Share News

యథేచ్ఛగా చెరువుల తవ్వకం

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:55 AM

ఏడాదికి రెండు పంటలు పండే భూముల మధ్య చేపలు, రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారు. మచిలీపట్నం మండలం చిన్నాపురం, చల్లపల్లి మండలం మాజేరు రెవెన్యూ గ్రామాల పరిధిలోని 50 ఎకరాల భూముల్లో చెరువుల తవ్వకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఖరీఫ్‌ సీజన్‌లో వరి, రబీ సీజన్‌లో మినుము పంటలు పండే భూముల మధ్య ఎలాంటి అనుమతులు లేకుండా చేపలు, రొయ్యల చెరువులు తవ్వుతున్నారని, దీంతో ఇక తమ పొలాల్లో పంటలు పండే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల తవ్వకాలను నిలిపివేయాలని చిన్నాపురానికి చెందిన రైతులు గత వారం రోజులుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

యథేచ్ఛగా చెరువుల తవ్వకం

- చిన్నాపురం-మాజేరు మధ్య ఓ బడాబాబు నిర్వాకం

- పంట పొలాల మధ్య తవ్వకాలపై తహసీల్దార్‌కు ఫిర్యాదు

- అడ్డుకోవడం మా వల్ల కాదన్న రెవెన్యూ అధికారులు!

- కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన చిన్నాపురం గ్రామ రైతులు

- పంటలు, తాగునీటి ఇబ్బందులు వస్తాయని ఆవేదన

- కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మరుసటి రోజు నుంచే పనులు ముమ్మరం

ఏడాదికి రెండు పంటలు పండే భూముల మధ్య చేపలు, రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారు. మచిలీపట్నం మండలం చిన్నాపురం, చల్లపల్లి మండలం మాజేరు రెవెన్యూ గ్రామాల పరిధిలోని 50 ఎకరాల భూముల్లో చెరువుల తవ్వకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఖరీఫ్‌ సీజన్‌లో వరి, రబీ సీజన్‌లో మినుము పంటలు పండే భూముల మధ్య ఎలాంటి అనుమతులు లేకుండా చేపలు, రొయ్యల చెరువులు తవ్వుతున్నారని, దీంతో ఇక తమ పొలాల్లో పంటలు పండే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల తవ్వకాలను నిలిపివేయాలని చిన్నాపురానికి చెందిన రైతులు గత వారం రోజులుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

ఆంఽధ్రజ్యోతి-మచిలీపట్నం :

మచిలీపట్నం మండలం చిన్నాపురానికి చెందిన 200 మందికిపైగా చిన్నకారు రైతులకు మాజేరు-చిన్నాపురం గ్రామం సరిహద్దున భూములు ఉన్నాయి. రైతులంతా అరెకరం నుంచి రెండు ఎకరాల భూములు ఉన్నవారే. ఈ భూముల మధ్యలో 50 ఎకరాల విస్తీర్ణంలో చేపలు, రొయ్యల చెరువులు తవ్వేపనులను ప్రారంభించారు. గతేడాది ఇదే పంట పొలాల మధ్య చెరువులు తవ్వేందుకు ప్రయత్నించగా, రైతులు అభ్యంతరం పెట్టడంతో ఈ పనులు నిలిచిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ బడాబాబు ఈ భూములను లీజుకు తీసుకున్నాడు. తాను ఓ మాజీ ఎమ్మెల్యేకు వేలు విడిచిన బంధువునని, చెరువుల తవ్వకాలకు సంబంధించి అధికారులతో అన్ని రకాలుగా మాట్లాడుకున్నామని చెబుతూ నానా హంగామా చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న చిన్నాపురం గ్రామానికి చెందిన రైతులు భూములు చల్లపల్లి మండలం మాజేరు రెవెన్యూ గ్రామ పరిధిలో ఉండటంతో గత నాలుగైదు రోజులుగా చల్లపల్లి తహసీల్దార్‌ కార్యాలయాకి వెళ్లి తహసీల్దార్‌ వనజాక్షికి విషయం వివరించారు. పంట భూముల మధ్య చేపలు, రొయ్యల చెరువులు తవ్వితే ఇక ఈ ప్రాంతంలో వరి, మినుము పంటలు సాగు చేయడానికి అవకాశం ఉండదని, పంట పొలాల్లోని మురుగు నీరు త్వరితగతిన బయటకు పోదని చెప్పారు. మొదటిరోజు అక్కడేమీ చెరువుల తవ్వకాలు జరగడం లేదని, అయినా పరిశీలిస్తామని చల్లపల్లి రెవెన్యూ అధికారులు సమాధానం ఇచ్చారు. రెండో రోజు సిబ్బందిని పంపి పరిశీలిస్తామని చెప్పారు. మూడో రోజు చెరువుల చుట్టూ మురుగు నీరు పోవడానికి కాలువలు ఏర్పాటు చేస్తారని, ఇది పెద్దలతో కూడుకున్న వ్యవహారమని, తామేమీ చేయలేమని తహసీల్దార్‌ తమతో చెప్పి పంపేశారని చిన్నాపురం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరగా గత సోమవారం సాయంత్రం కలెక్టర్‌ బాలాజీ వద్దకు వచ్చి పంట పొలాల మధ్య చెరువులు తవ్వుతున్నారని, బోర్లు కూడా వేశారని, పంట పొలాల మధ్య చెరువులు తవ్వితే ఇకనుంచి పంటలు పండకపోవడంతోపాటు భూగర్భ జలాలు కలుషితమవుతాయని వినతిపత్రం అందించి తమగోడు వెళ్లబోసుకున్నారు. అయితే మంగళవారం ఉదయానికే 100కుపైగా ట్రాక్టర్లు, పది జేసీబీలు, ఐదు డోజర్లు పెట్టి చెరువుల తవ్వకం పనులు ప్రారంభించడం గమనార్హం.

తాగునీటిని అందించే గ్రామంలో ఇక ఆగం

సముద్ర తీరంలో చిన్నాపురం గ్రామం ఉన్నప్పటికీ ఈ గ్రామ పరిధిలో భూగర్భ జలాలు తాగడానికి పనికి వస్తాయి. తాగునీటి ఎద్దడి నెలకొన్న సమయంలో చిన్నాపురం గ్రామ పరిధిలో ఉన్న బోర్లలోని నీటిని చిన్నాపురం గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న తుమ్మలచెరువు, యాదర, సింహాచలం, వాడపాలెం, వెంకట దుర్గాంబపురం తదితర 15 గ్రామాలకు ఆర్‌డబ్ల్ల్యూఎస్‌ తాగునీటి పథకం ద్వారా తాగునీటిగా సరఫరా చేస్తూ ఉంటారు. చిన్నాపురం గ్రామంలోని చేతి పంపుల ద్వారా వచ్చిన నీటిని గ్రామస్తులు వాడుకుంటూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామం పక్కనే ఉన్న పంట భూముల్లో చెరువులను తవ్వి, ఉప్పునీటిని పెట్టి రొయ్యలు సాగు చేస్తే భూగర్భ జలాలు ఉప్పునీటిగా మారిపోతాయనే భయం గ్రామస్తులను వెంటాడుతోంది. తీరంలోని ఈ గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం చిన్నాపురంలోని భూగర్భ జలాలు మినహా, మరో ప్రత్నామ్నాయం లేద నే విషయాన్ని అధికారులను కలసిన సమయంలో గ్రామస్తులు వివరించారు. అయినా ఈ అంశాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన గోవాడ వెంకటేశ్వరరావు, చలమలశెట్టి వెంకటరమణ, నూకల పున్నారావు తదితరులు వాపోతున్నారు. చిన్నాపురం గ్రామ రైతులకు చెందిన పంట పొలాల మధ్య చెరువులు తవ్వితే పంటలు పండకపోవడం ఒక ఇబ్బందికాగా, భూగర్భ జలాలు ఉప్పనీటిగా మారి తమ గ్రామంతోపాటు మిగిలిన మరో 15గ్రామాల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడతారని చెబుతున్నారు. అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి, వాస్తవాలను గ్రహించి తదుపరి చ ర్యలు తీసుకోవాలని చిన్నాపురం రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:55 AM