Investment Summit: పెట్టుబడుల పండగ
ABN , Publish Date - Nov 14 , 2025 | 05:03 AM
రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నేడు, రేపు విశాఖలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు
ఉప రాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభం
గవర్నర్, సీఎం, కేంద్ర మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తల హాజరు
పూర్తైన ఏర్పాట్లు.. 8 హాళ్లు సిద్ధం
ప్రధాన వేదికముందే ఎంవోయూల వేడుక
మరికొన్ని గంటల్లోనే రాష్ట్రంలో పెట్టుబడుల పండగ మొదలవుతోంది. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని దీనికోసం సర్వాంగ సుందరంగా సిద్ధంచేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే పెట్టుబడుల వాతావరణాన్ని పునరుద్ధరించింది. వైసీపీ హయాంలో రాష్ట్రం వదిలిపోయిన సంస్థలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి. గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ డేటా సెంటరు ఏర్పాటుకు భారీ పెట్టుబడులతో ముందుకు రావడం గేమ్ చేంజర్‌గా మారింది. ఏడాదిన్నరగా సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ దేశ విదేశాల్లో పర్యటిస్తూ, సాగిస్తున్న పెట్టుబడుల వేట ఫలితంగా ఏపీ బ్రాండ్ తిరిగి నిలబడింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తొలిసారి పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు నిర్వహణకు సిద్ధమైంది. సదస్సు విజయవంతానికి ఏర్పాట్లు భారీ స్థాయిలో చేశారు.
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ, విదేశాల నుంచి మంత్రులు, దిగ్గజ కంపెనీలు తరలివస్తున్న ఈ సదస్సును శుక్రవారం ఉదయం ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభిస్తారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్, ఇంకా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పలువురు పారిశ్రామిక దిగ్గజాలు, సీఐఐ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. సదస్సులో ప్రధాన వేదిక (హాల్ నంబర్ 5)గా ఏపీ ప్రభుత్వ పెవిలియన్ ప్లీనరీ ఉంటుంది. మరో ఏడు హాళ్లలో వేర్వేరుగా సదస్సులు, గోష్ఠుల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
సీఎం, కేంద్ర వాణిజ్య మంత్రికి చాంబర్లు, శంకుస్థాపనకు ఒక హాలు సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. తొలిరోజు రాత్రి 8 గంటల వరకూ పలు ప్లీనరీలు నిర్వహించనున్నారు. రెండోరోజు శనివారం ఉదయం 9.30 గంటలకు తిరిగి ప్లీనరీలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 5 గంటల నుంచి 5.45 గంటల వరకూ జరగనున్న ముగింపు సభ ఉంటుంది. ఈ సదస్సుఉ 35 దేశాలకు చెందిన మంత్రులు, ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ముందే మొదలైన పెట్టుబడుల సందడి
భాగస్వామ్య సదస్సులో పారిశ్రామిక సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం విశాఖ నోవాటెల్ హోటల్‌లో చంద్రబాబు సమక్షంలో పరిశ్రమల శాఖ తొమ్మిది, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖ మూడు, ఇంధన శాఖ ఆరు, సీఆర్‌డీఏ 8 ఒప్పందాలు చేసుకున్నాయి. ఆహార శుద్ధి రంగంలో మరో 4 ఒప్పందాలు కుదిరాయి. కాగా, శుక్రవారం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ప్రధాన వేదిక వద్ద పరిశ్రమల శాఖ నుంచి 14, ఐటీ అండ్ ఎలకా్ట్రనిక్స్ 15, ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) ఆరు, ఇంధన శాఖ నుంచి 21 ఒప్పందాలు జరగనున్నాయి. మొత్తం ఒప్పందాల మేరకు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రధాన వేదికపై 21 మంది..
భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ ప్రధాన వేదిక (హాల్ నంబరు-5)పై ముందువరుసలో 21 మంది వరకు ఆశీనులవుతారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూశ్ గోయల్, రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు లోకేశ్, టీజీ భరత్, నాదెండ్ల మనోహర్, సీఐఐ అధ్యక్షుడు రాజేంద్ర మోమాని, ఉపాధ్యక్షురాలు సుచిత్ర ఎల్లా, డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, జీఎంఆర్ గ్రూపు చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు తదితరులు కూర్చుంటారు.