హోరాహోరీగా..
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:20 AM
యోనెక్స్ సన్‌రైజ్ జాతీయ స్ర్తీ, పురుషుల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం టీం చాంపియన్‌షిప్ విభాగంలో జరిగిన ఫైనల్స్ ఉత్కంఠ రేపాయి. పురుషుల విభాగంలో తమిళనాడు, హరియాణ, మహిళల విభాగంలో హరియాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు మధ్య పోరు ఉత్కంఠగా సాగింది.
- కొనసాగుతున్న జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు
- రెండో రోజూ అదే జోరు
- టీం చాంప్ విభాగంలో ముగిసిన పోటీలు
- టీం చాంప్ పురుషుల విభాగం విన్నర్ తమిళనాడు, రన్నర్ హరియాణ
- ఏపీ మహిళల జట్టుకు రన్నరప్
- విజేతలకు కలెక్టర్ లక్ష్మీశ బహుమతుల ప్రదానం
- నేటి నుంచి వ్యక్తిగత విభాగంలో జాతీయ పోటీలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీ):
యోనెక్స్ సన్‌రైజ్ జాతీయ స్ర్తీ, పురుషుల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం టీం చాంపియన్‌షిప్ విభాగంలో జరిగిన ఫైనల్స్ ఉత్కంఠ రేపాయి. పురుషుల విభాగంలో తమిళనాడు, హరియాణ, మహిళల విభాగంలో హరియాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు మధ్య పోరు ఉత్కంఠగా సాగింది. రెండు విభాగాల్లో బెస్ట్ ఆఫ్ ఫైవ్ పోటీలు ఆకట్టుకున్నాయి. టీం చాంపియన్‌షిప్ విభాగం పోటీలకు దేశ వ్యాప్తంగా ఆరు జోన్‌లు ప్రాతినిధ్యం వహించాయి. సోమవారం క్వార్టర్స్, సెమీ ఫైనల్స్ పోటీలు జరిగాయి. సెమీస్ పురుషుల విభాగంలో తమిళనాడు, హరియాణ, మహిళల విభాగంలో హరియాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన ఫైనల్స్‌లో మూడు సింగిల్స్, రెండు డబుల్స్ పోటీలు జరిగాయి. ఈ ఐదు గేమ్స్‌లో మూడు గెలిచిన జట్లు టైటిల్‌ను దక్కించుకున్నాయి.
పురుషుల విన్నర్ తమిళనాడు, రన్నర్ హరియాణ
ఫైనల్స్ బెస్ట్ ఆఫ్ ఫైవ్ మ్యాచ్‌లలో హరియాణపై తమిళనాడు 3-2 తేడాతో నెగ్గి విన్నర్ ట్రోఫీని అందుకుంది. ఈ రెండు జట్ల మధ్య పోరు ఉత్కంఠను రేపింది. మొదటి సింగిల్స్, రెండో సింగిల్స్‌ను తమిళనాడు గెలుచుకుని 2-0 ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అయితే ఆ తర్వాత జరిగిన మొదటి డబుల్స్‌లో అనూహ్యంగా హరియాణ పుంజుకుని స్కోర్ 2-1కి తగ్గించింది. మూడో సింగిల్స్‌లో సైతం హరియాణ నెగ్గి స్కోర్ 2-2 సమం చేసి తమిళనాడు దూకుడుకు కళ్లెం వేసింది. దీంతో చివరి డబుల్స్‌లో ఇరు జట్లు చెమటోడ్చాయి. తుదకు హరియాణపై 2-3 తేడాతో తమిళనాడు గెలిచి చాంప్ విజేతగా నిలిచింది. హరియాణ జట్టు రన్నర్ ట్రోఫీని అందుకుంది.
మహిళల విన్నర్ హరియాణ, రన్నర్ ఆంధ్రప్రదేశ్
మహిళల టీం చాంపియన్‌షిప్ టైటిల్‌ను హరియాణ సునాయాసంగానే దక్కించుకుంది. ఫైనల్స్‌లో హరియాణకు ఆంధ్రప్రదేశ్ జట్టు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో మొదటి సింగిల్స్, రెండో సింగిల్స్‌ను వరుసగా హరియాణ గెలుచుకుంది. మూడో సింగిల్స్‌లో సైతం మొదటి సెట్‌లో హరియాణ ఆధిక్యతను ప్రదర్శించింది. రెండో సెట్‌లో మాత్రమే ఏపీ జట్టు కాస్త పోటీ ఇచ్చింది. అయితే చివరకు హరియాణ ఈ సెట్‌ను సైతం గెలుచుంది. చివరకు 3-0 తేడాతో హరియాణ జట్టు తన ప్రత్యర్థి ఏపీపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఏపీ జట్టు రన్నర్‌గా నిలిచింది.
మరిన్ని జాతీయ పోటీలు నిర్వహించాలి : కలెక్టర్ లక్ష్మీశ
క్రీడా రాజధానిగా కీర్తికెక్కిన విజయవాడలో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీలను నిర్వహించాల్సి ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అభిప్రాయపడ్డారు. ఈ పోటీల్లో విజేతలకు ఆయన ట్రోఫీలు, నగదు బహుమతి, మెడల్స్ అందజేశారు. పురుషుల, మహిళల జట్లకు చెరో రూ.3.50 లక్షల నగదు బహుమతి, విన్నర్, రన్నర్ ట్రోఫీలు, మెడల్స్ ప్రదానం చేశారు. అదేవిధంగా పురుషుల విభాగంలో మూడో స్థానంలో నిలిచిన మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మహిళల విభాగంలో మూడో స్థానంలో నిలిచిన అస్సాం, గుజరాత జట్లకు రూ.లక్ష చొప్పన నగదు బహుమతి, కాంస్య పతకాలు, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు ద్వారకానాథ్, కార్యదర్శి పి.అంకమ్మ చౌదరి పాల్గొన్నారు.
నేటి నుంచి వ్యక్తిగత విభాగం పోటీలు
స్టేడియంలో బుధవారం నుంచి జాతీయ సీనియర్ స్ర్తీ, పురుషుల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నట్లు పోటీల కార్యనిర్వాహక కార్యదర్శి పి.అంకమ్మ చౌదరి ప్రకటించారు. 33 రాషా్ట్రల జట్లతో పాటు ఇండియన్ రైల్వే, భారత పెట్రోలియం కార్పొరేషన్, ఎల్‌ఐసీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ), కంపో్ట్రలర్ ఆఫ్ ఆడిట్ జనరల్(కాగ్) జట్లు ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తాయని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించిన 500 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్టు వివరించారు.