Share News

Indelible Mark: చెరగని ముద్ర.. ఆరుద్ర

ABN , Publish Date - Sep 01 , 2025 | 05:45 AM

తెలుగు సాహితీ రంగంలో ఆరుద్ర ముద్ర చెరిగిపోనిది. ఆంధ్ర సాహిత్యానికి ప్రాపంచిక దృష్టితో పాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన వ్యక్తిగా, అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.

Indelible Mark: చెరగని ముద్ర.. ఆరుద్ర

  • కవి, పండితుడు, గేయ రచయిత, మాటల మరాఠీగా గుర్తింపు

  • తెలంగాణ పోరాట ఇతివృత్తంతో ‘త్వమేవాహం’తో సాహితీ ప్రస్థానం

  • వందలాది రచనలు, వేలాది సినీ గీతాలు, నవలలు రాసిన ప్రజ్ఞాశాలి

  • ఆరుద్ర శతజయంతి సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం

  • తెలుగు సాహిత్యంలో నవ్యత కోసం పరితపించిన నిత్య పరిశోధకుడు

‘ఆంధ్ర సాహిత్య వారధిని ఆంధ్రులు దాటగలిగేలా వారధి కట్టినవాడు ఆరుద్ర’

- వీఏకే రంగారావు,

ప్రముఖ సినీ సాహిత్య విమర్శకులు

(విశాఖపట్నం, చెన్నై- ఆంధ్రజ్యోతి)

తెలుగు సాహితీ రంగంలో ఆరుద్ర ముద్ర చెరిగిపోనిది. ఆంధ్ర సాహిత్యానికి ప్రాపంచిక దృష్టితో పాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన వ్యక్తిగా, అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన చేయని ప్రయోగం లేదు, చేపట్టని ప్రక్రియ కానరాదు. హేతువాది అయిన ఆరుద్ర... కవి, పండితుడు, పరిశోధకుడు, గేయ రచయిత, మాటల మరాఠీ, సాహితీ పరిశోధకుడు, విమర్శకుడు, నాటక కర్త, నవలాకారుడు, ఇంద్రజాలికుడు, సంగీతం, నృత్యం, చదరం గ నిపుణుడు... వెరసి బహుముఖ ప్రజ్ఞాశాలి. నిజాం పాలనలో తెలంగాణలో రజాకార్ల దోపిడీ, మహిళలపై జరిగిన అరాచకాలపై రాసిన తొలి కావ్యం ‘త్వమేవాహం’ ఆయనకు ఎంతగానో పేరు తెచ్చింది. దీన్ని చదివిన శ్రీశ్రీ.. ఇక తాను పద్యాలు రాయకపోయినా ఫర్వాలేదని వ్యాఖ్యానించారంటే ఆరుద్ర రచనల్లో లోతు ఎంతటిదో అర్థమవుతుంది. శ్రీశ్రీ తరువాత అప్పటి యువతరంపై ఎక్కువ ప్రభావం చూపించిన కవిగా పేరుగాంచారు. ఆరుద్ర శతజయంతి సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.


కలం పేరే అసలు పేరుగా... : ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివ శంకరశాస్త్రి. 1925 ఆగస్టు 31న విశాఖలో జన్మించారు. తల్లిదండ్రులు భాగవతుల వెంకట జోగమ్మ, నరసింగరావు. చదువుకొనే సమయంలో ఎర్రగా ఉన్న ఆయన్ను కొందరు స్నేహితులు ఆరుద్ర పురుగుతో పోల్చి పిలిచేవారు. తరువాత కాలంలో తన కలానికి ఆరుద్ర అని పేరు పెట్టుకుని రచనలు సాగించారు. అదే ఆయన అసలు పేరుగా నిలిచిపోయింది. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయం లో చదువుకు స్వస్తి చెప్పిన ఆరుద్ర కొన్నాళ్ల పాటు రాయల్‌ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ లో గుమస్తాగా పని చేశారు. ఆ తరువాత సంగీతంపై దృష్టి సారించిన ఆయన చెన్నై నుంచి వెలువడే వారపత్రిక ఆనందవాణిలో పని చే శారు. ఈ పత్రికకు సంపాదకుడి గా కూడా వ్యవహరించారు. అభ్యుదయ రచయితల సంఘం(అర సం) వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆరు ద్ర ఆ సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారు. 1949లో తొలిసారి రాసిన త్వమేవాహంతో ఆయన సాహితీ ప్రయాణం సుదీర్ఘకాలం పాటు సాగింది.


సమగ్ర ఆంధ్ర సాహిత్యంతో గుర్తింపు

వందలాది గేయాలు, గేయ నాటికలు, కథలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ్య వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు, సినీ గీతాలు రాశారు. సినీవాలి, కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు వంటి కావ్యాలు, వెన్నెల-వేసవి, దక్షిణ వేదం, జైలు గీతాలు వంటి అనువాద రచనలు, రాదారి బంగళా, శ్రీకృష్ణదేవరాయ, కాటమరాజు కథ వంటి అనేక రూపకాలు, నవల లు ఆయనకు మంచి పేరుతెచ్చా యి. సమగ్ర ఆంధ్ర సాహిత్యం(14 సం పుటాలు) ఆరుద్రకు సాహిత్య రంగంలో విశేషమైన గుర్తింపుతో పాటు గౌరవాన్ని తెచ్చింది. రెండు వేలకుపైగా సినీ గీతాలు రాసిన ఆయన ఇతర భాషల సినిమాల కు డబ్బింగ్‌ చెప్పడంతో పాటు మాటలు, కథలు రాశారు. 8 డిటెక్టివ్‌ నవలలు రాయగా, ‘పలకల వెండిగ్లాస్‌’ బహుళ ప్రాచుర్యం పొందింది. చెస్‌ను ఇష్టపడే ఆరుద్ర చదరంగం పేరుతో పుస్తకాన్ని రాశారు. ఇంద్రజాలికుడు కూడా అయిన ఆరుద్ర.. మహేంద్రజాలం పేరుతో పుస్తకాన్ని రాశారు. ఆరు ద్ర మార్క్సిజం, కమ్యూనిజం సిద్ధాంతాలను బలంగా విశ్వసించారు. సిద్ధాంత రిత్యా నాస్తికుడు అయినప్పటికీ అనేక ఆధ్యాత్మిక పాటలు కూడా రాశారు. కవిత్వం, పరిశోధనా రెండింటినీ వినియోగిస్తూ కవి పరిశోధకుడిగా నవ్యత కోసం పరితపించిన నిత్య పరిశోధకుడిగా పేరుగాంచారు.


జర్నలిస్టు అవుదామని వచ్చి..!

ఆరుద్రకు మొదట్లో సినీ పరిశ్రమపై అంతగా ఆసక్తి ఉండేది కాదు. జర్నలిస్టు అవుదామని 1946లో మద్రాస్‌ చేరిన ఆయన.. బతుకుతెరువు కోసం మొదట్లో ‘ఢంకా’ పత్రికలో ప్రూఫ్‌ రీడర్‌గా పనిచేసేవారు. అక్కడ రోజంతా పనిచేయగా వచ్చిన ఒక్క రూపాయిని ఆంగ్ల సినిమాలు చూసేందుకు ఖర్చు చేసేవారు. ఆ విధంగా ఏర్పడిన అవగాహనతో ఆయన సినిమాలపై విమర్శనా వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో పరిచయమైన న్యాపతి నారాయణమూర్తి.. రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ వారికి ఆరుద్రను పరిచయం చేశారు. అప్పుడే ఆ సంస్థ తీసిన ‘సౌదామని’ చిత్ర స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో ప ని చేశారు. అనంతరం ఆ చిత్ర సెట్‌లోనూ పనిచేసి, మన్ననలు పొందారు. కేవీ నాగభూషణం కంపెనీలో చేరి, ప్రప్రథమంగా ‘పరోపకారం’ అనే చిత్రానికి మాటలు అం దించారు. అది మొదలు ఆరుద్ర వెనుదిరిగి చూడలేదు. మద్రాస్‌ వచ్చాకే సినీ, సాహితీలోకంలో ఆరుద్ర వెలుగు ప్రారంభమైంది. శ్రీశ్రీతో కలిసి తెలుగు డబ్బింగ్‌ సినిమాల కు మాటలు, పాటలు రాశారు. ద్రావిడ భాషలన్నింటినీ ఆయన స్పృశించారు. ఆంగ్లం, హిందీ, సంస్కృతం, ఫ్రెంచి భాషలపైనా ఆయనకు మంచి పట్టుంది. తమిళులు పవిత్రంగా భావించే ‘తిరుక్కురళ్‌’ను ‘దక్షిణ వేదం’గా, జయంకొండాన్‌ రాసిన ‘కళింగత్తుపరణి’ శృంగార కావ్యాన్ని ‘వెన్నెల వేసవి’గా తెలుగులోకి అనువదించి తమిళుల హృదయాల్లోనూ స్థానం పొందారు. 80వ దశకంలో సినీ పరిశ్రమ అంతా తరలిపోయినా, ఆరుద్ర మాత్రం ఇక్కడే ఉండిపోయారు. మద్రాస్‌ నగరం ఒడిలోనే 1998, జూన్‌ 4న తుదిశ్వాస విడిచారు.


పేరు తెచ్చిన రచనలు ఎన్నో..

ఆరుద్రకు పేరుతెచ్చిన రచనలు ఎన్నో ఉన్నాయి. తెలుగు సాహిత్య చరిత్రను తెలియజేసేలా రాసిన సమగ్రాంధ్రసాహిత్యం ఆరుద్ర ప్రతిభను తెలియజేసింది. అహింసా రౌడీ, రెండురెళ్లు ఆరు, దెయ్యాల కొంప వంటి డిటెక్టివ్‌ నవలలు, రాముడికి సీత ఏమవుతుంది వంటి పుస్తకాలు ఆయన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి.

శ్రీశ్రీ మేనల్లుడే ఆరుద్ర

ప్రముఖ సాహితీకారుడు శ్రీశ్రీ మేనల్లుడే ఆరుద్ర. అయినప్పటికీ తనదైన పంథాలో రచనలు సాగిస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆరుద్రను ఆంధ్ర విశ్వవిద్యాలయం 1985లో కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. గురజాడ గురుపీఠం అనే వ్యాసానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. రచనలతో పాటు పదునైన, వాక్పటిమతో ప్రసంగాలు చేయడంలో ఆరుద్ర దిట్ట. ఆరుద్ర భార్య రామలక్ష్మి కూడా రచయిత్రిగా మంచి పేరు సంపాదించుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు.

Updated Date - Sep 01 , 2025 | 05:47 AM