Share News

Weather Update: అరకు లోయలో 3.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

ABN , Publish Date - Dec 09 , 2025 | 04:25 AM

ఉత్తరాది పొడిగాలుల ప్రభావంతో ఉత్తరకోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.

Weather Update: అరకు లోయలో 3.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

  • ఏజెన్సీ గజగజ

  • ఈ ఏడాదిలో ఇదే అత్యల్పం

విశాఖపట్నం, పాడేరు, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఉత్తరాది పొడిగాలుల ప్రభావంతో ఉత్తరకోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. నాలుగు రోజుల క్రితం వరకూ రెండంకెల సంఖ్యలో ఉన్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఆదివారం నుంచి సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా దళపతిగూడ (అరకులోయ)లో 3.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే కావడం విశేషం. ఇక, జి.మాడుగుల, డుంబ్రిగుడలలో 3.9, కిలగాడలో 4.6, పాడేరులో 4.8, పెదబయలులో 6.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మైదాన ప్రాంతంలో కూడా చలి పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. వాయవ్య భారతం నుంచి మధ్యభారతం వరకు అధికపీడనం కొనసాగుతున్నందున ఉత్తరాది నుంచి కోస్తా, రాయలసీమ వరకూ గాలులు వీస్తున్నాయని, దాంతో చలితీవ్రత పెరిగిందని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. ఇంకా రాష్ట్రంలో వర్షాలు లేకపోవడం కూడా చలి పెరగడానికి ఒక కారణమన్నారు. ఈనెల 13వ తేదీ తరువాత బంగాళాఖాతం నుంచి తూర్పుగాలులు వీచే అవకాశం ఉందని, అప్పటివరకూ రాష్ట్రంలో చలి కొనసాగుతుందని పేర్కొన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 04:26 AM