Share News

Nellore Police: కి లేడీ అరాచకాలపై దర్యాప్తు ముమ్మరం

ABN , Publish Date - Aug 22 , 2025 | 04:45 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నెల్లూరు కి లేడి నిడిగుంట అరుణ అరాచకాలపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

Nellore Police: కి లేడీ అరాచకాలపై దర్యాప్తు ముమ్మరం

  • అరుణ ఫోన్‌ రికార్డింగ్స్‌ పరిశీలన

  • రౌడీషీటర్‌ శ్రీకాంత్‌పైనా ఆరా

  • నెల్లూరు పోలీస్‌ గెస్ట్‌హౌస్‌లో రోజంతా ఏఎస్పీ విచారణ

  • డబ్బు తీసుకుని మోసగించిందని అరుణపై బెజవాడవాసి ఆరోపణ

  • నెల్లూరు వచ్చి ఫిర్యాదు చేయాలని అధికారుల సూచన

నెల్లూరు (క్రైం), ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నెల్లూరు కి‘లేడి’ నిడిగుంట అరుణ అరాచకాలపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఆమె ప్రియుడు, రౌడీషీటర్‌ అవిలేలి శ్రీకాంత్‌ ఆగడాలపైనా వివరాలు సేకరిస్తున్నారు. ఓ బిల్డర్‌ ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు ఆమెను బుధవారం అరెస్టు చేసి, ఒంగోలు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. కోవూరు స్టేషన్‌లో నమోదైన కేసుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అరుణ చేసిన అరాచకాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఆమె ఫోన్‌లోని వాయిస్‌, వీడియో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. నెల్లూరులోని పోలీసు అతిథిగృహంలో అదనపు ఎస్పీ సీహెచ్‌ సౌజన్య గురువారం అరుణకు సంబంధించిన పలు విషయాలపై పలువురిని విచారించినట్లు తెలిసింది. అలాగే శ్రీకాంత్‌, అరుణలకు గత ప్రభుత్వంలో సహకరించిన పోలీసు అధికారులు, ఈ ప్రభుత్వంలో సహకరించిన అధికారులు, సిబ్బంది, ఏఆర్‌ సిబ్బంది ఎవరో జాబితా సిద్ధంచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది బయటకు పొక్కడంతో పోలీసు వర్గాల్లో గుబులు మొదలైంది. కాగా.. విజయవాడ నుంచి ఓ వ్యక్తి పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి తన వద్ద అరుణ పెద్ద మొత్తంలో నగదు తీసుకుని మోసం చేసిందని, న్యాయం చేయాలని కోరారు. నెల్లూరుకు వచ్చి ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. శుక్రవారం అతడు వస్తాడని తెలిసింది. కి‘లేడీ’పై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా బాధితులు నెల్లూరుకు రానున్నట్లు సమాచారం.

Updated Date - Aug 22 , 2025 | 04:48 AM