Share News

Gajuwaka Cyber Den: 20 కోట్లు కొల్లగొట్టి.. సీఐడీకి చిక్కి..

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:19 AM

చైనా నుంచి ఎయిర్‌ కార్గోలో సిమ్‌ బాక్స్‌లు తీసుకొస్తారు.. భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో డెన్‌లు ఏర్పాటు చేసుకొని..

Gajuwaka Cyber Den: 20 కోట్లు కొల్లగొట్టి.. సీఐడీకి చిక్కి..

  • గాజువాకలో అంతర్జాతీయ సైబర్‌ ముఠా అరెస్ట్‌

  • దేశంలో పలుచోట్ల డెన్లు ఏర్పాటు చేసుకుని మోసాలు

  • ఏపీలో రూ.20 కోట్లకు పైగా దోచుకున్న నేరగాళ్లు

  • వియాత్నాం, కాంబోడియా, లావోస్‌ నుంచి ప్లాన్‌ అమలు

  • కింగ్‌ పిన్‌ హో హుడే సహా ఏడుగురు కేటుగాళ్లు అరెస్టు

  • సీఐడీ ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా వెల్లడి

అమరావతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): చైనా నుంచి ఎయిర్‌ కార్గోలో సిమ్‌ బాక్స్‌లు తీసుకొస్తారు.. భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో డెన్‌లు ఏర్పాటు చేసుకొని.. ఇక్కడ వందల కొద్దీ సిమ్‌ కార్డులు అక్రమంగా సేకరిస్తారు...! కాంబోడియా, వియత్నాం వంటి దేశాల నుంచి మొత్తం వ్యవహారం నడిపిస్తారు.. ప్రజలకు ఫోన్లు చేసి డిజిటల్‌ అరెస్ట్‌ మొదలు రకరకాల దర్యాప్తు సంస్థల పేరుతో బెదిరిస్తారు.. ఇలా ఏపీలోనూ చాలా మందికి ఫోన్లు చేసి రూ.20 కోట్లకు పైగా కొల్లగొట్టారు.. విశాఖపట్నంలోని గాజువాక (పెదగంట్యాడ) నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ తీగలాగింది. సీఐడీ సీఐ గోపీనాథ్‌ లాగిన క్లూ తో దేశవ్యాప్తంగా విస్తరించిన సైబర్‌ ముఠా గుట్టు రట్టయింది. వియాత్నాంకు చెందిన కింగ్‌ పిన్‌ హో హుడే సహా ఏడుగురిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి 14 సిమ్‌ బాక్స్‌లు, 1,496 సిమ్‌ కార్డులు, 22 సెల్‌ ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు, రౌటర్లు, సీసీ కెమెరాలు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు ఫోన్లు చేసి అందినకాడికి లాగేస్తూ... మరోవైపు అంతర్జాతీయ కాల్స్‌ను దేశీయ కాల్స్‌గా మార్చి టెలికం సర్వీస్‌ ప్రొవైడర్ల ఆదాయానికీ గండికొట్టిన సైబర్‌ నేరగాళ్లను జైలుకు పంపారు. ఏపీ సీఐడీలోని సైబర్‌ వింగ్‌ ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా.. డీఎస్పీ రవికిరణ్‌ శుక్రవారం మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో వివరాలు విలేకరులకు వివరించారు.


గాజువాకలో సైబర్‌ డెన్‌..!

రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్‌ నేరాల్లో ఆర్థిక మోసాలు అత్యధికం. అందులోనూ డిజిటల్‌ అరెస్టు పేరుతో భయపెట్టి డబ్బులు గుంజడం బాగా ఎక్కువైంది. కొన్ని నెలలుగా ఏపీలోని పలు ప్రాంతాల నుంచి బాధితులు చేస్తోన్న ఫిర్యాదులపై కూపీ లాగే క్రమంలో విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో సైబర్‌ నేరగాళ్ల డెన్‌ ఉన్నట్లు సైబర్‌ వింగ్‌ కీలక సమాచారం రాబట్టింది. వైజాగ్‌లో మొదలెట్టి ఒడిశాలోని రూర్కేలా, బిహార్‌లోని నలంద, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, తెలంగాణలోని హైదరాబాద్‌, గోవా లాంటి ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని అక్కడ డెన్‌లు ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ సైబర్‌ ముఠా ఏకకాలంలో 64 నుంచి 128 కాల్స్‌ మాట్లాడే కెపాసిటీ ఉన్న సిమ్‌ బాక్స్‌లు ఏర్పాటు చేసుకుంది. ఈ సిమ్‌ బాక్సులను చైనా నుంచి దిగుమతి చేసుకుంది. ఇక్కడ టెలిగ్రామ్‌ యాప్‌లో సంప్రదించి ఏడుగురి ద్వారా 1,496 సిమ్‌ కార్డులు సేకరించిన ఈ ముఠా రాష్ట్రంలోని అమాయకులకు ఫోన్లు వేసి బెదిరించేది. కాంబోడియాకు చెందిన సైబర్‌ కింగ్‌ పిన్‌లు ప్రతి డెన్‌కూ వచ్చి ఎలా మోసం చేయాలనే దానిపై శిక్షణ ఇచ్చి వెళ్లే వారు. ఇక్కడి తెలుగు, ఒరియా, బెంగాలీ, మరాఠీ, హిందీ తెలిసిన వారిని ఉద్యోగాల పేరిట మోసం చేసి ఈ రొంపిలోకి దింపేవారు. ఈ మూఠా మయన్మార్‌, లావోస్‌, కాంబోడియా, వియాత్నం దేశాల నుంచి మొత్తం వ్యవహారం నడిపిస్తోంది. సీఐడీ సైబర్‌ విభాగం, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ నుంచి కీలక సభ్యులు బృందాలుగా ఏర్పడి ఈ ముఠా ఆట కట్టించారు. మరికొంత మంది పరారీలో ఉన్నారని సీఐడీ అధికారులు వెల్లడించారు. ఇటువంటి కాల్స్‌పై జాగ్రత్తగా ఉండాలని, సైబర్‌ నేరగాళ్ల నుంచి ఫోన్లు వస్తే, 1930కు తెలియజేయాలని చెప్పారు.

Updated Date - Dec 27 , 2025 | 04:20 AM