Share News

Sand Mafia: అడ్డగోలుగా తవ్వేస్తున్నారు

ABN , Publish Date - Jul 14 , 2025 | 03:35 AM

రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. కొన్ని రీచ్‌ల్లో ఇసుకను తవ్వితీసి ప్రభుత్వానికి అందించే బాధ్యతను స్వయంసహాయ సంఘాలు, ఇతర ప్రైవేటు సంస్థలకు...

 Sand Mafia: అడ్డగోలుగా తవ్వేస్తున్నారు

  • నిబంధనలు గాలికొదిలి ఇసుక మైనింగ్‌

  • భారీ యంత్రాలతో నదీ గర్భాలు గుల్ల

  • గుండిమెడ, కొల్లిపర రీచ్‌లలో యథేచ్ఛగా తవ్వకాలు.. వేమూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి దందా

  • మంత్రులు, నేతల పేర్లు చెప్పి తరలింపు

  • ఇసుక లారీలు తనిఖీలు చేయకుండా గనుల అధికారుల ద్వారా ఒత్తిళ్లు

  • జిల్లాల వారీగా వాస్తవ పరిస్థితిపై సీఎంకు అధికారుల నివేదిక

  • ఎన్‌జీటీకీ అందిన ఫిర్యాదులు

  • త్వరలోనే విచారణ జరిగే అవకాశం

అసలే వర్షాకాలం.. ఇసుక రీచ్‌ల్లో అక్టోబరు నెలాఖరుదాకా తవ్వకాలు చేపట్టకూడదు. దీనిని అడ్డంపెట్టుకుని కొందరు నేతలు ఇసుక రీచ్‌లపై పడిపోతున్నారు. నిల్వ ఉన్న ఇసుకనే తరలిస్తున్నామనే పేరిట కొత్తగా తవ్వకాలు చేపడుతున్నారు. భారీ యంత్రాలను ఉపయోగించి నదీగర్భాలను తోడేస్తున్నారు. రాత్రీ పగలూ తేడా లేకుండా వేల లారీల్లో తరలించేస్తున్నారు. కొందరు నేతలే దగ్గరుండి ఈ చీకటి దందాను ప్రోత్సహిస్తుండడంతో అడ్డుకునేందుకు అధికారులు జంకుతున్నారు. అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు ఉద్దేశించిన నిఘా, నియంత్రణ, పర్యవేక్షణ వ్యవస్థలు నేలచూపులు చూస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజల్లో విపత్కర పరిస్థితులు వస్తాయని.. ఉన్నతాధికారులు జిల్లాల వారీగా వాస్తవ పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. ఇప్పటికే ఈ అంశంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)కు రెండు ఫిర్యాదులు వెళ్లాయి. వీటిపై విచారణ మొదలైతే ప్రభుత్వం సమాధానం చెప్పుకోకతప్పదు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. కొన్ని రీచ్‌ల్లో ఇసుకను తవ్వితీసి ప్రభుత్వానికి అందించే బాధ్యతను స్వయంసహాయ సంఘాలు, ఇతర ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. అయితే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ జూన్‌ 1 నుంచి అక్టోబరు 15 వరకు ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది. అయితే నీటి లభ్యత తక్కువగా ఉన్న 350 మండలాల్లోని 745 ప్రాంతాల్లో మనుషులను పెట్టి తవ్వుకునే వెసులుబాటు ఇచ్చింది. వీటిలో భారీ, మధ్యరకం యంత్రాలను ఉపయోగించడానికి వీల్లేదు.


ఇవి కాకుండా మరో 54 డీసిల్టేషన్‌ పాయింట్స్‌లో తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే మైనింగ్‌ నిలిపివేసిన రీచ్‌ల్లో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, కర్నూలు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో కొందరు నేతలు..వారి కనుసన్నల్లోని కంపెనీల ద్వారా భారీగా మైనింగ్‌ నిర్వహిస్తున్నారని అధికారులు సీఎంకు నివేదిక సమర్పించారు.ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఐదుగురు నేతలు పోటాపోటీగా తవ్వకాలు కొనసాగిస్తున్నారని తెలిసింది. ఇందులో వేమూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నేరుగా మైనింగ్‌ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు మంత్రులు,మరో ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల పేరుచెప్పి తవ్వకాలు జరుపుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. తెనాలి నియోజకవర్గం పరిధిలోని కొల్లిపర రీచ్‌ చాలా పెద్దది.దీనితోపాటు మంగళగిరి నియోజకవర్గంలోని గుండిమెడ,రాయపూడి, లింగాయపాలెం-1, లింగాయపాలెం-2,ఇతర రీచ్‌ల్లో భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు.కొల్లిపర, గుండిమెడ రీచ్‌ల్లో ప్రజాప్రతినిధుల పేరు చెప్పి వేమూరు ప్రాంత వ్యక్తి ఇసుక దందా నిర్వహిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.కొల్లిపరలో వేమూరు వ్యక్తి తవ్వకాలు నిర్వహించడాన్ని టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.


ఇదే విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.కీలకమైన గుండిమెడ రీచ్‌లో భారీ యంత్రాలతో తవ్వకాలు సాగిస్తున్నారు. వేమూరు వ్యక్తే ఇక్కడా రాత్రింబవళ్లూ తవ్వుతున్నట్లు గుర్తించారు. రోజుకు సగటున 400 లారీల్లో ఇసుకను తరలిస్తున్నారని అంచనా. కొల్లిపరలో 270 లారీల్లో తరలిస్తున్నారని తేలింది. వేమూరు వ్యక్తి పెద్ద నేతల పేరు చెప్పి అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది.ఓ నేత పేషీ నుంచి గనుల అధికారులకు ఫోన్‌చేసి ఇసుక లారీల తనిఖీలు చేపట్టవద్దని పదేపదే చెప్పిస్తున్నట్లు సమాచారం.నిజానికి గుండిమెడ, కొల్లిపర రీచ్‌ల్లో అక్రమ ఇసుక మైనింగ్‌పై గతంలో జగన్‌ హయాంలోనే ఎన్‌జీటీకి ఫిర్యాదులు వెళ్లాయి.ఆ కేసులు ట్రైబ్యునల్‌ను దాటి సుప్రీంకోర్టు ముందుకు వెళ్లాయి. అక్రమ మైనింగ్‌ జరుగడం లేదని అప్పటి గుంటూరు కలెక్టర్‌ ఇచ్చిన రిపోర్టులపై ట్రైబ్యునల్‌, సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేశాయి కూడా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇదే రీచ్‌ల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతోందంటూ ఇద్దరు వ్యక్తులు ట్రైబ్యునల్‌కు తాజాగా ఫిర్యాదు చేశారు. వీటిపై త్వరలో విచారణ జరిగే అవకాశముంది.


ఆ జిల్లాల్లో అంతా ఒక్కటయ్యారు..

కర్నూలు,నంద్యాల,గోదావరి జిల్లాల పరిధిలోని మైనింగ్‌లో నేతలంతా ఒక్కటై తవ్వకాలు చేస్తున్నారు.విభేదాలకు తావులేకుండా నదులను విడతలవారీగా తోడేస్తున్నారు.తాజాగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరిగాయి.దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు.ఈలోపే అందిన కాడికి ఇసుకను తవ్వి తరలించుకుపోయేందుకు రాత్రింబవళ్లూ రీచ్‌ల్లో అక్రమ తవ్వకాలు చేస్తున్నారని అధికారులు సీఎంకు తెలియజేశారు.నేతలను నియంత్రించకపోతే అక్రమ మైనింగ్‌ ఆగదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని నివేదికలో కోరినట్లు తెలిసింది.

Updated Date - Jul 14 , 2025 | 03:38 AM