Share News

RSS Chief Mohan Bhagwat: భారత్‌ విశ్వగురు కావాలి

ABN , Publish Date - Dec 27 , 2025 | 03:43 AM

భారత్‌ విశ్వగురు కావాలని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఆకాంక్షించారు. భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

RSS Chief Mohan Bhagwat: భారత్‌ విశ్వగురు కావాలి

  • భారతీయుల రక్తంలోనే ధర్మ దృష్టి

  • విజ్ఞానం అంటేనే ప్రపంచ శ్రేయస్సు

  • విజ్ఞాన శాస్త్రానికి వివేకం, నైతిక విలువల్ని జోడించాలి..

  • ఆర్‌ఎస్ఎస్‌ చీఫ్‌ భాగవత్‌ ఉద్ఘాటన

తిరుపతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): భారత్‌ విశ్వగురు కావాలని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఆకాంక్షించారు. భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘‘భారతీయుల రక్తంలోనే ధర్మ దృష్టి ఉంది. ప్రకృతిలో మనుషులే కాకుండా జంతువులు, పక్షులు, చెట్లు సహా అన్ని ప్రాణులూ సుఖంగా జీవించాలి. అదే నిజమైన అభివృద్ధి. విశ్వానికి ఏదో చేయాలన్న తపన భారత్‌కు ఉంది. త్వరలోనే విశ్వ గురు స్థానాన్ని అధిరోహించి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుని తీరుతుంది. జ్ఞాన పిపాసకు వివేకం తోడు కావాలి. విజ్ఞానమంటే ప్రపంచ శ్రేయస్సు అనే భావన అందరిలో కలగాలి. ప్రతి వ్యక్తి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం పొంది జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలి. ఈ దిశగా విజ్ఞాన భారతి బాధ్యత తీసుకుని అధ్యాపకులతో, శాస్త్ర పరిశోధకులతో సదస్సులు, చర్చా గోష్ఠులు నిర్వహించడం అభినందనీయం.’’ అని మోహన్‌ భాగవత్‌ అన్నారు. మనిషికి సమాజంపై దృష్టి, చింతన ఉండాలని, అలాగే సమాజానికి ప్రకృతిపై దృష్టి ఉండాలన్నారు. సైన్స్‌ మంచిదే కానీ దానికి వివేకం, నైతిక విలువలు కూడా తోడు కావాలని అభిప్రాయపడ్డారు. విజ్ఞానాన్ని మంచికి ఎలా వాడాలన్న బుద్ధి భారతీయులకు ఉందని, కానీ ఇతరుల్లో చాలామందికి ఆ ఆలోచన లేదన్నారు. మాతృభాషలో చదువు మంచిదని, ఎవరికి ఏ భాష తెలుసో, ఆ భాషలోనే వారికి జ్ఞానం, విజ్ఞానం అందించాలని కోరారు. పది వేల ఏళ్లుగా మనం పొలాలు సాగు చేస్తున్నామని, అయితే ఎక్కడా భూమి పాడవకపోవడానికి మన ప్రాకృతిక సాగు విధానాలే కారణాలన్నారు. కాగా, సుమారు 3500 స్టార్ట్‌పలతో దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు దూసుకెళుతోందని, గ్లోబల్‌ ఇండెక్స్‌లో 81వ ర్యాంకు నుంచి భారత్‌ 38వ ర్యాంకుకు చేరుకుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేందర్‌ సింగ్‌ అన్నారు. కాగా, సదస్సులో విజ్ఞాన భారతి చైర్మన్‌ శేఖర్‌ పాండే, డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి, జాతీయ సంస్కృత వర్శిటీ వీసీ ప్రొఫెసర్‌ జీఎ్‌సఆర్‌కే మూర్తి తదితరులతోపాటు దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీలు, ఐసర్‌లు, ఇతర ఉన్నత విద్యా సంస్థలకు చెందిన ప్రొఫెసర్లు, విద్యావేత్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 03:45 AM