Visakhapatnam: గాల్లో తేలినట్టుందే..
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:04 AM
విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపై సముద్రానికి అభిముఖంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జి (గాజు వంతెన)ని సోమవారం ప్రారంభించారు.
ధైర్యంగా నడుద్దాం.. చలో
విశాఖలో దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన: ఎంపీ భరత్
కైలాసగిరిపై సముద్ర మట్టానికి 1,020 అడుగుల ఎత్తున ఏర్పాటు
విశాఖపట్నం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపై సముద్రానికి అభిముఖంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జి (గాజు వంతెన)ని సోమవారం ప్రారంభించారు. ఇది దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి అని విశాఖ ఎంపీ శ్రీభరత్, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్ పేర్కొన్నారు. వీఎంఆర్‌డీఏ స్థలం సమకూర్చగా ‘శ్రీసాయిమోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, భారత్ మాత వెంచర్స్, ఆర్‌జే అడ్వెంచర్స్’ సంయుక్తంగా రూ.7 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించాయి. వీఎంఆర్‌డీఏకి గ్యారెంటీ ఫీ కింద ఆదాయంలో వాటా ఇస్తారు. ఈ గ్లాస్ బ్రిడ్జి పొడవు 55 మీటర్లు. ఇందులో 20 మీటర్లు భూమి మీద, మిగిలిన 35 మీటర్లు గాలిలో ఉండేలా నిర్మించారు. వెడల్పు మూడు మీటర్లు. సముద్ర మట్టానికి 1,020 అడుగున ఎత్తున ఏర్పాటు చేశారు. ఒకేసారి వంద మీద బ్రిడ్జి మీదకు వచ్చినా చెక్కుచెదరనంత బలంగా నిర్మించారు. అయితే భద్రతా కారణాల రీత్యా విడతకు 40 మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. పర్యాటకులను బృందాల వారీగా గాజు వంతెన మీదుకు పంపుతారు. ఒక్కో బృందం 5-7 నిమిషాలపాటు సందర్శించేందుకు అనుమితిస్తారు. గంటకు 250 కి.మీ.ల వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరకుండా గ్లాస్ బ్రిడ్జిని రూపొందించారు. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న 40 ఎం.ఎం. మందం కలిగిన గ్లాస్‌తో తయారు చేశారు. పర్యాటకుల భద్రత కోసం బ్రిడ్జికి రెండు వైపులా 1.5 మీటర్ల ఎత్తున స్టెయిన్‌లెస్ స్టీల్ రెయిలింగ్ పెట్టారు.