AP High Court: ప్రోత్సాహకాలిస్తే తప్పేంటి
ABN , Publish Date - Jul 31 , 2025 | 03:32 AM
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు ఇస్తే తప్పేముందని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
పెట్టుబడులను ఆకర్షించడం కోసమే టీసీఎస్‌కు నామమాత్ర ధరకు భూములు ఇచ్చి ఉంటారు
రాష్ట్ర అభివృద్ధి ప్రారంభ దశలో ఉంది
ఎంత రేటుతో భూమి కేటాయిస్తున్నారని కాదు..ఆ సంస్థ రాకతో ఎంత లాభం అనేది చూడాలి
ఐటీతో హైదరాబాద్, బెంగళూరు స్థితి చూస్తున్నాం కదా?
హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు.. లీజుకు కేటాయిస్తున్నామన్నఎస్‌జీపీ.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు బెంచ్ ఆదేశం
‘‘రాష్ట్ర అభివృద్ధి ప్రారంభ దశలో ఉంది. ఈ నేపథ్యంలో భూమిని ఎంత రేటుకు ఇస్తున్నారనేది చూడకూడదు. టీసీఎస్ లాంటి సంస్థ రాష్ట్రానికి రావడం వల్ల జరిగే ప్రయోజనాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఐటీ వృద్ధి కారణంగా హైదరాబాద్,బెంగళూరు నగరాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం కదా!.’’
- ఏపీ హైకోర్టు
అమరావతి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు ఇస్తే తప్పేముందని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స(టీసీఎస్) లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థను ఆకర్షించేందుకు నామమాత్రపు రేటుతో భూమిని కేటాయించి ఉండవచ్చని పేర్కొంది. టీసీఎస్ రూ.1,370 కోట్ల పెట్టుబడితో 12 వేల ఉద్యోగాలు కల్పిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉందని గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు నామమాత్రపు ధరకు భూమిని కేటాయించడంతో పాటు వివిధ ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని గుర్తు చేసింది. రాష్ట్ర అభివృద్ధి ప్రారంభ దశలో ఉందని తెలిపింది. ఇలాంటి సమయంలో భూమిని ఎంత రేటుకు ఇస్తున్నారనేది చూడకూడదని, టీసీఎస్ రాష్ట్రానికి రావడం వల్ల జరిగే ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. ఐటీ వృద్ధి కారణంగా హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఏ స్థితిలో ఉన్నాయో గమనిస్తున్నాం కదా అని వ్యాఖ్యానించింది. విశాఖలో టీసీఎ్‌సకు నామమాత్రపు ధరకు భూకేటాయింపులు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. టీసీఎస్ సంస్థకు లీజు పద్ధతిలోనే భూమిని కేటాయిస్తున్నామని, సేల్ డీడ్ ద్వారా విక్రయిస్తున్నామన్న వాదనలో వాస్తవం లేదన్న ఎస్‌జీపీ వాదనను నమోదు చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదంటూ విచారణను వాయిదా వేసింది. అయితే భూ కేటాయింపు ప్రక్రియ తామిచ్చే తుదితీర్పుకి లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖపట్నంలో టీసీఎ్‌సకు 21.16 ఎకరాలను రూ0.99 పైసలకే కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 21న జీవో జారీచేసింది. దీన్ని సవాల్ చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రైట్స్ (ఎస్‌పీసీపీఈఆర్) అధ్యక్షుడు నక్కా నమ్మి గ్రేస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా, పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. విశాఖ నడిబొడ్డున రూ.529 కోట్లు విలువ చేస్తే స్థలాన్ని టీసీఎ్‌సకు చౌక రేటుకు సేల్ డీడ్ ద్వారా విక్రయించేందుకు ప్రయత్నిస్తుందని వాదించారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) ఎస్.ప్రణతి వాదనలు వినిపించారు. నిబంధనలకు లోబడి టీసీఎ్‌సకు లీజు పద్ధతిలోనే భూమిని కేటాయిస్తున్నామన్నారు. భూకేటాయింపునకు బదులుగా ఆ సంస్థ రూ.1,370కోట్ల పెట్టుబడి పెట్టి, 12వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు. భూమిని టీసీఎస్‌కు విక్రయిస్తున్నామన్న పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పూర్తివివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.