Internal Probe into Agro Industrie: ఆగ్రోస్‌లో అంతర్గత విచారణ
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:20 AM
ఆగ్రోస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ)లో అవకతవకలపై అంతర్గత విచారణ జరుగుతోంది
టెండర్లలో అవకతవకలపై ప్రభుత్వం ఆరా
గత ప్రభుత్వంలో తప్పులన్నీ బయటికి తీస్తాం: చైర్మన్
త్వరలో సీఎంకు నివేదిక ఇస్తానని వెల్లడి
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఆగ్రో్‌స(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ)లో అవకతవకలపై అంతర్గత విచారణ జరుగుతోంది. ఆగ్రో్‌సలో రచ్చ, చర్చకు దారితీసిన పరిస్థితులపై ఓ వైపు ప్రభుత్వం ఆరా తీస్తుండగా, మరోవైపు తాజా పరిణామాలపై సీఎంకు నివేదిక ఇవ్వనున్నట్లు సంస్థ చైర్మన్ సుబ్బానాయుడు తెలిపారు. ఇటీవల వాటర్‌షెడ్ పరికరాల టెండర్ల నిబంధనలు మార్చిన విషయంలో కాంట్రాక్ట్ ఉద్యోగిని బదిలీ చేశారు. అలాగే, కంపెనీలకు, మంత్రి కార్యాలయానికి మధ్యవర్తిగా వ్యవహరించాలంటూ ఓఎస్డీ ఒత్తిడి చేస్తున్నారని, మాట వినలేదని బదిలీ చేయడంతో సెలవుపై వెళ్లినట్లు సీఎ్‌సకు జనరల్ మేనేజర్ లేఖ రాసినట్లు బయటకు రావడంతో ఆగ్రో్‌సలో రచ్చ అయ్యింది. అయితే జీఎంను బదిలీ చేయలేదని ఆగ్రోస్ చైర్మన్ అంటున్నారు. అలాగే, జీఎం తనంతట తానే సెలవుపై వెళ్లినట్లు ఆగ్రోస్ ఎండీ డిల్లీరావు చెప్తున్నారు. జీఎం రాసినట్లు చెప్తున్న లేఖ తనకు అందలేదని బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. మరోవైపు మంత్రి ఓఎస్డీ పోలినాయుడు సీఎ్‌సను కలిశారు. జీఎం బదిలీ కాలేదని, సెలవుపై వెళ్లాలని ఆయనను తాను బెదిరించలేదని వివరణ ఇచ్చారు. టెండర్ల అవకతవకలకు జీఎం కారణమన్నారు. జీఎం రాసినట్టు చెబుతున్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని సీఎ్‌సను కోరారు. జీఎంపై గతంలో అవినీతి అభియోగాలతో క్రిమినల్ కేసు ఉన్న విషయాన్నీ సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఓఎస్డీ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, గత టీడీపీ ప్రభుత్వంలో రైతురథం పథకంలో నిర్ధేశిత మోడల్ కాకుండా, మరో రకం ట్రాక్టర్లు సరఫరా చేసి, రైతుల నుంచి అధిక సొమ్ము వసూలు చేసిన విషయంలో టెక్నికల్ హెడ్‌గా ఉన్న జీఎం అనుసరించిన వ్యవహారంపై నిజనిర్ధారణ జరిగినా.. ఉన్నతాధికారులు ఏ చర్యా తీసుకోలేదని తెలిపారు. గత డిసెంబరులో వ్యవసాయశాఖ భూసార పరీక్ష కేంద్రాలకు అవసరమైన పరికరాల సరఫరా విషయంలో టెండర్లు లేకుండా డొల్ల కంపెనీలకు వర్క్‌ఆర్డర్ ఇవ్వడం, మాన్యువల్ ఇన్వాయిస్ ద్వారా వాటిని ఆమోదించిన విషయాన్ని కూడా సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవలి వాటర్ షెడ్ పరికరాల టెండర్ల వ్యవహారాన్నీ సీఎ్‌సకు వివరించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులతో సహా అన్ని వ్యవహారాలపైనా విచారణ చేస్తున్నట్లు ఆగ్రోస్ చైర్మన్ సుబ్బానాయుడు బుధవారం రాత్రి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ఒక రెగ్యులర్, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి అవకతవకలకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. కర్నూలులో రూ.150కోట్ల విలువైన ఆగ్రోస్ స్థలానికి గత ప్రభుత్వంలో ఏడాదికి రూ.వెయ్యికి లీజుకిచ్చి, పార్టీ ఆఫీస్ కట్టారని, ఇలాంటి వ్యవహారాలన్నీ బయటకు తీస్తామన్నారు. అన్ని విషయాలపై సీఎంకు త్వరలో నివేదిక ఇస్తానని చెప్పారు.