Share News

ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం!

ABN , Publish Date - May 07 , 2025 | 01:11 AM

ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలగబోతుందా? త్వరలోనే బదిలీల ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయా? కొన్ని స్టేషన్ల విషయంలో మార్పులు కచ్చితంగా చేయాలని అఽధికారులు ఒక నిర్ణయానికి వచ్చారా? అంటే పోలీసు వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కొంతమంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేయాలన్న యోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం!

-కమిషనరేట్‌ పరిధిలో బదిలీలకు రంగం సిద్ధం!

-సీపీ రాజశేఖర్‌బాబు విధుల్లో చేరగానే ఉత్తర్వులు

-ముగ్గురు ఇన్‌స్పెక్టర్ల పనితీరుపై అసంతృప్తి

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలగబోతుందా? త్వరలోనే బదిలీల ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయా? కొన్ని స్టేషన్ల విషయంలో మార్పులు కచ్చితంగా చేయాలని అఽధికారులు ఒక నిర్ణయానికి వచ్చారా? అంటే పోలీసు వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కొంతమంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేయాలన్న యోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు సెలవులో ఉన్నారు. గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజశేఖరబాబు ఈ నెల 11వ తేదీ వరకు సెలవు పెట్టారు. ఆయన 12వ తేదీన విధుల్లో చేరతారు. ఆ తర్వాత బదిలీల ఫైలు సీపీ టేబుల్‌ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలిసింది.

మూడు స్టేషన్లలో కదలిక ఖాయం?

కమిషనరేట్‌ పరిధిలో ఉన్న కొన్ని పోలీస్‌స్టేషన్లలో ఇన్‌స్పెక్టర్ల పనితీరుపై సీపీ అసంతృప్తితో ఉన్నారు. ఆయన నిర్ధేశించిన లక్ష్యాలను అందుకోవడంలో వారు విఫలమవుతున్నారన్న భావన ఉంది. మరికొంత మంది ఇన్‌స్పెక్టర్లు విధి నిర్వహణలో చురుగ్గా వ్యవహరించడం లేదన్న అభిప్రాయం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌ జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌కు కొత్త ఇన్‌స్పెక్టర్లు వచ్చారు. ఇన్‌స్పెక్టర్లు ఒక స్టేషన్‌లో రెండేళ్ల పాటు పనిచేసే అవకాశం ఉంది. రెండేళ్లు దాటిన ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేసే అధికారం అధికారులకు ఉంది. ఇప్పటికే సీపీ కొంతమంది ఇన్‌స్పెక్టర్ల పనితీరుపై ఒక అంచనాకు వచ్చారు. విజయవాడ నగరంలో మొత్తం 13 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇవి కాకుండా రూరల్‌ గ్రామాల్లో 15 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లలో ఇన్‌స్పెక్టర్లంతా ఏడాది కాలాన్ని పూర్తి చేసుకోవడానికి దగ్గరలో ఉన్నారు. ఈ స్టేషన్లలో ఎవరెవరిని బదిలీ చేయాలన్న దానిపై కమిషనర్‌ కార్యాలయంలో చర్చలు జరుగుతున్నాయి. కమిషనరేట్‌ పరిధిలో మూడు స్టేషన్లలో ఇన్‌స్పెక్టర్లను మార్పు చేయాలని అధికారులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. విజయవాడ నగరంలో రెండు, రూరల్‌ డివిజన్‌లో ఒక పోలీస్‌ స్టేషన్‌కు కొత్త ఇన్‌స్పెక్టర్లను నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది. నగరంలో ఉత్తర మండలంలో ఒక ఇన్‌స్పెక్టర్‌, పశ్చిమ మండలంలో ఒక ఇన్‌స్పెక్టర్‌ పేర్లు బదిలీ జాబితాలో ఉన్నట్టు కమిషనరేట్‌ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఇద్దరు కాకుండా తిరువూరు మండలంలో మరో ఇన్‌స్పెక్టర్‌ పేరు వినిపిస్తోంది. ఈ మూడింటితో బదిలీలను ముగిస్తారా, ఈ సంఖ్యను ఇంకా పెంచుతారా అన్నది త్వరలో తెలుస్తుంది.

Updated Date - May 07 , 2025 | 01:11 AM