Share News

AP Government Action: కూలిన చెట్లు తక్షణమే తొలగింపు

ABN , Publish Date - Oct 30 , 2025 | 07:05 AM

మొంథా తుఫాన్‌ తీవ్ర నష్టం కలుగజేసినా.. దానివల్ల ప్రజలకు పెద్దగా అసౌకర్యం కలుగకుండా.. విధ్వంసం మరీ పెరగకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రధానంగా రోడ్లపై చెట్లు ఎక్కడ కూలినా..

AP Government Action: కూలిన చెట్లు తక్షణమే తొలగింపు

  • 24 గంటల్లోనే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

  • యుద్ధప్రాతిపదికన అధికారుల చర్యలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

మొంథా తుఫాన్‌ తీవ్ర నష్టం కలుగజేసినా.. దానివల్ల ప్రజలకు పెద్దగా అసౌకర్యం కలుగకుండా.. విధ్వంసం మరీ పెరగకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రధానంగా రోడ్లపై చెట్లు ఎక్కడ కూలినా.. అధికారులు తక్షణమే వాటిని తొలగిస్తూ వచ్చారు. ఆయా ప్రాంతాల్లో విరిగిపడిన 380 చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగించారు. అలాగే పెనుగాలులు, భారీవర్షాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో.. బుధవారం రాత్రిలోపే అన్ని చోట్లా సరఫరాను పునరుద్ధరించాలని సీఎం గట్టిగా ఆదేశాలివ్వడంతో దాదాపుగా ఆ ప్రక్రియను పూర్తిచేశారు. 24 గంటల్లోపే పునరుద్ధరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చెట్లు పెద్దసంఖ్యలో నేలకూలాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 950 కొబ్బరిచెట్లు, వందల సంఖ్యలో ఇతర చెట్లు విరిగిపడగా... 200 ట్రాన్స్‌ఫార్మర్లు, 600 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నాయి. కాకినాడ జిల్లాలో 181 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నాయి.. 49 చెట్లు కూలిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో 244 విద్యుత్‌ స్తంభాలు, 26 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా 96 చెట్లు నేలకూలాయి. ఇతర జిల్లాల నుంచి రప్పించిన సిబ్బంది తోడ్పాటుతో, క్రేన్ల సాయంతో అధికారులు చెట్ల తొలగింపు, విద్యుత్‌ పునరుద్ధరణ పనులు దిగ్విజయంగా పూర్తిచేశారు. తుఫాన్‌కు బాగా ప్రభావితమైన పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు 64 బృందాలను ఏర్పాటు చేశారు. 591 మంది సిబ్బంది సాయంతో 55 ఫీడర్స్‌(33/11 కేవీ)ను పునరుద్ధరించారు.


94 సబ్‌స్టేషన్లలో ఇబ్బందులను తొలగించి విద్యుత్‌ సరఫరా కొనసాగించారు. జిల్లావ్యాప్తంగా 426 విద్యుత్‌ స్తంభాలు దెబ్బ తినగా వాటిలో 242 స్తంభాలను నిలబెట్టారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనుల కోసం తిరుపతి ఎస్‌పీడీసీఎల్‌ నుంచి 167మందిని రప్పించారు. విశాఖపట్నం జిల్లాలో రెండు గ్రామాలకు కరెంటు నిలిచిపోగా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈదురు గాలులకు అనకాపల్లి జిల్లాలో చెట్లు కూలడం, కొమ్మలు విరిగిపడడంతో 83 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. 31 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అధికారులు, సిబ్బంది వెంటనే వెళ్లి చెట్లను తొలగించి.. స్తంభాలను సరిచేసి, సరఫరాను పునరుద్ధరించారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పోల్‌ టు పోల్‌ సర్వే చేస్తూ.. తక్షణం విద్యుత్‌ పునరుద్ధరించాలని విద్యుత్‌ శాఖ అధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు. మంత్రి లోకేశ్‌ ఆయనకు ఫోన్‌ చేసి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణపై ఆరా తీశారు.

Updated Date - Oct 30 , 2025 | 07:06 AM