Share News

Cyber Crime: అంతర్జాతీయ సైబర్‌ ముఠా అరెస్టు

ABN , Publish Date - Nov 01 , 2025 | 03:56 AM

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళా న్యాయవాదికి అంతర్రాష్ట్ర సైబర్‌ ముఠా ఫోను చేసింది.. అమెరికాలో ఉన్న ఆమె కుమారులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ డిజిటల్‌ అరెస్టు పేరుతో బెదిరించింది..

Cyber Crime: అంతర్జాతీయ సైబర్‌ ముఠా అరెస్టు

  • డిజిటల్‌ అరెస్టు పేరుతో మహిళా న్యాయవాదికి బెదిరింపు.. రూ.52 లక్షలు కొల్లగొట్టిన ముఠా

  • ఏలూరు పోలీసులకు ఫిర్యాదు

  • రంగంలోకి మూడు బృందాలు

  • యూపీ, ఢిల్లీ, మహారాష్ట్రలో 8 మంది అరెస్టు

  • బంగ్లాదేశ్‌కు పారిపోయిన కీలక సూత్రధారులు

  • దేశంలో రూ.100 కోట్లకు పైగా స్వాహా

అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళా న్యాయవాదికి అంతర్రాష్ట్ర సైబర్‌ ముఠా ఫోను చేసింది.. అమెరికాలో ఉన్న ఆమె కుమారులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ డిజిటల్‌ అరెస్టు పేరుతో బెదిరించింది.. ఆమెను భయపెట్టి రూ.52 లక్షలు ఆన్‌లైన్‌ ద్వారా లాగేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఏలూరుకు చెందిన మహిళా న్యాయవాది రమాదేవి(66)కి సెప్టెంబరు చివరి వారంలో వాట్సాప్‌ ద్వారా వీడియో కాల్‌ వచ్చింది. అవతల యూనిఫాం వేసుకున్న నకిలీ పోలీసులు.. ‘మీ బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ ఇదేనా.? మీ అధార్‌ కార్డు ఇదే కదా.. మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు కదా..! వాళ్లు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు.. మీతో పాటు వాళ్లు కూడా అరెస్టవుతారు’ అని బెదిరించాడు. కాసేపట్లో మరొక యూని ఫాం అధికారి వీడియో కాల్‌ చేసి.. మీ పిల్లల భవిష్యత్‌ పాడవుతుంది.. ఎవరికీ చెప్పకుండా సమస్యను పరిష్కరించుకోవాలని బేరం పెట్టాడు.. ఇంకొకడు లైన్లోకి వచ్చి వేరే రూపంలో బెదిరించాడు.. ఇలా నాలుగు రోజుల పాటు ఆమెను బెదిరించి రూ.52 లక్షలు కాజేశారు. ఆమె బాధతో రోజూ మాట్లాడే బంధువులకు కూడా ఫోన్‌ చేయలేదు. వారికి అనుమానమొచ్చి ఆరా తీశారు. ఆమె అసలు విషయం చెప్పగా... అదంతా సైబర్‌ నేరగాళ్ల పని అని వారు గ్రహించి ఏలూరు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో.. ఈ ముఠాకు ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ అటు నుంచి బంగ్లాదేశ్‌ వరకూ లింకులు బయటపడ్డాయి. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిశోర్‌ ముగ్గురు సీఐలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.


ఉత్తరాదికి బృందాలు..

ఈ మూడు బృందాలు ఆ 3 రాష్ట్రాలకు వెళ్లాయి. అక్కడ క్షుణ్ణంగా విచారించడంతో అసలు సూత్రధారులిద్దరూ యూపీ నుంచి ఢిల్లీకి.. అక్కడి నుంచి బంగ్లాదేశ్‌కు పారిపోయినట్లు తేలింది. 15 మందితో కూడిన ఈ ముఠా యూపీలోని ఒక ఇల్లు అద్దెకు తీసుకుని.. పోలీసు యూనిఫాం ధరించి రమాదేవిని బెదిరించారు. ఈ సైబర్‌ కేటుగాళ్ల కోసం పలు రాష్ట్రాల్లో గాలించిన ఏలూరు పోలీసు బృందాలు ఎట్టకేలకు 8 మందిని.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన పర్వీన్‌ సోనవనే (43), శర్మ(24), నితిన్‌ మిశ్రా అలియాస్‌ విక్రమ్‌(20), హర్షిత్‌ మిశ్రా అలియాస్‌ జై సింగ్‌(21), అభిషేక్‌ కాశ్యప్‌(22), గోపాల్‌ యాదవ్‌(24).. మహారాష్ట్రకు చెందిన సందీప్‌ సురేశ్‌ అలోని(55), హిమత్‌రావు పంజార్‌(42)లను అరెస్టు చేసి విచారించాయి. ఈ ముఠా బంగ్లాదేశ్‌కు చెందిన కొందరితో, నైజీరియా గ్యాంగ్‌తో కుమ్మక్కై రెండేళ్లుగా పలు రాష్ట్రాల్లో ఆరేడు వందల మందిని మోసగించి, బెదిరించి రూ.100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు వెల్లడైంది.

ముఠా పనిచేసేది ఇలా..

ఎక్కడికక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని.. రిక్షా వాళ్లు, కూలీలకు డబ్బులిచ్చి.. బ్యాంకు అకౌం ట్లు తెరుస్తారు. పాస్‌ బుక్‌, ఏటీఎం కార్డు, సిమ్‌ వారి పేర్లతోనే తీసుకుంటారు. ఇందుకోసం వారికి రూ.10 వేల నుంచి 15 వేల వరకు చెల్లిస్తారు. వ్యాపారం కోసమని ఆ అకౌంట్లు వాడుకుంటారు. రూ.కోట్లు వసూలు చేసి.. ఆ అకౌంట్లలోని మొత్తాన్ని బంగ్లాదేశ్‌కు.. అటు నుంచి నైజీరియా ముఠాలకు చేరవేస్తున్నారు. ఈ ముఠాలోని 8 మందితోపాటు 10-15 వేలకు బ్యాంకు అకౌంట్లు అమ్ముకున్నవారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అసలు సూత్రధారుల కోసం వేట కొనసాగిస్తున్నారు.

Updated Date - Nov 01 , 2025 | 03:57 AM