Share News

Inter Education Board: ఇంటర్‌ పాస్‌ మార్కులు మారాయ్‌

ABN , Publish Date - Oct 22 , 2025 | 04:55 AM

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తీసుకొచ్చిన కీలక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. రాబోయే పబ్లిక్‌ పరీక్షల్లో ఈ మార్పులు కనిపించనున్నాయి.

Inter Education Board: ఇంటర్‌ పాస్‌ మార్కులు మారాయ్‌

  • గణితం 35.. ఫిజిక్స్‌, కెమిస్ర్టీ, బయాలజీ 29

  • కొత్త విధానంపై కాలేజీలకు విద్యామండలి సమాచారం

  • గణితంలో ఇక నుంచి ఒక్కటే పేపర్‌

  • ఎలక్టివ్‌ సబ్జెక్టు ఆధారంగా మారనున్న మార్కులు

అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తీసుకొచ్చిన కీలక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. రాబోయే పబ్లిక్‌ పరీక్షల్లో ఈ మార్పులు కనిపించనున్నాయి. మార్పుల అనంతరం కొత్తవిధానం ఎలా ఉంటుందనే సమాచారాన్ని ఇంటర్‌ విద్యా మండలి తాజాగా కాలేజీలకు పంపింది. ఈ ఏడాది నుంచి గణితం ఒక్కటే సబ్జెక్టు ఉంది. ఇప్పటివరకూ 1ఏ, 1బీ ఉండగా వాటిని ఒక్కటిగా మార్చింది. గతంలో ఒక్కో పేపర్‌ 75 మార్కుల చొప్పున (పాస్‌ మార్కులు 26) పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ఇంటర్‌ రెండేళ్లు గణితం ఒక్కటే పేపర్‌గా 100 మార్కుల చొప్పున పరీక్షలు జరుగుతాయి. అందులో 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులవుతారు. ఇక బైపీసీలో బోటనీ, జువాలజీని కలిపి బయాలజీగా మార్చారు. ఈ పేపరు 85 మార్కులకు ఉంటుంది. ఫస్టియర్‌లో 29 మార్కులు రావాలి. అదే సెకండియర్‌లో 30 మార్కులు వస్తే ఆ విద్యార్థులు పాస్‌ అయినట్లు లెక్క! ఫిజిక్స్‌, కెమిస్ర్టీ సబ్జెక్టుల్లోనూ ఇవే మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఆయా సబ్జెక్టులకు గతంలో 60 మార్కుల చొప్పున పరీక్ష జరుపుతుండగా.. పాస్‌ మార్కులు 21గా ఉండేవి. కాగా, ప్రస్తుతం సెకండియర్‌ చదువుతున్న వారికి, గతంలో ఫెయిల్‌ అయి పరీక్షలు రాస్తున్న వారికి కొత్త మార్పులు వర్తించవు. మరోవైపు ఈ ఏడాది నుంచి కొత్తగా ఎలక్టివ్‌ సబ్జెక్టు విధానం తీసుకొచ్చారు.


ఏ గ్రూపు విద్యార్థులైనా మొత్తం 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. అందువల్ల విద్యార్థులు తీసుకునే సబ్జెక్టు ఆధారంగా ఫస్టియర్‌ మార్కులు మారతాయి. సైన్స్‌ సబ్జెక్టులైతే 85 మార్కులు, ఆర్ట్స్‌ సబ్జెక్టులైతే 100 మార్కులు ఉంటాయి. మొత్తంగా రెండేళ్లలో వెయ్యి మార్కులకు పరీక్షలు జరుగుతాయి. ఫిజిక్స్‌, కెమిస్ర్టీ, బయాలజీ విద్యార్థులకు రెండేళ్లకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్‌ ఉంటాయి. అలాగే ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు మరో వెసులుబాటు కూడా ఉంది. అదనంగా మరో సబ్జెక్టును కూడా తీసుకుని చదవొచ్చు. అయితే అవి మొత్తం మార్కుల్లో కలపరు. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితంను మాత్రమే అదనపు సబ్జెక్టుగా తీసుకోవచ్చు. ఎలక్టివ్‌ సబ్జెక్టు విధానం అమల్లోకి రావడంతో పరీక్షల షెడ్యూలు పెరిగింది.

Updated Date - Oct 22 , 2025 | 04:56 AM