Deputy CM Pawan: రాష్ట్రాల మధ్య సహకారం ముఖ్యం
ABN , Publish Date - Oct 07 , 2025 | 03:25 AM
ఇరుగు, పొరుగు రాష్ట్రాల మధ్య సహకారం ముఖ్యమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రాల మధ్య సరిహద్దులు కేవలం కొన్ని నియంత్రణలకు మాత్రమేనని తెలిపారు.
2019లో నేను ఓడినప్పుడు జస్టిస్ గోపాలగౌడ అండగా ఉన్నారు.. ఎంతో ధైర్యం చెప్పారు
సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాలగౌడ పుట్టినరోజు వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
బెంగళూరు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఇరుగు, పొరుగు రాష్ట్రాల మధ్య సహకారం ముఖ్యమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రాల మధ్య సరిహద్దులు కేవలం కొన్ని నియంత్రణలకు మాత్రమేనని తెలిపారు. మానవత్వానికి, మనోభావాలకు సరిహద్దులు ఉండవని వ్యాఖ్యానించారు. చిక్కబళ్లాపుర జిల్లా చింతామణిలో సోమవారం జరిగిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలగౌడ 75వ పుట్టినరోజు వేడుకలకు ఆయన ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేలాది మంది అభిమానులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగించారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జస్టిస్ గోపాలగౌడ.. పేద వర్గాలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో న్యాయవాద వృత్తిని చేపట్టి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి స్థాయికి ఎదిగారని తెలిపారు. ఓ వైద్యుడి నిర్లక్ష్యానికి గురైన బాధితులకు ఏకంగా రూ.6 కోట్ల పరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తొలగించిన సంస్థలోనే కార్మికుడికి ఉద్యోగం కల్పించేలా ఆయన తీర్పు ఇచ్చారని గతాన్ని గుర్తు చేశారు. గోపాలగౌడ అభిప్రాయా లు యువత, మహిళలు, రైతులు, కార్మికులు, పర్యావరణానికి చేరువగా ఉంటాయని, అవే భావాలు కలిగిన తాను ఆయనకు దగ్గరయ్యానని పవన్‌కల్యాణ్ చెప్పారు. ‘‘నేను 2019 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయా. ఆ సమయంలో జస్టిస్ గోపాలగౌడ అండగా ఉన్నారు. ఎంతో ధైర్యం చెప్పారు. సినిమాలలో బిజీగా ఉన్నప్పుడే నా వంతుగా సమాజానికి ఏదైనా చేయాలని రాజకీయాలలోకి వచ్చా. గోపాలగౌడ వంటి ఎంతోమంది ఆదర్శప్రాయుల సలహాలు నాకు కీలకం.’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
నీటి సమస్య పరిష్కారానికి కృషి!
కర్ణాటకలోని చిక్కబళ్లాపుర, కోలార్ జిల్లాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి సోదరభావంతో తాను ప్రయత్నిస్తానన్నారు. ‘‘ఒకప్పుడు ఇది సరస్సులు ఉండే ప్రాంతం. కొన్నేళ్ల పాటు కొనసాగిన అనావృష్టి కారణంగా నీటి సమస్య ఏర్పడింది. దీనిని పరిష్కరించేందుకు సోదరభావంతో ప్రయత్నం చేస్తా.’’ అని పవన్ అన్నారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా స్నేహ సంబంధాలు ఉన్నాయని, ఎంతో మంది తెలుగువారు విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం కర్ణాటకలో నివసిస్తున్నారని చెప్పారు. ఇటీవలే 4 కుంకీ ఏనుగులను ఇచ్చి.. కర్ణాటక ప్రభుత్వం తమకు సహకరించిందన్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే కన్నడ భక్తులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించే విషయమై ఇప్పటికే సీఎం చంద్రబాబుతో చర్చించానని, ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సోమణ్ణ, కోలార్ ఎంపీ మల్లేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. సభ ముగిసేదాకా అభిమానులు ‘పవర్ స్టార్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. హెలికాప్టర్ వరకు ఆయన వెంట వచ్చి వీడ్కోలు పలికారు.