Share News

Agni-6 Missile: అగ్ని-6 పరీక్షకు భారత్‌ సిద్ధం...

ABN , Publish Date - Oct 16 , 2025 | 06:52 AM

డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తున్న అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-6ను పరీక్షించేందుకు భారత్‌ సిద్ధమైందా..? బంగాళాఖాతంలో 3,550 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తూ...

Agni-6 Missile: అగ్ని-6 పరీక్షకు భారత్‌ సిద్ధం...

  • బంగాళాఖాతంలో 72 గంటల నోటమ్‌ జారీ

న్యూఢిల్లీ, అక్టోబరు 15: డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తున్న అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-6ను పరీక్షించేందుకు భారత్‌ సిద్ధమైందా..? బంగాళాఖాతంలో 3,550 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తూ నోటమ్‌ (నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌) జారీ చేయడంతో.. అగ్ని-6 పరీక్షకు రెడీ అయినట్టే అనిపిస్తోంది..! నోటమ్‌ జారీచేసిన ఈ ప్రాంతంలోకి 15 నుంచి 17 వరకు... అంటే 72 గంటలపాటు విమానాలు గానీ, నౌకలు గానీ ప్రవేశించకుండా నిషేధం అమలులో ఉంటుంది. 3,550 కిలోమీటర్ల మేర నోటమ్‌ను జారీ చేయడంతో.. ఖండాంతర బాలిస్టిక్‌ మిస్సైల్‌ (ఐసీబీఎం) అగ్ని-6 పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. భారత్‌ వద్ద ఉన్న అగ్ని-5.. క్షిపణికి 5వేల కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. వాస్తవానికి ఇటీవల ప్రభుత్వం జారీచేసిన నోటమ్‌ జోన్‌ను మూడుసార్లు సవరించారు. ఈ నెల 6న నోటమ్‌లో నో ఫ్లై జోన్‌ పరిధిని 1,480 కి.మీ.గా ప్రకటించగా.. ఆ మరుసటి రోజే దాన్ని 2,520 కి.మీ.కి పెంచారు. తాజాగా దాన్ని ఏకంగా 3,550 కి.మీ.కి పెంచారు. దీంతో ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగానికి సిద్ధమై ఉండొచ్చని భావిస్తున్నారు.


అగ్ని-6 క్షిపణి పరిధి 8 వేల నుంచి 12 వేల కి.మీ. వరకూ ఉండొచ్చని అంచనా.

అగ్ని-6 కోసమేనా...? భారత ప్రభుత్వం నోటమ్‌ అయితే జారీ చేసింది కానీ.. దీనికి కారణం ఏమిటో మాత్రం వెల్లడించలేదు. దీంతో రక్షణ రంగ నిపుణులు ఇది డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని సిరీస్‌ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. నోటమ్‌ జారీచేసిన ప్రాంతాన్ని బట్టి అగ్ని-6 క్షిపణిని ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) నుంచి పరీక్షించవచ్చని భావిస్తున్నారు.

Updated Date - Oct 16 , 2025 | 07:48 AM