CM Chandrababu Naidu: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగు
ABN , Publish Date - Nov 11 , 2025 | 05:25 AM
నియోజకవర్గానికో పారిశ్రామిక పార్కు.. ఇంటికో పారిశ్రామికవేత్త’ లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది.
నేడు మరో 4 ఎంఎస్ఎంఈ పార్కులకు ప్రారంభోత్సవం
మరో 48 నియోజకవర్గాల్లో పార్కుల అభివృద్ధికి శంకుస్థాపన
ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో పూర్తి.. 40 చోట్ల పనులు
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ‘నియోజకవర్గానికో పారిశ్రామిక పార్కు.. ఇంటికో పారిశ్రామికవేత్త’ లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసి.. అక్కడ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) నెలకొల్పాలని సంకల్పించిన సర్కారు.. రెండో విడతగా మరో 4 ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం లింగన్నపాలెం, చిత్తూరు నియోజకవర్గం వెంకటాపురం, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పైడిభీమవరం, విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం పెదగంట్యాడలో అభివృద్ధి చేసిన నాలుగు పార్కులను సీఎం చంద్రబాబు మంగళవారం ప్రారంభించనున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొని.. అక్కడి ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభిస్తారు. అక్కడి నుంచే మిగిలిన మూడు పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు చేస్తారు. మరో 48 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి శంకుస్థాపనలు కూడా చేయనున్నారు.
శంకుస్థాపనల జాబితాలోని నియోజకవర్గాలు..
పెందుర్తి, నర్సీపట్నం, అనంతపురం, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లి, పాడేరు, రంపచోడవరం, వేమూరు, రేపల్లె, చీరాల, పుంగనూరు, నగరి, కుప్పం, అమలాపురం, నిడదవోలు, గోపాలపురం, రాజమండ్రి రూరల్, ఏలూరు, ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా), పత్తిపాడు (కాకినాడ జిల్లా), తుని, మచిలీపట్నం, మంత్రాలయం, ఆలూరు, పాణ్యం, ఆళ్లగడ్డ, సర్వేపల్లి, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గంపేట, గురజాల, సత్తెనపల్లి, సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం, కొండపి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం పశ్చిమ, పొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాల్లో ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కులకు, పాయకరావుపేట, పెందుర్తి, గన్నవరం నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయనున్న ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు చంద్రబాబు శంకుస్థాపనలు చేస్తారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొంటారు. కాగా, తొలివిడతగా 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ పార్కులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏడాది మే 1న ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదేరోజు మరో 40 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు కూడా చేశారు. అక్కడ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
ఏటా 2 వేల కొత్త యూనిట్లకు ప్రణాళిక
ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఆక్వా, అగ్రికల్చర్, హార్టికల్చర్ ప్రాసెసింగ్, బయోటెక్నాలజీ, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, డ్రోన్ మాన్యుఫాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్, ఫుట్‌వేర్, ఫార్మాస్యూటికల్స్, సెమీ కండక్టర్, ఎలకా్ట్రనిక్స్, టెక్స్‌టైల్స్, టాయ్స్ తదితర ఉత్పత్తులకు సంబంధించిన యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. సూక్ష్మ, మధ్య, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి సరసనమైన ధరలకే భూకేటాయింపులు చేయడంతోపాటు అన్నివిధాలా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ఏపీఐఐసీ ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనిష్ఠంగా 15 నుంచి 150 ఎకరాల వరకు భూములు సేకరించి పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. 15 ఎకరాలలోపు ఉన్న పార్కుల్లో సూక్ష్మ పరిశ్రమలు, 10 నుంచి 100 ఎకరాలలోపు విస్తీర్ణంలో అభివృద్ధి చేసే పార్కులలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, 100 నుంచి 1,000 ఎకరాల పార్కుల్లో భారీ పరిశ్రమలు, 1,000 ఎకరాలకు పైగా అభివృద్ధి చేసే పార్కులలో మెగా పరిశ్రమలను నెలకొల్పేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆయా పార్కుల్లో ఏటా 2 వేలకు పైగా కొత్త యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించింది. కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్లకు రూ.10,586 కోట్లు ప్రోత్సాహకాలుగా అందించేందుకు ఇప్పటికే అంచనాలు సిద్ధం చేసింది. కొత్తగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో నెలకొల్పే పరిశ్రమల ద్వారా రూ.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. దీన్ని సాధించేందుకు వీలుగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వేగంగా తమ యూనిట్లను గ్రౌండ్ చేసేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటోంది.
ఎంఎస్ఎంఈ సదస్సులో 36 ఎంఓయూలు
విశాఖలో ముగిసిన రెండు రోజుల సదస్సు
విశాఖపట్నం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ ) ఎగుమతుల అభివృద్ధి సదస్సు-2025లో వివిధ సంస్థల మధ్య 36 అవగాహన ఒప్పందాలు కుదిరాయని రాష్ట్ర ఎంఎస్ఎంఈ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ టి.శివశంకరరావు వెల్లడించారు. విశాఖ మారియట్ హోటల్‌లో ఆదివారం ప్రారంభించిన రెండ్రోజుల సదస్సు సోమవారం సాయంత్రం ముగిసింది. శివశంకరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో పలువురికి అవగాహన కలగడంతోపాటు వ్యాపార సంబంధాలు ఏర్పడ్డాయని చెప్పారు. 171 బీటుబీ చర్చలు జరిగాయన్నారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమోటివ్, ఫార్మా, బయోటెక్, గార్మెంట్స్, ఇంజనీరింగ్, ఐఓటీ, రెన్యూవబుల్ ఎనర్జీ తదితర రంగాల్లో ఒప్పందాలు జరిగాయని తెలిపారు. కోస్టారికా, ఈజిప్ట్, హంగేరి, కెన్యా, నేపాల్, న్యూజిలాండ్, రష్యా, శ్రీలంక, టాంజానియా, టోగో, ఉగాండా, జింబాబ్వే నుంచి 35 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు హాజరు కాగా, వారిలో 60ు మంది తొలిసారి ఎగుమతి చేస్తున్నవారేనని చెప్పారు. మహిళల నేతృత్వంలో పనిచేస్తున్న సంస్థలు 22ు ఉన్నాయన్నారు. 3నెలల కృషి వల్ల ఈ సదస్సు విజయవంతమైందని ఇండియన్ ఎస్‌ఎంఈ ఫోరం అధ్యక్షుడు వినోద్‌కుమార్ అన్నారు.
నేడు ప్రకాశంలో సీఎం పర్యటన ఇలా..
ఒంగోలు, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం జి.లింగన్నపాలెం చేరుకుంటారు. అక్కడ అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించనున్నారు. పైలాన్ ఆవిష్కరణ తర్వాత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. తిరిగి 12.30 గంటలకు బయలుదేరి వెళ్తారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లు సాగుతున్నాయి.