Share News

Sattenapalli: ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ పేరుతో దుర్మార్గం

ABN , Publish Date - Dec 22 , 2025 | 06:36 AM

సోషల్‌ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేసుకున్నారు. తర్వాత హాయ్‌.. హోలో అంటూ చాటింగ్‌ చేసుకున్నారు.

Sattenapalli: ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ పేరుతో దుర్మార్గం

  • మాయ మాటలతో బాలికకు యువకుడికి వల

  • విజయవాడ నుంచి తీసుకెళ్లి సత్తెనపల్లిలో అత్యాచారం

  • స్నేహితురాలికి పంపిన మెసేజ్‌తో గుర్తించిన పోలీసులు

  • ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరు అరెస్టు

విజయవాడ, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేసుకున్నారు. తర్వాత హాయ్‌.. హోలో అంటూ చాటింగ్‌ చేసుకున్నారు. ఇదే అదనుగా భావించిన యువకుడు ప్రేమ పేరుతో వల వేశాడు. గుడ్డిగా నమ్మిన బాధితురాలు.. చివరకు అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌లోని వాంబే కాలనీకి చెందిన బాలిక ఇంటర్మీడియట్‌ చదువుతోంది. ఆమె కుటుంబం ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరికి వలస పోయింది. కుమార్తె విద్య మధ్యలో ఉండడంతో ఆమెను పెద్దమ్మ ఇంట్లో ఉంచారు. బాలికకు కొన్ని నెలల క్రితం పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన చిలుకూరు రాహుల్‌ అనే వ్యక్తితో ఇన్‌స్టాలో పరిచయమైంది. రాహుల్‌ ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. హైదరాబాద్‌లో ఉంటున్న స్నేహితుడు ఆనంద్‌ కుమార్‌ సిరిగిడి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు టీఎస్‌09 ఈటీ 1722 నంబరు గల ఫార్చూనర్‌ కారును సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కోసం అద్దెకు తీసుకున్నాడు. సత్తెనపల్లి వచ్చిన తర్వాత కారు నంబరును మార్చేశాడు. టీఎస్‌09 ఈటీపై ఏకేఎస్‌ (ఆనంద్‌ కుమార్‌ సిరిగిడి) అని స్టిక్కర్‌ అతికించాడు. ఈనెల 18న రాహుల్‌, ఆనంద్‌తోపాటు పాత గుంటూరుకు చెందిన ప్రదీప్‌, భరత్‌, బాబీ అనే ముగ్గురు యువకులు కారులో విజయవాడ వెళ్లారు. ప్రదీప్‌ ఇంజనీరింగ్‌, భరత్‌ బీఫార్మసీ చదువుతున్నారు. ఈ ఐదుగురు కలిసి విజయవాడలో వారధి వద్దకు వచ్చారు. కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న బాలికను రాహుల్‌ వారధి వద్దకు రప్పించాడు. బాధితురాలు తమ ఇంటి వద్ద ఉండే ఇద్దరు స్నేహితురాళ్లతో షాపింగ్‌కు వెళ్దామని చెప్పి బయటకు వచ్చింది.


వారు స్కూటర్‌పై బయలుదేరిన తర్వాత తనను వారధి వద్ద వదిలిపెట్టమని చెప్పింది. ఆమెను వారు అక్కడ దింపి వెళ్లిపోయారు. తర్వాత రాహుల్‌ కారులో ఆమెను ఎక్కించుకుని సత్తెనపల్లి తీసుకెళ్లాడు. అక్కడ లాడ్జిలో రెండు గదులను అద్దెకు తీసుకొని, ఒక దానిలో బాలికను పెట్టి, మరో గదిని స్నేహితులకు ఇచ్చాడు. రాహుల్‌ గదిలో బాలికపై అత్యాచారం చేయగా.. ఆ గది వద్దకు ఎవరూ రాకుండా స్నేహితులు కాపలా కాశారు. చీకటి పడినా బాలిక తిరిగి రాకపోవడంతో పెద్దమ్మ, పెదనాన్న నున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కోసం గాలింపు చేపట్టారు. ఆమె శనివారం రాత్రి సత్తెనపల్లిలో ఉన్నట్టు స్నేహితురాలికి ఓ సందేశం పంపింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి బాలికను గుర్తించారు. రాహుల్‌తోపాటు ప్రదీప్‌, భరత్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఆనంద్‌, బాబీ కోసం గాలిస్తున్నారు.

Updated Date - Dec 22 , 2025 | 06:46 AM