Aviation: భోగాపురంలో దేశంలోనే తొలి ఏఏడీ ఎడ్యుసిటీ
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:25 AM
విజయనగరం జిల్లా భోగాపురంలో మరో ప్రఖ్యాత ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. విమానయాన రంగంలో నిపుణుల కొరత తీర్చే లక్ష్యంతో దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్......
జీఎంఆర్-మాన్సాస్ ఆధ్వర్యంలో 160 ఎకరాల్లో నిర్మాణం
ఎడ్యుసిటీకి నేడు మంత్రి లోకేశ్ శ్రీకారం
అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురంలో మరో ప్రఖ్యాత ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. విమానయాన రంగంలో నిపుణుల కొరత తీర్చే లక్ష్యంతో దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ (ఏఏడీ) ఏడ్యుకేషన్ సిటీని స్థాపించేందుకు జీఎంఆర్-మాన్సాస్ శ్రీకారం చుట్టాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 160ఎకరాల్లో ఏఏడీ ఎడ్యుసిటీని స్థాపించనున్నాయి. విమానయానం, ఏరోస్పేస్, ఢిపెన్స్ రంగాల్లో నిపుణులను తయారుచేసేందుకు ప్రముఖ అంతర్జాతీయ యూనివర్సిటీలు ఇక్కడ క్యాంప్‌సలు ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టును మంత్రి లోకేశ్ మంగళవారం విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. దేశంలో విమానయానం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దేశవ్యాప్తంగా 200విమానాశ్రయాల్లో ప్రయాణికుల రాకపోకలు 700 మిలియన్లకు చేరుకున్నాయి. ఈ సంఖ్య 2030 నాటికి 1,700 మిలియన్‌లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ మార్కెట్ విలువ 2024లో 28.7 బిలియన్ డాలర్ల నుంచి 2034 నాటికి 57 బిలియన్ డాలర్లకు చేరుతుందని విమానయానరంగ నిపుణులు చెబుతున్నారు. ఈ వేగానికి తగ్గట్లు నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో లేవు. దేశంలో విమానయాన రంగంలో తీవ్రమైన నిపుణుల కొరత ఉంది. అర్హత కలిగిన పైలెట్లు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు (ఏఎంఈ)లు, విమాన భద్రతా నిపుణుల కొరత విమానయానరంగాన్ని వేధిస్తోంది. ఏరోస్పేస్ డిజైన్, సుస్థిర విమానయానం, ఏఐ/సైబర్ సెక్యూరిటీ యూఏవీ వ్యవస్థలు, స్పేస్ టెక్నాలజీలో ఉన్నత కోర్సులు దేశంలో చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. మొత్తం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 0.5 శాతమే ఏవియేషన్‌రంగం నుంచి వస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఏవియేషన్ రంగం ఎదుర్కొంటున్న నిపుణుల కొరతను అధిగమించేందుకు వీలుగా అర్హత, సామర్థ్యం కలిగిన వారిని సిద్ధం చేసేందుకు జీఎంఆర్-మాన్సాస్ ముందుకొచ్చాయి. దేశంలోనే తొలి సమగ్ర విద్య ఆవిష్కరణ కేంద్రంగా ఏఏడీ ఎడ్యుకేషన్ సిటీని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో స్థాపించేందుకు ఆ సంస్థలు సంయుక్తంగా సిద్ధమయ్యాయి. ఏఏడీ రంగానికి అంకితమైన తొలి సమీకృత విద్య, ఆవిష్కరణల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రంలో అంతర్జాతీయంగా పేరుగాంచిన యూనివర్సిటీల బ్రాంచ్ క్యాంప్‌సలు ఏర్పాటు కానున్నాయి. అడ్వాన్స్‌డ్ రీసెర్చ్, ఇన్నోవేషన్ సెంటర్లు, అప్లయిడ్ టెక్నాలజీ్‌సపై అవి దృష్టి సారిస్తాయి. స్టార్ట్‌పలు, పరిశ్రమలకు సహకారం కోసం ఇంక్యుబేషన్ ప్రొటో టైప్ సదుపాయాలను కల్పిస్తాయి. పైలట్లతో పాటు సాంకేతిక సమస్యలను ఛేదించగలిగే ఇంజనీరింగ్ విద్యార్థులను కూడా ఏఏడీ తయారు చేస్తుంది.