AP Govt: రాయవరం పేలుడుపై విచారణ కమిటీ
ABN , Publish Date - Oct 10 , 2025 | 05:30 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని బాణసంచా తయారీ యూనిట్‌లో బుధవారం సంభవించిన భారీ పేలుడు ఘటనపై ప్రభుత్వం...
మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ నేతృత్వం
బాధ్యుల గుర్తింపు.. పేలుడుకు కారణాలపై దర్యాప్తు
వారం రోజుల్లో నివేదికకు సీఎస్ ఆదేశం
అమరావతి, కాకినాడ, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని బాణసంచా తయారీ యూనిట్‌లో బుధవారం సంభవించిన భారీ పేలుడు ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంతో.. పేలుడుకు గల కారణాలను తెలుసుకోవడానికి గురువారం విచారణ కమిటీని నియమించింది. మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ నేతృత్వంలో కమిటీని నియమించగా, కమిటీ సభ్యుడిగా ఐజీ ఆకే రవికృష్ణను నియమించింది. ఈ కమిటీకి సహకరించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్, ఎస్పీ రాహుల్ మీనాను ఆదేశించింది. ఈ కమిటీతో సమన్వయం కోసం జిల్లాస్థాయిలో ఒక నోడల్ అధికారి కూడా నియమిస్తారు. ‘బాణసంచా తయారీ యూనిట్‌లో పేలుడు సంభవించడానికి దారితీసిన కారణాలను గుర్తించడం. ఘటనకు బాధ్యులైన వ్యక్తులను నిర్థారించడం. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరక్కుండా అవసరమైన జాగ్రత్తలు, సూచనలను సిఫార్సు చేయడం’ ఈ కమిటీ చేయాల్సిన పని. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పేలుడు ఘటనలో మరొకరి మృతి
బాణసంచా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురిలో ఒకరు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చనిపోయారు. బుధవారం కొమరిపాలెంలోని బాణసంచా గొడౌన్‌లో జరిగిన విస్ఫోటంలో గాయపడిన ముగ్గురు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన వాసంశెట్టి విజయలక్ష్మి(45) మరణించారు.