Turmeric Demand: అంతర్జాతీయ విపణిలో దేశీయ పసుపునకు భారీ డిమాండ్
ABN , Publish Date - Apr 12 , 2025 | 05:29 AM
దేశీయంగా ఉత్పత్తయ్యే పసుపు కోసం అంతర్జాతీయ విపణిలో భారీ డిమాండ్ ఉంది అని పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తెలిపారు. రూ.1,876 కోట్ల ఎగుమతులను రూ.6,000 కోట్లకు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు

జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి
రాజమహేంద్రవరం రూరల్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): భారత్‌లో ఉత్పత్తయ్యే పసుపునకు అంతర్జాతీయ విపణిలో భారీ డిమాండ్ ఉందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి చెప్పారు. రాజమహేంద్రవరంలోని సీటీఆర్‌ఐ జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థలో శుక్రవారం ఏర్పాటు చేసిన పసుపు పంట భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పసుపు ఎగుమతుల ద్వారా రూ.1,876 కోట్ల ఆదాయం వస్తోందని, వచ్చే ఐదేళ్లలో దీన్ని రూ.6,000 కోట్లకు పైగా పెంచడానికి బోర్డు కృషి చేస్తోందని తెలిపారు. పసుపు వినియోగం పెరిగిందని, రైళ్లు, విమానాల్లో గోల్డెన్ మిల్క్ పేరుతో పసుపు కలిపిన పాలను ప్రయాణికులకు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో పసుపు సాగుకు అనుకూలమైన వాతావరణం ఉందని, అధిక కురుకుమిన్ శాతం కలిగిన పసుపు రకాలను ఆ ప్రాంతాల్లో రైతులు సాగు చేసేందుకు జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ కృషి చేయాలని కోరారు.