Share News

Polavaram Project: శభాష్‌.. వరదను నియంత్రించి డయాఫ్రంవాల్‌ నిర్మిస్తున్నారు!

ABN , Publish Date - Sep 01 , 2025 | 06:10 AM

శభాష్‌.. వరద ప్రవాహాన్ని 16 మీటర్లకే నియంత్రించి అత్యంత కీలకమైన డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం పనులను ఆగస్టులోనే చేపడతారని ఊహించలేదు. గత ఏడాది ఇదే సీజన్‌లో పోలవరంలో పర్యటించినప్పుడు....

Polavaram Project: శభాష్‌.. వరదను నియంత్రించి డయాఫ్రంవాల్‌ నిర్మిస్తున్నారు!

  • పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లకు అంతర్జాతీయ నిపుణుల అభినందన

  • గ్యాప్‌-2 పనుల్లో బంకమట్టి ప్రభావాన్ని తగ్గించేలా కాంక్రీట్‌ మిక్స్‌ చేయండి

  • కేంద్ర, అంతర్జాతీయ బృందాల సూచన

అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ‘‘శభాష్‌.. వరద ప్రవాహాన్ని 16 మీటర్లకే నియంత్రించి అత్యంత కీలకమైన డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం పనులను ఆగస్టులోనే చేపడతారని ఊహించలేదు. గత ఏడాది ఇదే సీజన్‌లో పోలవరంలో పర్యటించినప్పుడు.. డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణ పనులు ఇంత వేగంగా చేపడతారని ఊహించలేకపోయాం. వరదల సమయంలోనూ నిర్మాణ పనులు చేపట్టడం అభినందనీయం.’’ అని పోలవరం కాంట్రాక్టు సంస్థలు, ఇంజనీరింగ్‌ అధికారులను అంతర్జాతీయ నిపుణుల బృందం కొనియాడింది. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో మూడోరోజు ఆదివారం అంతర్జాతీయ నిపుణుల బృందం సభ్యులు, కేంద్ర జలశక్తి మం త్రిత్వశాఖ పరిధిలోని సంస్థల అధికారుల బృందం పర్యటించింది. ప్రధానంగా ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టే గ్యాప్‌-2 ప్రాంతంలో ఈ బృందాలు పర్యటించాయి. ఈ సందర్భంగా వరద నీటిని 16 మీటర్లకే పరిమితం చేసి, డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణానికి ఎలాంటి అవరోధం లేకుండా తీసుకున్న జాగ్రత్తలను కాంట్రాక్టు సంస్థలు బావర్‌, మేఘా, డిజైన్ల తయారీ సంస్థ ఆఫ్రీ వివరించాయి. ప్రాజెక్టులో కీలకమైన, సున్నితమైన డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడంపైనా అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్‌ సంతృప్తిని వ్యక్తం చేసింది. కాగా, గ్యాప్‌-2 ప్రాంతంలో నిర్మిస్తున్న డయాఫ్రమ్‌వాల్‌, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిజైన్‌ రూపొందించిన ఆఫ్రీకి నిపుణులు సూచించారు. ఈ ప్రాంతంలో లోతుకు వెళ్లే కొద్దీ ఇసుక కంటే బంకమట్టి ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు తెలిపారు.


ఈ బంకమట్టిలో కాంక్రీట్‌ మిక్స్‌ కలవడం అంత సులువు కాదని పేర్కొన్నారు. బంకమట్టి సిమెంట్‌ మిక్స్‌ను బలహీన పరుస్తుందని, దీంతో నిర్మాణ పటిష్ఠత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరించారు. బట్రస్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌వాల్‌, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ల నిర్మాణ పనుల్లో జాప్యం చోటుకుంటోందని, అనుకున్న సమయానికి జరగడం లేదని నిపుణులు గుర్తు చేశారు. భవిష్యత్తులో కార్యాచరణ ప్రణాళిక మేరకు పనులు పూర్తిచేయాలంటే ముందస్తుగా ప్రాజెక్టు డిజైన్లను సిద్ధం చేసుకుని, ఏయే పనికి ఎన్ని రోజులు పడుతుందో అవగాహన పెంచుకోవాలని సూచించారు. కాగా, ఆదివారం కేంద్ర బృందం సభ్యులు ఢిల్లీకి వెళ్లిపోయారు. అంతర్జాతీయ నిపుణుల బృందంలోని సభ్యులు సోమవారం విజయవాడకు వచ్చి ఇక్కడ నుంచి వారివారి దేశాలకు వెళ్లనున్నారు.

Updated Date - Sep 01 , 2025 | 06:10 AM