Share News

IMD Forecast: ఈ శీతాకాలం గజగజ

ABN , Publish Date - Dec 02 , 2025 | 05:41 AM

ఈసారి శీతాకాలం గజగజా వణికించనుంది. దేశంలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన చలిగాలుల గుప్పెట్లో చిక్కుకోనున్నాయి.

IMD Forecast: ఈ శీతాకాలం గజగజ

  • చలి గుప్పిట దేశంలోని అనేక ప్రాంతాలు

  • రాష్ట్రంలో చలి ప్రభావం సాధారణమే

  • డిసెంబరులో ఉత్తర కోస్తాలో ఎక్కువ వర్షాలు

విశాఖపట్నం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఈసారి శీతాకాలం గజగజా వణికించనుంది. దేశంలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన చలిగాలుల గుప్పెట్లో చిక్కుకోనున్నాయి. మధ్య, వాయవ్య భారతం, పశ్చిమ, తూర్పుభారతంలో కొన్ని రాష్ట్రాలు, దక్షిణాదిలో తెలంగాణ, ఉత్తర కర్ణాటకలో అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు 3 నెలల శీతాకాలంలో దేశంలో ఉష్ణోగ్రతలు, వర్షపాతంపై సోమవారం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదిక విడుదల చేసింది. ఈ మూడు నెలల్లో వాయవ్య, మధ్య భారతంతోపాటు తూర్పు, పశ్చిమ, దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని, ఈ ప్రాంతాల్లో చలిగాలులు వీచే రోజులు సగటు కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. ఏపీలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం, అంత కంటే ఎక్కువగా నమోదుకానున్నాయని వెల్లడించింది. డిసెంబరులో దక్షిణ భారతంలో సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఏపీ వరకు ఉత్తర కోస్తాలో సాధారణం కంటే ఎక్కువగా, మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. లా నినా ప్రభావంతో చలి గాలులు..


ఈ ఏడాది పుష్కలంగా కురిసిన వర్షాలతో దేశంలో ఇప్పటికే వాతావరణం చల్లబడింది. దీనికితోడు పసిఫిక్‌ మహాసముద్రంలో కొనసాగుతున్న లా నినా పరిస్థితుల ప్రభావంతో ఆ సముద్రం మీదుగా చల్లని గాలులు దేశంపైకి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నవంబరులోనే అనేక ప్రాంతాల్లో చలి గాలుల తీవ్రత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో దేశంలో అనేక ప్రాంతాల్లో చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శీతలగాలుల తీవ్రత కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గుడారాల్లో నివసించే సంచార జాతుల వారు ఇబ్బందులకు గురవుతాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణించి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. వ్యవసాయ, ఉద్యానవన పంటలపై ప్రభావం ఉంటుందని, వ్యవసాయ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటారని, ప్రభుత్వ యంత్రాంగాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. శీతాకాలంలో రోజువారీ బులెటిన్లు విడుదల చేస్తామని పేర్కొంది.

Updated Date - Dec 02 , 2025 | 05:42 AM