పెరిగిన ‘స్త్రీ’ శక్తి!
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:13 AM
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి పథకం నూరుశాతం సార్థకతను సాధించింది. ఉచిత ప్రయాణంపై మహిళలు అధిక శాతం మొగ్గుచూపుతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి, షాపింగ్, ఆస్పత్రులు ఇలా తమ వ్యక్తిగత పనుల నిమిత్తం ఆర్టీసీ విజయవాడ రీజియన్ పరిధిలో సగటున రోజుకు లక్షన్నర మంది ప్రయాణిస్తున్నారు. ఏ బస్సు చూసినా 95 శాతం మహిళలే కనిపిస్తున్నారు. జీరోఫేర్ టికెట్‌తో వీరికి కోట్ల రూపాయల సబ్సిడీ లబ్ధి చేకూరింది.
- ఉచిత ప్రయాణంపై మహిళల మొగ్గు
- విజయవాడ సిటీలోకి వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ కిటకిట
- 95 శాతంపైగా మహిళా ప్రయాణికులే..
- ఉద్యోగాలు, ఉపాధి, షాపింగ్, ఆస్పత్రులకు రాక
- సగటున రోజుకు లక్షన్నర మంది ప్రయాణాలు
- జీరోఫేర్ టికెట్‌తో మహిళలకు కోట్ల రూపాయల సబ్సిడీ లబ్ధి
- బస్‌పాస్‌లు తీసుకోవడం తగ్గించేసిన పురుషులు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి పథకం నూరుశాతం సార్థకతను సాధించింది. ఉచిత ప్రయాణంపై మహిళలు అధిక శాతం మొగ్గుచూపుతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి, షాపింగ్, ఆస్పత్రులు ఇలా తమ వ్యక్తిగత పనుల నిమిత్తం ఆర్టీసీ విజయవాడ రీజియన్ పరిధిలో సగటున రోజుకు లక్షన్నర మంది ప్రయాణిస్తున్నారు. ఏ బస్సు చూసినా 95 శాతం మహిళలే కనిపిస్తున్నారు. జీరోఫేర్ టికెట్‌తో వీరికి కోట్ల రూపాయల సబ్సిడీ లబ్ధి చేకూరింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
గ్రామీణ ప్రాంతాల నుంచి విజయవాడ సిటీలోకి వచ్చే బస్సులన్నీటిలో నూటికి 98 శాతం మహిళలే ప్రయాణిస్తున్నారు. మహిళల తాకిడి తట్టుకోలేక సబర్బన్ పరిధిలోని పురుషులు బస్‌పాస్‌లను తీసుకోవటం మానేశారు. దీంతో విజయవాడ రీజియన్ పరిధిలోని రూరల్ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు పూర్తిగా మహిళలతో నిండిపోతున్నాయి. విజయవాడ గ్రేటర్ విలీన ప్రతిపాదిత గ్రామాల నుంచి విజయవాడ నగరానికి వచ్చే బస్సుల్లో ఈ పరిస్థితి ఉంది. ఇబ్రహీంపట్నం - విజయవాడ, హనుమాన్ జంక్షన్ - విజయవాడ, నున్న - విజయవాడ, గన్నవరం - విజయవాడ, కంకిపాడు - విజయవాడ, ఉయ్యూరు - విజయవాడ బస్సులలో ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ కనిపిస్తోంది. విజయవాడ సిటీ ఇంకా గ్రేటర్ కానప్పటికీ.. ఆర్టీసీ సబర్బన్ పరిధి మాత్రం గ్రేటర్ దాటి వెళుతుంది. విజయవాడ నుంచి మైలవరం, నూజివీడు, నున్న, ఆగిరిపల్లి, గన్నవరం, హనుమాన్ జంక్షన్, అమరావతి, మంగళగిరి, కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు వరకు నలువైపులా సబర్బన్ పరిధి ఉంది. ఈ సబర్బన్ లిమిట్స్‌లో సిటీ ఆర్డినరీలు, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు నడుస్తున్నాయి. పల్లె వెలుగు బస్సులు ఎలాగూ ఉంటాయి. ఉచిత ప్రయాణం కాబట్టి మహిళలు సౌకర్యవంతంగా ఉండే మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ఎక్కువుగా ఎంపిక చేసుకుంటున్నారు. ఆ తర్వాత సిటీ బస్సులను ఎంపిక చేసుకుంటున్నారు. సబర్బన్ పరిధిలో రూరల్ ప్రాంతాలలో ఉండే మహిళలు ఎక్కువుగా విజయవాడలో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు కంపెనీలలో పనిచేస్తున్నారు. ఆ తర్వాత షోరూమ్‌లు, మాల్స్, సూపర్ బజార్స్, సినిమా థియేటర్లు, వస్త్ర దుకాణాలు, బంగారు దుకాణాలు, ఫ్యాక్టరీలు, స్వీట్ షాపులు, ప్రింటింగ్ ప్రెస్‌లు, డెయిరీ, సెక్యూరిటీ సంస్థలలో పనిచేస్తూ ఉపాధి పొందేవారు చాలా మంది ఉన్నారు. వీరంతా గతంలో ఆటోలను ఆశ్రయించేవారు. ప్రస్తుతం ఉచిత ప్రయాణం కాబట్టి అవసరమైతే ఒక గంట ముందే బస్టాపులకు వచ్చి బస్సుల కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. వీరు కాకుండా విజయవాడ షాపింగ్ చేయటానికి వచ్చే మహిళల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోయింది. మార్ట్‌లకు వచ్చి సరుకులు తీసుకునేందుకు కూడా సాధారణ గృహిణులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో మహిళా ప్రయాణీకుల సంఖ్య రూరల్ ప్రాంతాల నుంచి విజయవాడకు గణనీయంగా పెరిగింది. జిల్లా బస్సులలో గతం కంటే 5 శాతం మాత్రమే మహిళా ప్రయాణికులు పెరిగారు.
బస్‌పాస్‌లు రద్దు చేసుకుంటున్న పురుషులు :
విజయవాడ సిటీలో ఉద్యోగాలు, పనుల కోసం వచ్చే పురుషులు ఎక్కువుగా బస్‌పాస్‌లను తీసుకుంటున్నారు. నెలాఖరులో రెన్యువల్ చేసుకుంటారు. ఈ సెప్టెంబరు నెలకు బస్‌పాస్‌లు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆర్టీసీ అధికారులు గుర్తించారు. మహిళా ప్రయాణికుల తాకిడి వల్లే వీరు పాస్‌లు రద్దు చేసుకుని ద్విచక్రవాహనాలు, ఆటోల మీద ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చే బస్సులలో నలుగురైదుగురు పురుషులు తప్పితే అంతా మహిళలే ఉంటున్నారు.