Internal Conflict: కలకలమా.. కకావికలమా
ABN , Publish Date - Sep 23 , 2025 | 04:54 AM
ఒకరు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధిగా ఇటీవలే ఎన్నికైన నాయకుడు మరొకరు పార్టీ అగ్రనేత సాయుధ పోరాటమే మా పంథా అని తేల్చి చెబుతూ ఇద్దరూ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
మావోయిస్టు పార్టీలో అంతర్గత సంక్షోభం!?
సోనూ స్థానంలో అధికార ప్రతినిధిగా ‘కోసా’
వికల్ప్‌తో కలిసి ‘సాయుధ పంథా’పై తొలి ప్రకటన
అది వెలుగు చూడకముందే ఇద్దరూ ఎన్‌కౌంటర్
ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఒకేచోట ఎలా?
తాజా పరిణామాలపై భిన్న వాదనలు, అనుమానాలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఒకరు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధిగా ఇటీవలే ఎన్నికైన నాయకుడు! మరొకరు పార్టీ అగ్రనేత! ‘సాయుధ పోరాటమే మా పం థా’ అని తేల్చి చెబుతూ ఇద్దరూ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే.. అది వెలుగు చూడకముందే వారిద్దరూ ఎన్‌కౌంటర్ అయ్యారనే వార్త బయటి ప్రపంచానికి తెలిసింది. ఆ ఇద్దరు అగ్రనేతలే.. కోసా(కడారి సత్యనారాయణ), వికల్ప్(కట్టా రామచంద్రారెడ్డి). వీరిద్దరూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులే. ‘సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ ఇటీవల పార్టీ అగ్రనేత సోనూ విడుదల చేసిన ప్రకటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తదుపరి పరిణామాలతో సోనూను పార్టీ అధికార ప్రతినిధి గా తప్పించి... ఆ స్థానంలో కోసా అలియాస్ కడారి సత్యనారాయణను నియమించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఆయన వికల్ప్ (కట్టా రామచంద్రా రెడ్డి)తో కలిసి ‘అభయ్’ పేరుతో ఈనెల 20వ తేదీ(శనివారం) ఒక ప్రకటన విడుదల చేశారు. సోనూ ప్రకటనను ఖండిస్తూ లేఖను రాశారు.
అసలేం జరుగుతోంది...
అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ... మావోయిస్టు పార్టీ ‘సాయుధ పోరాటమే’ పంథాగా కొనసాగుతోంది. ఇప్పుడు తొలిసారి ఆ ప్రాథమిక సూత్రంపైనే విభేదాలు రాజుకున్నాయి. కొందరు రాజీబాట పట్టగా.. ప్రాణంపోయినా పోరాడాల్సిందే అని మరికొందరు తేల్చిచెబుతున్నారు! స్వయనా కేంద్ర కమిటీ లోనే రెండు భిన్న వాదనలు మొదలయ్యాయి. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ ‘సాయుధ పోరా ట విరమణ’ వైఖరి తీసుకున్నారు. అధికార ప్రతినిధి హోదాలో ‘అభ య్’ పేరిట ఆయన దీనిపై ప్రకటన చేశారు. అంతకు ముందు పార్టీకి ఆయన 6 పేజీల లేఖ రాశారు. అందులో పార్టీ వైఫల్యాలను ప్రస్తావించారు. మరో వర్గం అంటే.. గణపతి, మల్లా రాజిరెడ్డి, ప్రసాదరావు, తిప్పిరి తిరుపతి, కోసా(కడారి సత్యనారాయణ), వికల్ప్(కట్టా రామచంద్రారెడ్డి) తదితరులు సాయుధ పోరాట మార్గమే సరైన పంథా అని నమ్ముతున్నారు. ఇటీవలి కాలంలో కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సమావేశాలూ జరుపుకోలేని పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో సోనూ తన వాదనను ప్రకటన రూపంలో విడుదల చేసి ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన వాదనను బలపరిచే మరో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులతో కలిసి సోనూ ప్రత్యేకంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. మూల సిద్ధాంతానికి విరుద్ధంగా, కేంద్ర కమిటీతో చర్చించకుండా సోనూ చేసిన ప్రకటనను పార్టీ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఆయనను అధికార ప్రతినిధి హోదా నుంచి తప్పించారని సమాచారం. ఆయన స్థానంలో కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు కోసాను ఎంపిక చేశారని తెలిసింది. ఈనెల 20వ తేదీతో మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట కోసా, దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధి హోదాలో వికల్ప్ ఒక ప్రకటన విడుదల చేశారు. తీరా చూస్తే... వారి ప్రకటన ఇంకా మీడియాకు చేరకముందే ఇద్దరు నేతలు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
ఒకే చోట ఎలా?
తీవ్ర నిర్బంధ పరిస్థితుల్లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఒకేచోట చేరడం జరిగే పని కాదని కొందరి అభిప్రాయం. అంటే... వారి కదలికల గురించి పోలీసు బలగాలకు ముందే తెలిసి ఉంటుందని, పార్టీలో ప్రస్తుతం నెలకొన్న ‘అలజడి’కీ, ఇద్దరు అగ్రనేతల కదలికలు బయటికి పొక్కడానికీ మధ్య సంబంధం ఉండొచ్చునని అనుమానిస్తున్నారు. కాగా, కోసా, వికల్ప్‌లను కోవర్టు ఆపరేషన్‌లో భాగంగా చంపేశారని రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఆరోపించింది. ఆ ఎన్ కౌంటర్ బూటకమని కమిటీ ప్రధాన కార్యదర్శి బల్లా రవీంద్రనాథ్ పేర్కొన్నారు.
ఆయుధాలు దించేది లేదు
సోనూది ఉద్యమ ద్రోహమే.. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన
సోనూ ప్రకటనను ఖండిస్తూ అభయ్, వికల్ప్ పేరిట ఈనెల 20వ తేదీన వెలువడిన ప్రకటనలోని ముఖ్యాంశాలివి...
‘‘సాయుధ పోరాటమే పార్టీ విధానం. దానికే కట్టుబడి ముందు కు సాగుతాం. అలాగే... శాంతి చర్చలను కూడా బలంగా కోరుకుంటున్నాం. చర్చలను సులభతరం చేసే ప్రయత్నాలకు ప్రతిస్పందన గా మా పార్టీ ప్రధాన కార్యదర్శి, అమరవీరుడు బస్వరాజు ఆయుధాలు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని సోనూ చేసిన ప్రకటన సత్యాన్ని వక్రీకరించడమే. దీనిపై అందరి అభిప్రాయాలను కోరడం పార్టీని విచ్ఛిన్నం చేయడానికి చేసిన దుష్టకుట్ర. దీనిని విరమించుకోవాలని సోనూను కోరుతున్నాం. పార్టీ సాయుధ విప్లవ పంథా ఓడి పోయిందని, అనేక వ్యూహాత్మక, అతివాద తప్పిదాల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని సోనూ రాశారు. పార్టీ విధానం తప్పయితే, ఆయన ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించి అంతర్గత చర్చ ప్రారంభించవచ్చు. కానీ, ఆయన అలా చేయడానికి ఇష్టపడటం లేదు. ఆయుధాలు వీడటం అంటే శత్రువుకు లొంగిపోవడమే. సో నూ, అతని సహచరులు శత్రువుకు లొంగిపోవాలనుకుంటే లొంగిపోవచ్చు. అలా లొంగిపోవాలనుకుంటే వారి వద్ద ఉన్న ఆయుధాల ను పార్టీకి అప్పగించాలి. లేదంటే వాటిని స్వాధీనం చేసుకోవాలని పీఎల్‌జీఏను కోరుతున్నాం.’’