Share News

CM Chandrababu Naidu: 2047కు మనమే నంబర్‌ 1

ABN , Publish Date - Nov 23 , 2025 | 04:20 AM

ప్రపంచంలో భారతదేశం నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది. 2038 నాటికి మనం ప్రపంచంలోనే రెండో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం

CM Chandrababu Naidu: 2047కు మనమే నంబర్‌ 1

  • ఫ్యూచర్‌ టెక్నాలజీని ఏపీకి తీసుకొస్తున్నాం

  • విలువలతో కూడిన విద్య అందించే ‘సత్యసాయి’

  • ఆయన పంచసూత్రాలతో ప్రపంచ శాంతి

  • సత్యసాయి ట్రస్టు సేవా కార్యక్రమాలు భేష్‌

  • అతి శక్తిమంతమైన సేవా వ్యవస్థ ఇది

  • విద్య, వైద్య సేవలు అమూల్యం.. సీఎం ప్రశంస

  • మరో రెండు పథకాలు ప్రారంభించిన ట్రస్టు

పుట్టపర్తి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రపంచంలో భారతదేశం నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది. 2038 నాటికి మనం ప్రపంచంలోనే రెండో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం. 2047నాటికి నంబర్‌ వన్‌ ఉంటాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దీనికోసం భవిష్యత్‌ రంగాలైన ఏఐ డేటా సెంటర్లు, క్వాంటమ్‌, ఏరోస్పేస్‌, డ్రోన్‌, అంతరిక్షం, సెమీ కండక్టర్‌, రక్షణ రంగాల్లో పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పునరుత్పాదక విద్యుదుత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, అన్ని ఫ్యూచర్‌ టెక్నాలజీలను ఏపీకి తీసుకువస్తున్నామని అన్నారు. శనివారం పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో, సత్యసాయి శతజయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ‘‘ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిత్వ నిర్మాణమే కేంద్రంగా సత్యసాయి విద్య సాగుతోంది. విద్యార్థులను వృత్తిపరంగా సమర్థులుగా, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులుగా సత్యసాయి విద్యా సంస్థలు తీర్చి దిద్దుతున్నాయి. నేను విదేశాలకు వెళ్లినప్పుడు ట్యాక్సీ డ్రైవర్‌ ఎక్కడ నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఏపీ అనగానే సత్యసాయి గురించి అడిగారు. స్యతసాయి తన ప్రేమను ప్రపంచానికి చాటారనేందుకు ఇదే నిదర్శనం’’ అని చంద్రబాబు తెలిపారు. నేటి సమాజంలో సత్యసాయి సిద్ధాంతాలు చాలా ముఖ్యమని, దీన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.


రత్నాకర్‌ స్వాగతోపన్యాసం

పూర్ణచంద్ర ఆడిటోరియంలో జరిగిన శత జయంతి వేడుకలలో సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ స్వాగతోపన్యాసం చేశారు. అంతకు మునుపు ఆయన రాష్ట్రపతి ముర్ము, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రశాంతి నిలయంలో స్వాగతం పలికారు. వేదికపై వారికి స్వాగతం పలుకుతూ ప్రసంగించారు. ‘నా జీవితమే నా సందేశం’ అని సత్యసాయిబాబా ప్రేమ, సేవ, ఆధ్యాత్మికతను పంచారని అన్నారు. వాటిని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ట్రస్టు ఆశయమన్నారు. 1940లో సత్యసాయి తన 14వ ఏట అవతార ప్రకటన చేశారని అన్నారు. అప్పట్లో దేశంలో బ్రిటీష్‌ పాలన సాగుతోందని, నాటి నుంచి 24 గంటల పాటు సేవలు, బోధనలతో తన ప్రేమతత్వాన్ని విశ్వవ్యాప్తం చేశారని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 225 సేవా కార్యక్రమాలను ట్రస్టు నిర్వహిస్తోందని తెలిపారు. 25 రాష్ట్రాలలోని 400 జిల్లాల్లో 6500 సేవా సంస్థల ద్వారా నిస్వార్థ సేవలు కొనసాగిస్తున్నామని తెలిపారు. శ్రీసత్యసాయి గ్లోబల్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో 140 దేశాలలో 2500 సెంటర్ల ద్వారా సేవలను అందిస్తున్నామని వివరించారు. అనంతరం రాష్ట్రపతిని రత్నాకర్‌ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి గ్లోబల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ చక్రవర్తి, ట్రస్టు ప్రతినిధులు డాక్టర్‌ మోహన్‌, నాగానందం, ప్రసాద్‌, మంత్రులు నారా లోకేశ్‌, సత్యకుమార్‌ యాదవ్‌, అనగాని సత్యప్రసాద్‌, సవిత, కందుల దుర్గేశ్‌, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు, కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ఎస్పీ సతీశ్‌ కుమార్‌, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

నూతన సేవా కార్యక్రమాలు ప్రారంభం

సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రెండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించారు. విశ్వశాంతికోసం సత్యసాయి బోధనలను వ్యాప్తి చేసే ‘శ్రీసత్యసాయి యూనివర్సల్‌ టార్చ్‌ ఆఫ్‌ పీస్‌’ను ఏర్పాటు చేశారు. ‘శ్రీసత్యసాయి ట్రైబల్‌ ఉమెన్స్‌ హెల్త్‌ కేర్‌ ప్రోగ్రాం’ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. దీని ద్వారా ఆదివాసీ గ్రామాలలో మహిళల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపడతారు.

Updated Date - Nov 23 , 2025 | 04:21 AM