INS Androth: నేడు ఆండ్రోత్ జల ప్రవేశం
ABN , Publish Date - Oct 06 , 2025 | 02:59 AM
భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో యుద్ధ నౌక చేరనుంది. తీర ప్రాంతంలోని సముద్ర జలాల్లో శత్రు దేశాల జలాంతర్గాముల ఉనికిని పసిగట్టే యుద్ధనౌక...
నేవీ అమ్ముల పొదిలోమరో నౌక
కోల్‌కతాలో తయారీ.. 80 శాతం పరికరాలు భారత్‌లోనే ఉత్పత్తి
విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో యుద్ధ నౌక చేరనుంది. తీర ప్రాంతంలోని సముద్ర జలాల్లో శత్రు దేశాల జలాంతర్గాముల ఉనికిని పసిగట్టే యుద్ధనౌక ఆండ్రోత్ సోమవారం విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డులో జలప్రవేశం చేయనుంది. యాంటీ సబ్‌మెరైన్ వాటర్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ఏఎ్‌సడబ్ల్ల్యూ- ఎస్‌డబ్ల్యూసీ)గా వ్యవహరించే ఆండ్రోత్.. ఇండియన్ నేవీకి రెండో ఏఎ్‌సడబ్ల్యూ-ఎ్‌సడబ్ల్యూసీ నౌక కావడం గమనార్హం. తూర్పు నౌకాదళం వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్ సోమవారం ఉదయం ఈ నౌకను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆండ్రోత్ చేరికతో భారత నౌకాదళం శక్తి సామర్థ్యాలు మరింత పెరగనున్నాయి. ఈ నౌకను కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ అండ్ ఇంజనీర్స్ (జీఆర్‌ఎ్‌సఈ) నిర్మించింది. ఈ నౌక తయారీలో వినియోగించిన పరికరాల్లో 80 దేశీయంగా ఉత్పత్తి చేసినవే కావడం విశేషం. వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానం, స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించేలా ఈ నౌక నిర్మాణం జరిగింది. ఆండ్రోత్ సబ్‌మెరైన్ల ఉనికిని పసిగట్టడంలో కీలకంగా పని చేయనుంది. అత్యాధునిక తేలికపాటి టార్పెడోలు, సబ్‌మెరైన్ల విధ్వంసక రాకెట్లను కలిగి ఉంటుంది. దేశ సముద్ర భద్రతలో ఈ నౌక కీలకంగా నిలుస్తుందని నేవీ అధికారులు పేర్కొన్నారు.