Share News

పెరుగుతున్న కేసులు

ABN , Publish Date - Dec 08 , 2025 | 01:10 AM

ఉమ్మడి జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 17 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకరు మరణించారు. ఇవి అధికారికంగా నమోదైన లెక్కలు. అనధికారికంగా ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెరుగుతున్న కేసులు

ఉమ్మడి కృష్ణాజిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ భయం

ఇప్పటికి 17 కేసులు నమోదు.. ఒకరి మృతి

ఇదే అదనుగా రెచ్చిపోతున్న ప్రైవేటు ఆస్పత్రులు

పట్టించుకోని అధికారులు.. ఆందోళనలో ప్రజలు

విజయవాడ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 17 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకరు మరణించారు. ఇవి అధికారికంగా నమోదైన లెక్కలు. అనధికారికంగా ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ పనులు చేసేవారు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్క్రబ్‌ టైఫస్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలతో పాటు జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికశాతం మందికి ఈ వ్యాధిపై అవగాహన లేదు. అధికారులు అప్రమత్తమవడంతో పాటు ప్రజలకు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరముంది. ఇది సాధారణ జ్వరం లాంటిదైనప్పటికీ ఆలస్యం చేస్తే శరీరంలో అంతర్గ అవయవాలపై ప్రభావం చూపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మండల పరిధిలో ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేటు ఆస్పత్రులు స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధిని పురస్కరించుకుని భారీగా సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా సమయంలో ఇలాగే జరిగిన విషయం తెలిసిందే. సాధారణ జ్వరాన్ని స్క్రబ్‌ టైఫస్‌ అని భయాందోళనకు గురిచేస్తూ పేదల నుంచి డబ్బు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధికి సంబంధించిన ల్యాబ్‌, మందులు ప్రభుత్వాస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

వర్షాకాలం జాగ్రత్త!

వర్షాకాలం సీజన్‌లోనే స్క్రబ్‌ టైఫస్‌కు కారణమైన బాక్టీరియా వృద్ధిలో ఉంటుంది. రైతులు పంట పొలాలకు వెళ్లినప్పుడు బూట్లు/చెప్పులు కచ్చితంగా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పంట పొలాల్లో సంచరించే ఎలుకలు, పక్షుల ద్వారా పంట చేలు, గట్లపై నల్లి, పేడపురుగు లాంటి కీటకం చేరి పొలాల్లో పనిచేసే సమయంలో మనుషులను కుట్టే అవకాశం ఉంది. గ్రామాల్లో అపరిశుభ్రంగా ఉండే ప్రాంతాలు, ఇంటి పరిసరాల గడ్డిలో ఈ పురుగు ఉంటుంది.

స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలు

-స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి తీవ్ర జ్వరంతో పాటు తలనొప్పి, చలితో మొదలవుతుంది.

-కండరాల నొప్పులు, లింపు గ్రంథలు వాపు ఉంటాయి.

-కొందరికి కళ్లు ఎర్రబడతాయి.

-దగ్గు కూడా ఉంటుంది.

-కొంతమంది శరీరంపై దద్దుర్లు ఏర్పడతాయి

- రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, వృద్ధులకు ఈ వ్యాధి లక్షణాలు ఎక్కవగా కనిపిస్తాయి.

-స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలు కనిపించిన మూడు రోజుల్లో రక్తపరీక్షలు చేయిచుకోవాలి

-నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాలేయంపై ప్రభావం చూపుతుంది.

-తర్వాత కిడ్నీ దెబ్బతిని డయాలసిస్‌కు దారితీయోచ్చు

-సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే అన్ని ప్రధాన అవయవాలపై ప్రభావం చూపుతుంది.

శరీరంలోకి నేరుగా ప్రవేశించదు

స్క్రబ్‌ టైఫస్‌ బ్యాక్టీరియా శరీరంలోకి నేరుగా ప్రవేశించలేదు. బ్యాక్టీరియాను మోసుకెళ్లే ఈగలు, పేలు, నల్లులు, చిగ్గర్లు కుట్టడం ద్వారా ఈ బ్యాక్టీరియా మానవుని శరీరంలోకి ప్రవేశిస్తుంది. కుట్టిన చోట కొందరికి నల్లని మచ్చ ఏర్పడుతోంది. కొందరిలో మచ్చ కనబడదు. నొప్పి ఉండదు. కొన్ని రోజుల్లో మచ్చ ఎండిపోతుంది. ఇవి కుట్టిన చోట బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశించి శరీరమంతా వ్యాపిస్తుంది. మూడు రోజుల నుంచి మొదలై ఆరు లేదా ఏడు రోజులకు పూర్తి లక్షణాలు బయటపడతాయి. మొదట్లో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, చలి వంటి లక్షణాలు కనిపిస్తాయి. మలేరియా, టైఫాయిడ్‌ అనే భ్రమలో ఉన్నవారు స్క్రబ్‌ టైఫస్‌ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

- డి.శారద, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ

Updated Date - Dec 08 , 2025 | 01:11 AM