Share News

Vice President Election: వైసీపీ పై ఇండీ కన్ను

ABN , Publish Date - Aug 23 , 2025 | 04:27 AM

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ మద్దతు ఆశించిన ఇండీ కూటమి నేతలపై ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నీళ్లు గుమ్మరించారు.

Vice President Election: వైసీపీ పై ఇండీ కన్ను

  • ఉపరాష్ట్రపతి బరిలో మద్దతు కోసం ఆ పార్టీ ఎంపీలతో మంతనాలు

  • సుబ్బారెడ్డితో మాట్లాడిన జైరాం

  • రఘునాథరెడ్డిని పిలిపించుకున్న ఖర్గే

  • జగన్‌తోనూ టచ్‌లోకి కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ మద్దతు ఆశించిన ‘ఇండీ’ కూటమి నేతలపై ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నీళ్లు గుమ్మరించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో రాగానే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను కలుసుకుని పూర్తి మద్దతు ప్రకటించడం.. లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచే టీడీపీ.. ఎన్డీఏలో కొనసాగుతోందని స్పష్టం చేయడంతో ‘ఇండీ’ వర్గాలు ఆశలు వదులుకున్నాయి. చంద్రబాబును ఎలాగైనా కలుసుకుని సహకారం కోరాలని భావించిన ప్రతిపక్ష కూటమి నేతలు మౌనంగా ఉండిపోయారు. ఆయన వైఖరిని ముందుగానే ఊహించిన కాంగ్రెస్‌ నేతలు వైసీపీపై కన్నేశారు. ఆ పార్టీ ఎంపీలను నిరంతరం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. వారు కూడా స్పందిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ గురువారం వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో కీలక చర్చలు జరిపారు. తమ చేతుల్లో ఏమీ లేదని, తమ అధినేత జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోవాలని సుబ్బారెడ్డి తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆహ్వానం మేరకు మరో వైసీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లి చర్చించారు.


కర్ణాటక రాజకీయాల్లో ఖర్గే క్రియాశీలంగా ఉన్నప్పటి నుంచే తనకు తెలుసని.. అందుకే ఆయన రమ్మనడంతో స్నేహపూర్వకంగా వెళ్లానని రఘునాథరెడ్డి చెప్పారు. ఖర్గే తనను ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి మద్దతివ్వాలని కోరలేదని ఆయన అన్నప్పటికీ.. వారిద్దరి మధ్యా అదే అంశంపై ప్రధానంగా చర్చలు జరిగినట్లు సమాచారం. ఎంపీలతో పాటు ఏకంగా జగన్‌తోనే కాంగ్రెస్‌ నేతలు ఆయన సన్నిహితుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. వైసీపీలో ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడడం, మరికొంత మంది గుడ్‌బై చెబుతారని ప్రచారం జరుగుతుండడం తెలిసిందే. ఈ పరిణామాలే గాక లిక్కర్‌ కేసులో వైసీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి జైలుకెళ్లడం.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో పార్లమెంటులో వైసీపీ పూర్తిగా అస్తిత్వం కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీలు అంటీముట్టనట్లు ఉండడం, వివిధ అంశాలపై తమ పార్టీ వైఖరేంటో తెలియని అయోమయంలో పడడంతో కాంగ్రెస్‌ నేతలు వారిపై దృష్టి సారించారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న వైసీపీని తమ వైపు తిప్పుకోవడానికి ఇదే సరైన సమయమని వారు భావిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విప్‌ లేకపోవడం, సీక్రెట్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ జరుగుతుండడంతో వైసీపీ ఎంపీలు కూడా ఇండీ కూటమి అభ్యర్థి వైపు ఆకర్షితులయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో చిక్కుకుని, మద్యం స్కాం కూడా వెంటాడుతుండడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న జగన్‌.. మోదీ ప్రభుత్వాన్ని కాదని.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండీ కూటమికి అనుకూలంగా లోపాయకారీగా వ్యవహరిస్తారా అన్నది చర్చనీయాంశమవుతోంది.


బాబును కలవని ‘ఇండీ’ అభ్యర్థి!

తెలుగు ఆత్మాభిమానం పేరుతో తన మద్దతు కోరుతున్న వారిని ఉద్దేశిస్తూ.. ఓడిపోయే అభ్యర్థిని ఎందుకు నిలబెట్టాలని చంద్రబాబు ప్రశ్నించడం ఇండీ కూటమి నేతలను ఇరుకునపడేసింది. ఆయనతో ఇతర మిత్రపక్షాల నేతల ద్వారా మాట్లాడించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలతో ‘ఇండీ’ కూటమి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి.. చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించలేదని కూటమి నేతలు చెప్పారు.

Updated Date - Aug 23 , 2025 | 04:31 AM