Share News

CM Chandrababu: వినూత్నం... ప్రజాహితం

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:37 AM

జిల్లా కలెక్టర్లు టెక్నాలజీని అందిపుచ్చుకుని, వినూత్న ఆలోచనలతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

CM Chandrababu: వినూత్నం... ప్రజాహితం

  • జిల్లా పాలనలో కొందరు కలెక్టర్ల చొరవను అభినందించిన సీఎం

  • కొత్త ఆలోచనలతోనే ఫలితాలు.. జిల్లాలు మారితేనే పాలనపై ప్రభావం

  • కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కలెక్టర్లు టెక్నాలజీని అందిపుచ్చుకుని, వినూత్న ఆలోచనలతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సరళంగా ఉండే ఇన్నొవేటివ్‌ ఐడియాలతో ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఆదాయం, సంపదను సృష్టించేందుకు కూడా ఇదే మార్గమని తెలిపారు. గురువారం జరిగిన రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ‘ఉత్తమ పద్ధతులు - విజయ గాథలు’ అంటూ ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రజెంటేషన్లు ఇచ్చారు. జిల్లాల పాలనలో వారి చొరవ పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వారందరినీ అభినందించారు.

అనంత : రికార్డుల డిజిటలైజేషన్‌

అనంతపురం జిల్లాలో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌ కోసం చేపట్టిన ప్రత్యేక ప్రక్రియ గురించి ఆ జిల్లా కలెక్టరు ఆనంద్‌ వివరించారు. రెవెన్యూ రికార్డులు సరిగ్గా లేకపోవడం, 22ఏ లాంటి సమస్యలను అధిగమించేందుకు సర్వే నంబరు వారీగా లైబ్రరీని తయారు చేశామని వివరించారు. రెవెన్యూ ఆఫీస్‌ టూల్‌ను తయారు చేసి యూజర్లకు అనువుగా మార్చామని వివరించారు. భూ రికార్డులకు సంబంధించిన ఆర్కైవ్స్‌ను నిర్వహించడం మంచి ఆలోచన అంటూ కలెక్టరును సీఎంను అభినందించారు. భూ రికార్డులన్నీ స్టోరేజ్‌ లేదా క్లౌడ్‌లో ఉండేలా చూడాలని కలెక్టర్లందరికీ సూచించారు.

Untitled-2 copy.jpg

కడప : స్మార్ట్‌ కిచెన్‌

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో లోపాలను సవరించి, విద్యార్థులకు నాణ్యమైన పౌష్ఠికాహారాన్ని రుచిగా, శుచిగా, వేడిగా అందించే లక్ష్యంతో ‘స్మార్ట్‌ కిచెన్‌’ కార్యక్రమం అమలు చేస్తున్నామని కడప కలెక్టరు చెరుకూరి శ్రీధర్‌ వివరించారు. ప్రస్తుతం 5 స్మార్ట్‌ కిచెన్లు నిర్వహిస్తున్నామని, త్వరలో వాటిని 33 కిచెన్లకు విస్తరిస్తామని తెలిపారు. కిచెన్‌ కోసం సేంద్రియ కూరగాయలను వాడుతున్నామని కలెక్టరు తెలపగా, సీఎం అభినందించారు.

Untitled-2 copy.jpg


పార్వతీపురం మన్యం : ముస్తాబు

విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు ‘ముస్తాబు’ పేరుతో అమలు చేసిన కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. చేతులను శుభ్రంగా కడుక్కుని, జుట్టును సక్రమంగా దువ్వుకున్న విద్యార్థులనే బడిలోకి అనుమతిస్తున్నామని వివరించారు. ఇది చాలా మంచి కార్యక్రమమంటూ కలెక్టరును సీఎం అభినందించారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఇంటర్‌ వరకు ఈ కార్యక్రమం అమలు చేయాలని ఆదేశించారు.

Untitled-2 copy.jpg

నెల్లూరు : చాంపియన్‌ ఫార్మర్‌

రైతుల్లో వ్యవసాయ యాంత్రీకరణపై పూర్తి అవగాహన కల్పించేందుకు చాంపియన్‌ ఫార్మర్‌ పేరుతో కార్యక్రమం చేపట్టామని నెల్లూరు కలెక్టరు హిమాన్షు శుక్లా తెలిపారు. 45 రకాల యంత్ర పరికరాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ, కరపత్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు. గ్రామానికి ఒకరి చొప్పున చాంపియన్‌ ఫార్మర్‌ను ఎంపిక చేస్తూ, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమం బాగుందని సీఎం అన్నారు. అమరావతిలో ఉండమని కోరితే..కలెక్టరుగా నిరూపించుకుంటానని వెళ్లి చక్కగా పని చేస్తున్నారంటూ హిమాన్షును అభినందించారు.

Untitled-2 copy.jpg


అల్లూరి జిల్లా : నిర్మాణ్‌

జిల్లాలో 2023 నుంచి ‘యాస్పిరేషనల్‌ ఇంజన్‌ నిర్మాణ్‌’ కింద అన్ని పాఠశాలల్లో సూపర్‌-50 కార్యక్రమాన్ని చేపట్టామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరు దినేశ్‌కుమార్‌ తెలిపారు. ‘మార్గదర్శి’ పేరుతో విద్యార్థుల ఫౌండేషన్‌ లిటరసీ, న్యూట్రిషన్‌, కెరీర్‌ డెవల్‌పమెంట్‌కు చర్యలు తీసుకున్నామని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, కలెక్టరును అభినందించారు.

ఏలూరు : ‘మార్పు’ దిశగా అడుగు

జిల్లాలో 16మండలాల పరిధిలో నాటు సారా తయారుచేస్తున్న 226కుటుంబాలను గుర్తించి, ‘మార్పు’ కార్యక్రమం ద్వారా వారిలో మార్పు తీసుకురాగలిగామని ఏలూరు జిల్లా కలెక్టరు వెట్రి సెల్వి తెలిపారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి, వారితో వ్యాపారాలు పెట్టించామన్నారు. ప్రస్తుతం 140 నాటుసారా ప్రభావిత గ్రామాల్లో మార్పు కనిపిస్తోందని కలెక్టరు తెలపగా, ఆయనను చంద్రబాబు అభినందించారు.

Updated Date - Dec 19 , 2025 | 04:42 AM