Illegal Sand Mining: 1467 కోట్ల ఇసుక దోచేశారు
ABN , Publish Date - Aug 01 , 2025 | 02:54 AM
ఒకవైపు ఇసుక దోపిడీ... మరోవైపు మద్యం దందా! వైఎస్ జగన్ హయాంలో చోటుచేసుకున్న భారీ స్కాము లివి! లిక్కర్ లెక్కలు సిట్ తేలుస్తుండగా... ఇసుక దోపిడీ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా బయటపడుతోంది.
జగన్ హయాంలో నదులన్నీ గుల్ల
ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అధ్యయనం
సుప్రీం కోర్టులో సర్కారు అఫిడవిట్
నేడు అక్రమ తవ్వకాల కేసుపై విచారణ
1.22 కోట్ల టన్నుల అక్రమ తవ్వకం లెక్క ఇది
ఇంకా 2.69 కోట్ల టన్నుల సంగతి తేలాలి
అన్నీ కలిపితే అక్రమాల విలువ 4,000 కోట్లపైనే!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఒకవైపు ఇసుక దోపిడీ... మరోవైపు మద్యం దందా! వైఎస్ జగన్ హయాంలో చోటుచేసుకున్న భారీ ‘స్కాము’లివి! లిక్కర్ లెక్కలు ‘సిట్’ తేలుస్తుండగా... ఇసుక దోపిడీ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా బయటపడుతోంది. ఇప్పటిదాకా అంచనా వేసిన ప్రకారం... రూ.1467 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వి, అమ్ముకున్నారని ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే! తుది లెక్కలు తీస్తే... ఈ విలువ రూ.4వేలకోట్లపై మాటే. జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు శుక్రవారం ధర్మాసనం ముందుకు రానుంది. ఈ సందర్భంగా కోర్టు ఆదేశాల మేరకుఏపీ ప్రభుత్వం తరపున గనులశాఖ కమిషనర్ ఇసుక తవ్వకాలపై అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ చేపట్టింది. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా కృష్ణా, గోదావరి, వాటి ఉపనదుల పరిధిలో 2021-24 మధ్య ఎక్కడెక్కడ అక్రమ తవ్వకాలు జరిగాయి? ఎంతమేర ఇసుక దోచుకెళ్లారు? నదుల పరిస్థితి ఏంటి? పర్యావరణానికి జరిగిన నష్టం ఎంత? అంశాలపై ఏపీఎస్ఏసీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలోని అంశాలనే సుప్రీం కోర్టుకు ఆఫిడవిట్ రూపంలో ప్రభుత్వం సమర్పించింది.
నివేదికలోని కీలక అంశాలు
ఏపీఎస్ఏసీ రాష్ట్రవ్యాప్తంగా 794 ఇసుక తవ్విన ప్రాంతాలను ఉపగ్రహ చిత్రాల సాంకేతికత ఆధారంగా పరిశీలించిందని పేర్కొన్నారు. ఇది 2,743 హెక్టార్ల పరిధిలో ఉందని తెలిపారు. అఫిడవిట్ ప్రకారం.. 2.74 కోట్ల క్యూబిక్‌మీటర్ల మేర తవ్వకాలు జరిపి 4.11 కోట్ల టన్నుల ఇసుక తవ్వితీశారు. అయితే, 709 ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు భారీగా జరిగాయి. అక్కడ అనధికారికంగా, అక్రమంగా తవ్వకాలు చేశారు. ఈ ప్రాంతం 2,611 హెక్టార్లలో ఉంది. 2.61 క్యూబిక్‌మీటర్ల లోతున ఇసుక తవ్వి 3.91 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వితీశారని తన నివేదికలో ఏపీఎస్ఏసీ తెలిపింది. ‘‘ఈ నివేదిక ఆధారంగా గనుల శాఖ జగన్ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాలు చేపట్టిన జేపీ వెంచర్స్, జీసీకేసీ, ప్రతిమ కంపెనీలకు 70 షోకాజ్ నోటీసులు జారీచేసింది. 1.22 కోట్ల మెట్రిక్ టన్నుల మేర అక్రమ ఇసుక తవ్వకాలు జరిపినందుకు ఆ కంపెనీలకు 1,467.60 కోట్ల మేర చెల్లించాలని డిమాండ్ నోటీసులు ఇచ్చింది’’ అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అంటే, అక్రమంగా తవ్విన 3.91 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకలో కేవలం 1.22 కోట్ల టన్నుల ఇసుక విలువే రూ.1,467 కోట్లు. వీటికే డిమాండ్ నోటీసులు ఇచ్చా రు. ఇంకా 2.69 కోట్ల మెట్రిక్ టన్నుల అక్రమ ఇసుక తవ్వకాలకు కూడా జిల్లాల వారీగా ఏజెన్సీలకు డిమాండ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు గనులశాఖ ఆఫిడవిట్‌లో పేర్కొంది.
స్కామ్ రూ.4వేలకోట్లకంటే ఎక్కువే..
జగన్ ప్రభుత్వంలో ఏజెన్సీలు అక్రమంగా తవ్విన ఇసుక 3.91 కోట్ల మెట్రిక్ టన్నులు. ఇందులో కేవలం 1.22 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకకే రూ.1,467 కోట్ల డిమాండ్ నోటీసులు ఇచ్చారు. 2.69 కోట్ల టన్నుల అక్రమ ఇసుకకు గాను డిమాండ్‌నోటీసులు ఇవ్వాలి. ఇదే విషయమై జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ఇసుక కమిటీలకు మార్గదర్శకాలు ఇచ్చినట్లు గనుల శాఖ డైరెక్టర్ తన ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు. ‘‘ఏపీస్పేస్ సెంటర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లాల వారీగా అక్రమ తవ్వకాలు జరిగిన ప్రాంతాలను గుర్తించి ఏజె న్సీలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. వాటికి ఏజెన్సీలు ఇచ్చే సమాధానాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలి. అక్రమంగా తవ్విన ఇసుక ఆధారంగా జిల్లా స్థాయి ఇసుక కమిటీలను సంప్రదించి సంబంధిత ఏజెన్సీలకు డిమాండ్ నోటీసులు జారీ చేయాలి. అక్రమ తవ్వకాలకు పాల్పడినవారు బాధ్యత వహించేలా కచ్చితమైన చర్యలు తీసుకోవాలి’’ అని గత రెండు నెలల కాలంలో ఇచ్చిన ఆదేశాల ప్రతులను ఆఫిడవిట్‌కు జతచే శారు. కాగా, వీటి విలువ ఎంతలేదన్నా మరో రూ.4400 కోట్లపైనే ఉంటుందని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.