Share News

Speaker Ayyanna patrudu: అసెంబ్లీలో అనుబంధ భవనం ప్రారంభం

ABN , Publish Date - Sep 26 , 2025 | 05:23 AM

అసెంబ్లీ ప్రాంగణంలో నిర్మించిన అనుబంధ భవనాన్ని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు గురువారం ప్రారంభించారు.

Speaker Ayyanna patrudu: అసెంబ్లీలో అనుబంధ భవనం ప్రారంభం

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ప్రాంగణంలో నిర్మించిన అనుబంధ భవనాన్ని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు గురువారం ప్రారంభించారు. ఇందులో ప్రభుత్వ చీఫ్‌ విప్‌, ఇతర ప్రభుత్వ విప్‌ల కోసం 16 చాంబర్ల్లు, డైనింగ్‌ హాల్‌, మీడియా పాయింట్‌లను ఏర్పాటు చేశారు. భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రులు పయ్యావుల కేశవ్‌, పి.నారాయణలతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద అయ్యన్న మాట్లాడారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ భవనాన్ని అన్ని హంగులతో పునరుద్ధరించేందుకు రూ.5 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారని, ఈ-టెండరింగ్‌ విధానం ద్వారా రూ. 3.57 కోట్లకే నిర్మించినట్లు తెలిపారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మీడియా సమావేశాలకు వీలుగా సుమారు 100 మంది మీడియా ప్రతినిధులు కూర్చునే విధంగా హాల్‌, దీన్ని ఆనుకుని డైనింగ్‌ హాలు, కిచెన్‌ నిర్మించామన్నారు. మొదటి అంతస్తులో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ సహా 16 మంది ప్రభుత్వ విప్‌ల చాంబర్లను, ఒక వెయిటింగ్‌ హాలును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ ఎంతో సహకరించారని తెలిపారు. నిరంతరం పర్యవేక్షించిన అసెంబ్లీ కార్యదర్శి సూర్యదేవర ప్రసన్నకుమార్‌, సీఆర్‌డీఏ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జి.వి.ఆంజనేయులు, అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్నకుమార్‌, ప్రభుత్వ విప్‌లు దాట్ల సుబ్బరాజు, రెడ్డప్పగారి మాధవి, కాల్వ శ్రీనివాసులు, బెందాళం అశోక్‌, శ్రీనివాస్‌, తంగిరాల సౌమ్య, పీజీవీఆర్‌ నాయుడు, యార్లగడ్డ వెంకట్రావు, థామస్‌, అరవ శ్రీధర్‌, తోట జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 05:24 AM