Karredou Farmers Protest: పచ్చని పొలాల్లో ఇండోసోల్ మంటలు
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:26 AM
ఇండోసోల్ సోలార్ పరిశ్రమ కోసం పచ్చని పంట పొలాలకు మంట పెడతారా? అని కరేడు గ్రామ రైతులు ముక్తకంఠంతో నిరసిస్తున్నారు. నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కరేడు గ్రామ పరిధిలో ఇండోసోల్ కంపెనీ కోసం 4,855 ఎకరాల...
ప్రాణాలైనా ఇస్తాం కానీ.. భూములిచ్చే ప్రసక్తే లేదు
భూసేకరణ నోటిఫికేషన్‌పై రగులుతున్న కరేడు రైతులు
గత నెల 29న హైవేను దిగ్బంధించి నిరసన
సోలార్ పరిశ్రమను బంజరు భూముల్లో పెట్టుకోవచ్చు కదా అని ఆక్రోశం
(కందుకూరు-ఆంధ్రజ్యోతి)
ఇండోసోల్ సోలార్ పరిశ్రమ కోసం పచ్చని పంట పొలాలకు మంట పెడతారా? అని కరేడు గ్రామ రైతులు ముక్తకంఠంతో నిరసిస్తున్నారు. నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కరేడు గ్రామ పరిధిలో ఇండోసోల్ కంపెనీ కోసం 4,855 ఎకరాల భూసేకరణకు గతనెల 22న కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయడంపై గ్రామం అట్టుడికిపోతోంది. రైతులకు నచ్చజెప్పాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు వారు ససేమిరా అంటున్నారు. భూసేకరణను నిరసిస్తూ పార్టీలకు అతీతంగా ప్రజలంతా ఏకతాటిపై తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 29న జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. అలాగే, గత శుక్రవారం కందుకూరు సబ్ కలెక్టరు తిరుమణి శ్రీపూజ, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టరు రాజశేఖర్ గ్రామంలో సభ ఏర్పాటుచేయగా .. ‘3పంటలు పండే మా భూములు పరిశ్రమల కోసం ఇచ్చే ప్రశ్నేలేద’ని అక్కడికి వచ్చిన వేలాదిమంది రైతులు తేల్చిచెప్పారు.
ఇదీ కరేడు ప్రత్యేకత!
17 వేలకుపైగా జనాభా కలిగి 16 శివారు గ్రామాలతో కందుకూరు నియోజకవర్గంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ కరేడు. ఇక్కడ పండ్ల తోటలు, మాగాణి భూమి అధికం. గ్రామంలో 12,632 ఎకరాల భూములు ఉండగా, అందులో 2,600 ఎకరాల ప్రభుత్వ భూమి, 1,200 ఎకరాల అటవీ భూమి ఉంది. మిగిలినదంతా రైతుల పట్టా భూమి. 3 వేల ఎకరాలకుపైగా ఏటా రెండు పంటలు పండే మాగాణి భూమి ఉంది. తీర ప్రాంతంలో 1,200 ఎకరాలకు పైగా వేరుశనగ సాగుకు అనుకూలంగా, మూడు పంటలు పండే భూమి ఉంది. మరో 400 ఎకరాల్లో మామిడి, సపోట తోటలు ఉండగా 100 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో అరటి, కొబ్బరి తోటలు ఉన్నాయి.
పంట పొలాల్లోపరిశ్రమ ఎందుకు?
ఇండోసోల్ సోలార్ కంపెనీ సోలార్ ప్యానెల్ తయారీ ప్లాంట్ కోసం ఏర్పాటు చేస్తున్నందున, దానికి ఎండలు అధికంగా ఉండే ఎడారి ప్రాంతం, బంజరు భూములు అవసరమని గ్రామస్థులు పేర్కొన్నారు. అయితే పండ్ల తోటలు, మాగాణి భూములతో చల్లని వాతావరణం ఉండే కరేడును ఎంచుకోవడంలో మతలబు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.14,152 కోట్లు సబ్సిడీ కొట్టేయడం, కారుచౌకగా తమ భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే లక్ష్యంగా ఈ తంతు నడుస్తుందని గ్రామస్థులు ఆగ్రహిస్తున్నారు. వందల మందికి ఉద్యోగాలు వస్తాయని చెబుతూ వేలమంది బతుకులు బజారున పడేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
భూములన్నీ తీసుకుంటే ఎలా బతకాలి?
నాకు కరేడులోని 1410, 1412 సర్వే నంబర్లలో పది ఎకరాల మాగాణి ఉంది. మాకు వ్యవసాయం, పశుపోషణ తప్ప మరో వృత్తి తెలియదు. మా గ్రామంలోని శివాలయానికి 600ఏళ్ల చరిత్ర ఉంది. 17వేలకు పైగా జనాభా ఉన్న మా గ్రామంలో ఉన్న భూములన్నీ తీసేసుకుంటే ఈ జనమంతా ఎలా బతకాలి?
- రంగని బ్రహ్మారెడ్డి, కరేడు గ్రామ రైతు
కాలనీలే ఖాళీ చేయిస్తారంట...
మాకు వ్యవసాయం, కూలి పని తప్ప మరో వృత్తి తెలియదు. పరిశ్రమ కోసం ఇప్పుడు రామకృష్ణాపురం ఎస్టీ కాలనీ, ఉప్పరపాలెం ఎస్సీ కాలనీ, పొట్టేనికుంట ఎస్సీ కాలనీలు ఖాళీ చేయిస్తారంటున్నారు. మేము ఇక్కడి నుంచి ఖాళీ చేసే ప్రశ్నేలేదు. ఐక్యంగా ప్రతిఘటిస్తాం.
- గంజి యలమంద, ఉప్పరపాలెం ఎస్సీ కాలనీ రైతు
భూములిచ్చే ప్రసక్తే లేదు
నాకు సర్వే నం.732-1లో 1.28 సెంట్లు మాగాణి భూమి లంకలో ఉంది. వ్యవసాయం మీదే ఆధారపడి నా కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లల్ని చదివించు కుంటున్నా. ప్రభుత్వమిచ్చే పరిహారం డబ్బులు ఎన్నాళ్లుంటాయి? ఆతర్వాత మేమంతా ఎలా బతకాలి? ప్రాణాలైనాఇస్తాంకానీ భూములు ఇచ్చేదే లేదు.
-మిరియం వెంకటకృష్ణ, కరేడు గ్రామ రైతు
ప్రభుత్వం పునరాలోచించాలి
ఏటా మూడు పంటలు పండే మా భూములను సోలార్ పరిశ్రమకోసం తీసుకుంటే మేమేలా బతకాలి? ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోపోతే మా సమాధుల మీదే పరిశ్రమ కట్టాల్సి వస్తుంది!.
- బత్తుల వెంకట రమణారెడ్డి