Share News

Indian Naval Ships: నేడు నేవీలోకి హిమగిరి, ఉదయగిరి

ABN , Publish Date - Aug 26 , 2025 | 04:55 AM

యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్‌ హిమగిరి, ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి మంగళవారం విశాఖపట్నంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేతులమీదుగా తూర్పు నౌకాదళంలో చేరనున్నాయి.

Indian Naval Ships: నేడు నేవీలోకి హిమగిరి, ఉదయగిరి

విశాఖపట్నం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్‌ హిమగిరి, ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి మంగళవారం విశాఖపట్నంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేతులమీదుగా తూర్పు నౌకాదళంలో చేరనున్నాయి. వేర్వేరు షిప్‌యార్డుల్లో తయారై ఒకేసారి, ఒకేచోట నేవీలో ప్రవేశించడం వీటి ప్రత్యేకత. ప్రాజెక్టు 17ఏలో మొదటిదైన స్టెల్త్‌ ఫ్రిగేట్‌ హిమగిరి (ఎఫ్‌34)ని కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ నిర్మించగా, ఉదయగిరి (ఎఫ్‌35)ని ముంబైలోని మజగాన్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ రూపొందించింది. భారత నౌకాదళం వార్‌షిప్‌ డిజైన్‌ బ్యూరో రూపొందించిన 100వ నౌక కూడా ఇదే కావడం విశేషం. వీటిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఒక్కొక్కటి 6,700 టన్నులు కలిగిన ఈ ఫ్రిగేట్‌లు వీటికి ముందున్న శివాలిక్‌ క్లాస్‌ ఫ్రిగేట్ల కంటే ఐదు శాతం పెద్దవి. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులు, మీడియం రేంజ్‌ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, 76 ఎంఎం మీడియం రేంజ్‌ గన్‌, 30 ఎంఎం, 12.7 ఎంఎం ఆయుధాలు, యాంటీ సబ్‌మెరైన్‌, సముద్ర అంతర్భాగంలో ప్రయోగించే ఆయుధాలు అమర్చారు.

Updated Date - Aug 26 , 2025 | 04:56 AM