Share News

Housing Scheme: పేదలకు సొంతింటి పండగ

ABN , Publish Date - Nov 12 , 2025 | 04:34 AM

పేదల సొంతింటి కల నెరవేరింది. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది.

Housing Scheme: పేదలకు సొంతింటి పండగ

  • రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లలో నేడు సామూహిక గృహ ప్రవేశాలు.. రాయచోటిలో ప్రారంభించనున్న సీఎం

  • 17 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగిస్తున్న ప్రభుత్వం

అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కల నెరవేరింది. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది. అధికారంలోకి వచ్చిన 17నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగిస్తోంది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై-బీఎల్‌సీ) పథకం కింద నిర్మించిన 2,28,034 ఇళ్లు, పీఎంఏవై-గ్రామీణ్‌ పథకం కింద మరో 65,292 ఇళ్లు, పీఎంఏవై-జన్‌మన్‌ పథకం కింద 6,866 ఇళ్లు కలిపి మొత్తంగా 3,00,192 ఇళ్లలో లబ్ధిదారులు బుధవారం సామూహిక గృహ ప్రవేశాలు చేయనున్నారు. దీనికి గృహ నిర్మాణశాఖ ఏర్పాట్లు చేసింది. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేయించి.. ఇంటి తాళాలు అందిస్తారు. అక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పూర్తి చేసిన ఇళ్లను సీఎం వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొననున్నారు.


నేడు అన్నమయ్య జిల్లాకు ముఖ్యమంత్రి

సీఎం చంద్రబాబు బుధవారం అన్నమయ్య జిల్లాకు రానున్నారు. రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో పేదల గృహప్రవేశాలు, పూజా కార్యక్రమాలలో పాల్గొననున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

టీడీపీ హయాంలో 8 లక్షల ఇళ్ల నిర్మాణం

గత వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో 4.73 లక్షల ఇళ్లను రద్దు చేసి రాష్ట్రంలో పేదల సొంతింటి కలలను కల్లలు చేసింది. 2.73 లక్షల మంది ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో 8 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలోనే 3లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా సీఎం చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ప్రస్తుతం పూర్తి చేసిన 3లక్షల ఇళ్లతోపాటు వివిధ దశల్లో ఉన్న మిగిలిన ఇళ్లను కూడా త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Nov 12 , 2025 | 04:34 AM