Share News

Fake Ghee: కల్తీ నెయ్యి కేసు విచారణకు బ్రేక్‌

ABN , Publish Date - Jun 21 , 2025 | 03:55 AM

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించిన కేసు దర్యాప్తునకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.

Fake Ghee: కల్తీ నెయ్యి కేసు విచారణకు బ్రేక్‌

  • సిట్‌లో ఏఎస్పీ వెంకట్రావు ఇచ్చే నోటీసులు చెల్లవన్న హైకోర్టు

  • ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు సీబీఐ?

తిరుపతి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించిన కేసు దర్యాప్తునకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.సుప్రీంకోర్టు ఆదేశాలతో కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు చేపట్టిన సిట్‌లో దర్యాప్తు అధికారిగా తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్‌) జె.వెంకట్రావును నామినేట్‌ చేస్తూ సీబీఐ డైరెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ ఇవ్వడాన్ని హైకోర్టు ఆక్షేపించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌లో ఆయన సభ్యుడిగా లేరని, విచారణ కోసం వ్యక్తులకు ఆయన ఇచ్చే నోటీసులు చెల్లవని గురువారం స్పష్టంచేసింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు తాత్కాలికంగా ఆగినట్లయింది.


దీంతో సీబీఐ ఉన్నతాధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాల ప్రకారం కౌంటర్‌ దాఖలు చేస్తూనే.. దాని ఆదేశాలపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత పొందాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేసు దర్యాప్తునకు తిరుపతి కేంద్రం కావడం, అడ్మిన్‌ అదనపు ఎస్పీ తిరుపతిలోనే ఉండటంతో దర్యాప్తు అధికారిగా ఆయనను నియమించామని సుప్రీంకోర్టుకు నివేదించనున్నారు.

Updated Date - Jun 21 , 2025 | 06:38 AM