Share News

Airport: పెదపరిమి పరిసరాల్లో విమానాశ్రయం

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:04 AM

రాజధాని అమరావతిలోని పెదపరిమి చుట్టుపక్కల ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు అంశం పరిశలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అమరావతికి దక్షిణ దిక్కున దీనిని నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.

Airport: పెదపరిమి పరిసరాల్లో విమానాశ్రయం

విజయవాడ, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలోని పెదపరిమి చుట్టుపక్కల ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు అంశం పరిశలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అమరావతికి దక్షిణ దిక్కున దీనిని నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. కొండలు, నీటి ప్రవాహాలు లేకపోవడంతో ఈ ప్రాంతంపై దృష్టి సారించినట్లు సమాచారం. సీఆర్‌డీఏ అమరావతి జోనల్‌ డెవల్‌పమెంట్‌ ప్లాన్‌ ప్రకారం చూసినా.. విమానాశ్రయం వంటి వాటికి ఉండవల్లి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదపరిమి పరిసరాలు అనువుగా ఉంటాయని చెబుతున్నారు. రాజధానిని మరింతగా విస్తరించేందుకు సీఆర్‌డీఏ రెండోదశ భూ సమీకరణ చేపట్టనున్న ప్రాంతాల్లోనే అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకానుంది. అమరావతి విమానాశ్రయానికి సంబంధించి టెక్నికల్‌ ఫీజిబిలిటీ నివేదిక కోసం ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఏడీసీఎల్‌) గతంలోనే ఆర్‌ఎ్‌ఫపీ (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) పిలిచింది. అయితే కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన నివేదికపై సీఆర్‌డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ఏడీసీఎల్‌ కూడా ఇదే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ రంగంలో నైపుణ్యం కలిగిన సంస్థలకు సాంకేతిక నివేదిక రూపకల్పన బాధ్యతను అప్పగించారు. ఈ నివేదిక వస్తే ఎయిర్‌పోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపై మరింత స్పష్టత వస్తుంది. అమరావతి- గుంటూరు మధ్య విమానాశ్రయం ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - Jun 30 , 2025 | 04:06 AM