Pro-Chancellor Manchu Vishnu: ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:05 AM
మోహన్‌బాబు విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని సంస్థ ప్రో చాన్స్‌లర్ మంచు విష్ణు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫార్సులపై...
ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ సిఫారసులను వ్యతిరేకిస్తున్నాం
మోహన్‌బాబు విశ్వవిద్యాలయం ప్రో చాన్స్‌లర్ మంచు విష్ణు
చంద్రగిరి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): మోహన్‌బాబు విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని సంస్థ ప్రో చాన్స్‌లర్ మంచు విష్ణు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫార్సులపై ఆయన బుధవారం ఒక ప్రకటనలో స్పందించారు. ‘ఉన్నత విద్యా మండలి సిఫార్సులను ఎంబీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవి కేవలం సిఫార్సులు మాత్రమే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అవి విచారణలో ఉన్నాయి. పరిశీలించిన హైకోర్టు... సిఫార్సులకు వ్యతిరేకంగా, విశ్వవిద్యాలయానికి అనుకూలంగా స్టే ఉత్తర్వును జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ సిఫారసులను పోర్టల్లో పెట్టడం దురదృష్టకరం. ఈ సిఫార్సులు సరికాదని ఎంబీయూ గట్టిగా విశ్వసిస్తోంది. దీనిపై విచారణ జరుపుతున్న హైకోర్టు ఎంబీయూకు న్యాయం చేకూరుస్తుందన్న విశ్వాసంతో ఉన్నాం. విద్య, సమాజ సేవలో సహాయ సహకారాలు బహిరంగ రికార్డుల్లో ఉన్నప్పటికీ, దురుద్దేశంతో కొంతమంది పదేపదే విమర్శిస్తున్నారు. కొద్దిమంది సభ్యులతో ఏర్పడిన కమిటీ, ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయంలో స్వల్ప పరిపాలన అంశాలను పెద్దవిగి పెంచి చూపి అనవసర వివాదాన్ని సృష్టించడం దురదృష్టకరం. విచారణ సమయంలో మోహన్‌బాబు విశ్వవిద్యాలయం బృందం మాకు పూర్తిగా సహకరించిందని అదే కమిషన్ తన నివేదికలో పేర్కొనడం ఎలాంటి తప్పు జరగలేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది. మాకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తున్న వేలాది మంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని విష్ణు ఆ ప్రకటనలో తెలిపారు.