjay Roy: ఆంధ్రాలో దోపిడీలు.. అసోంలో ఆస్తులు!

  • విమానంలో బెజవాడకు.. రైళ్లలో చోరీలు

  • వ్యాపారవేత్త తరహాలో ఆహార్యం, నడత

  • ప్రయాణికుల మెడలో చైన్లు లాక్కొని పరారీ

  • రాష్ట్రంలో 12.. దేశవ్యాప్తంగా 40 దొంగతనాలు

  • ప్రభుత్వ రైల్వే పోలీసులకు పట్టుబడిన అంతర్రాష్ట్ర ఘరానా దొంగ సంజయ్‌ రాయ్‌

అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ఆ వ్యక్తిని చూడగానే ఎవరైనా వ్యాపారవేత్త అనుకుంటారు. కానీ అతడో అంతర్రాష్ట్ర ఘరానా దొంగ! అతడే అసోంకు చెందిన సంజయ్‌ రాయ్‌. ఎంచక్కా విమానం ఎక్కి విజయవాడకు వస్తాడు. ఇక్కడ రైలెక్కి తెనాలివెళ్లే లోపు దొంగతనం.. తిరిగి అక్కడ రైలెక్కి ఇటు రాజమండికి వెళ్లేలోపు మరో చోరీ చేస్తాడు. పని పూర్తికాగానే గన్నవరంలో మళ్లీ విమానం ఎక్కి ‘బిజినెస్‌ ట్రిప్‌’(వ్యాపార పని) ముగించుకుని వెళ్లిన్నట్టు మళ్లీ అసోం చేరుకుంటాడు. లోతుగా కూపీ లాగిన రైల్వే పోలీసులు సొత్తు రికవరీ కోసం అసోం వెళ్లగా అక్కడ సంజయ్‌ ఖరీదైన స్థలం కొనుగోలు చేసి భారీ భవంతి నిర్మిస్తున్నట్టు తెలిసి ఆశ్చర్యపోయారు.


చైన్‌ స్నాచింగ్‌పై దృష్టిపెట్టగా..

రాష్ట్రంలో ఇటీవల రైళ్లలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మహిళల మెడలో చైన్లు తెంచుకుని దొంగలు పారిపోతున్నారు. వరుస ఫిర్యాదులతో రైల్వే డీఐజీ బి. సత్య యేసు బాబు ఈ వ్యవహారంపై సమీక్షించారు. ఇటీవల విజయవాడ నుంచి తెనాలి వెళుతున్న ఒక రైలు కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వద్ద నెమ్మదించింది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన దొంగ(సంజయ్‌ రాయ్‌) మహిళల మెడలో నుంచి టక్కున చైను లాక్కొని వేగంగా కిందికి దిగేశాడు. ప్రయాణికులు తేరుకునేలోపే కనిపించకుండా పారిపోయాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న గుంటూరు-విజయవాడ రైల్వే పోలీసులు సీసీ ఫుటేజీలు బయటికి తీసి ఆ మహిళకు చూపించడంతో దొంగను ఆమె గుర్తించారు. వెంటనే పోలీసులు అన్ని రాష్ట్రాల్లోని క్రైమ్‌ గ్రూపుల్లో ఈ వీడియోలు పోస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన ఒక పోలీసు ఇచ్చిన సమాచారంతో ఆ దొంగ అసోంకు చెందిన సంజయ్‌ రాయ్‌గా నిర్ధారించుకున్నారు. గతంలో అక్కడ అరెస్టయినప్పటి వివరాలతోపాటు ఆధార్‌ కార్డు సేకరించి నిఘా పెట్టారు. అలవాటులో భాగంగా సంజయ్‌ విమానం టిక్కెట్‌ బుక్‌ చేసుకోగానే రైల్వే పోలీసులకు సమాచారం వచ్చింది. గన్నవరంలో దిగి విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకుని మరో చోరీకి ప్రయత్నిస్తున్నట్లు తెలియడంతో ఏలూరు-రాజమహేంద్రవరం మధ్యలో పట్టుకున్నారు.

కూలీ నుంచి చోరీగా!

అసోంలోని నాగావ్‌ జిల్లా చంగ్మాజీ రోడ్‌కు చెందిన సంజయ్‌ రాయ్‌(34) బాల్యంలో పేదరికం వల్ల కూలీ పనులు చేసుకునేవాడు. తర్వాత చిన్ననాటి స్నేహితులు నయన్‌ జ్యోతి, దీప్‌ జ్యోతితో కలిసి రైల్వే స్టేషన్ల వద్ద దొంగతనాలు మొదలు పెట్టాడు. మొదట్లో గౌహతిలోని చాపర్ముఖ్‌ రైల్వే స్టేషన్లో ఇనుప ముక్కలు దొంగతనం చేసి, దొరికిపోయి అక్కడి సెంట్రల్‌ జైలుకు వెళ్లాడు. బెయిలుపై వచ్చిన తర్వాత బెంగళూరుకు వెళ్లి కూలీ పనులు చేసుకుందామనుకున్నాడు. అయితే, రైల్లో ప్రయాణిస్తుండగా బెంగళూరులో ఒక మహిళ టాయిలెట్‌ వచ్చినప్పుడు అక్కడే ఉన్న సంజయ్‌ ఆమె మెడలోని బంగారు నగలను గమనించాడు. ఆమె టాయిలెట్‌కు వెళ్లి బయటకు వచ్చేదాకా డోర్‌ వద్ద కాపు కాచి రెప్పపాటులో మెడలో బంగారు చైను, నెక్లెస్‌ లాక్కొని రైలు నెమ్మదించగా కిందికి దూకేశాడు. ఆటోలో బస్టాండు చేరుకుని బెంగళూరు నుంచి బస్సులో హైదరాబాద్‌ చేరుకుని నగలు విక్రయించడంతో గతంలో ఇనుప ముక్కల విక్రయాల్లో ఎన్నడూ చూడనంత డబ్బులు వచ్చాయి. ఆ డబ్బుతో హైదరాబాద్‌లో విమానం ఎక్కి గౌహతి చేరుకున్నాడు. అలా మొదలైన సంజయ్‌ రాయ్‌ దొంగతనాలు దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహరాష్ట్రలో 40 వరకు తేలాయి.


అత్యధికం తమిళనాడులో.. రెండో స్థానంలో ఏపీ

అసోం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చి బంగారం దోపిడీ చేస్తున్న సంజయ్‌ రాయ్‌ అత్యధికంగా తమిళనాడులో 16, ఏపీలో 12, తెలంగాణలో 9, కర్ణాటకలో 3 దొంగతనాలు చేసినట్లు తేలింది. ఇప్పటి వరకు ఏపీలో చేసిన దొంగతనాల్లో 290 గ్రాముల బంగారం తస్కరించిన సంజయ్‌ నుంచి పోలీసులు 34 గ్రాములే రికవరీ చేశారు. మిగతా బంగారం గురించి ప్రశ్నించగా అభిజిత్‌ సేన్‌(190 గ్రాములు), మిథున్‌ సేన్‌(66 గ్రాములు) వద్ద ఉన్నట్లు వెల్లడించాడు. ఆ ఇద్దరి కోసం అసోం వెళ్లిన పోలీసులకు మరో ఆశ్చర్యకర విషయం తెలిసింది. రాయ్‌ సొంతూరులో ఒక భవనం నిర్మిస్తున్నాడు. ఒకప్పుడు కూలీగా ఉన్న అతడు అనతి కాలంలోనే విమానాల్లో ప్రయాణిస్తూ భవనాలు నిర్మించే స్థాయికి ఎదగడంతో పరిచయాలు, గౌరవం కూడా పెరిగాయి. దొంగతనాలకు వెళ్లేందుకు సంజయ్‌కి అభిజిత్‌ సేన్‌, మిథున్‌ సేన్‌ విమాన టికెట్లు బుక్‌ చేసి పంపుతారు. సంజయ్‌ దక్షిణాదిలోనూ ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. దీప్‌ జ్యోతి, సతేందర్‌ కుమార్‌, సతీశ్‌ గుజ్జర్‌, రవికుమార్‌, లోకేందర్‌ పర్మార్‌, వికాస్‌ కుమార్‌, పల్సర్‌ లక్కీ, అమృత్‌ ఐనే, నయన్‌ జ్యోతి, అబ్దుల్‌ హసీబ్‌లతో దొంగతనాలు చేయిస్తూ అంతర్రాష్ట్ర పోలీసులకు సవాలు విసురుతున్నాడు. ఏపీ రైల్వే పోలీసులు.. సతేందర్‌, సతీశ్‌, రవికుమార్‌లను అరెస్టు చేసి గుంటూరు జైలుకు తరలించారు.

ప్రయాణాల్లో

పసిడి ధరించొద్దురైళ్లలో వెళ్లే మహిళలు సాధ్యమైనంత వరకు బంగారు ఆభరణాలు ధరించవద్దని జీఆర్‌పీ డీఐజీ సత్యయేసుబాబు సూచించారు. ఒకవేళ ధరించాల్సి వస్తే అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా రైళ్లలో టాయిలెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వెళ్లరాదని హెచ్చరించారు. డోరు వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే.. మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

Updated Date - Nov 10 , 2025 | 04:51 AM