Share News

Anam Venkataramana Reddy: నాసిరకం మద్యంతో తాళిబొట్లు తెంచేశారు

ABN , Publish Date - Aug 07 , 2025 | 05:15 AM

వైసీపీ హయాంలో జగన్‌ నాసిరకం మద్యాన్ని అమ్మారు. నాసిరకం మద్యాన్ని అమ్ముతున్నారని ల్యాబ్‌ రిపోర్టులు కూడా తెప్పించి ఇచ్చాం. కానీ ఆ రోజు వైసీపీ నాయకులు ఎవ్వరూ వినలేదు.

 Anam Venkataramana Reddy: నాసిరకం మద్యంతో తాళిబొట్లు తెంచేశారు

  • ఇప్పుడేమో దొంగ కేసులంటూ ఏడుస్తున్నారు

  • వైసీపీపై ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజం

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ హయాంలో జగన్‌ నాసిరకం మద్యాన్ని అమ్మారు. నాసిరకం మద్యాన్ని అమ్ముతున్నారని ల్యాబ్‌ రిపోర్టులు కూడా తెప్పించి ఇచ్చాం. కానీ ఆ రోజు వైసీపీ నాయకులు ఎవ్వరూ వినలేదు. ఈ రోజు మద్యం స్కాంలో దొంగ కేసులు పెడుతున్నారంటూ ఏడుస్తున్నారు’ అని ఆక్వాకల్చర్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ చైర్మన్‌ ఆనం వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో విక్రయించిన మద్యం సీసాలను ప్రదర్శిస్తూ, అవి నాసిరకం అంటూ ఇచ్చిన ల్యాబ్‌ నివేదికను వివరించారు. అడ్డగోలుగా దోచుకున్న వైసీపీ నేతలపై దొంగ కేసులు పెట్టాల్సిన పనిలేదన్నారు. జగన్‌ అమ్మిన నాసిరకం మద్యం వల్ల తాళిబొట్లు కోల్పోయిన వందలాది మంది ఉసురు తగిలే నేడు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా జైళ్లకు వెళుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరుడు వెంకటేశ్‌ నాయుడు, వైఎస్‌ సుజాతరెడ్డి అల్లుడు రాజ్‌ కసిరెడ్డి, బంధుమిత్రులందరినీ మద్యం స్కాంలో భాగస్వాములను చేసిన జగన్‌... నేడు వారంతా ఎవరో తనకు తెలియదని బుకాయించడం ఏమిటి? వార్షికాదాయం రూ.4 లక్షలుగా చూపిన వెంకటేశ్‌ నాయుడు ప్రత్యేక విమానంలో, పెద్ద హీరోయిన్లతో ఎలా ప్రయాణాలు చేశాడు? చేసిన తప్పులన్నీ చేసి వైసీపీ లీగల్‌ సెల్‌ బలంగా పనిచేయాలని జగన్‌ చెప్పడం విడ్డూరంగా ఉంది. వైసీపీ కార్యాలయాన్ని మూసేసి లీగల్‌ సెల్‌కు అప్పగించేస్తే జగన్‌ చరిత్రలో నిలిచిపోతాడు’ అని ఆనం ఎద్దేవా చేశారు.

Updated Date - Aug 07 , 2025 | 05:15 AM