Share News

రూ.156.81 కోట్ల అక్రమ మైనింగ్‌

ABN , Publish Date - Aug 08 , 2025 | 01:08 AM

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అక్రమార్కులు రెచ్చిపోయారు. ఒక్క విజయవాడ రూరల్‌ మండలంలోనే రూ.156.81 కోట్ల అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. కొండలు, గుట్టలను తవ్వేసి 29.81 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి,గ్రావెల్‌ను తరలించుకుపోయారు. సమాచార హక్కు చట్టం దరఖాస్తుతో ఈ అక్రమాల వివరాలు బహిర్గతం అయ్యాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు మొక్కుబడిగా ఇచ్చిన నోటీసులు, అపరాధ రుసుం విలువే ఇంత ఉంటే.. దోచేసిన మొత్తం విలువ ఎంత ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ.కోట్లలో అపరాధ రుసుం విధించినా ఇప్పటి వరకు నయా పైసా చెల్లించకపోవటం గమనార్హం.

రూ.156.81 కోట్ల అక్రమ మైనింగ్‌

- గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమార్కుల బరితెగింపు

- విజయవాడ రూరల్‌ మండలంలో కరిగిపోయిన కొండలు, గుట్టలు

- తవ్వుకుపోయిన గ్రావెల్‌/మట్టి పరిమాణం 29.81 లక్షల క్యూబిక్‌ మీటర్లు

- సమాచార హక్కు చట్టం దరఖాస్తుతో ఇన్నాళ్లకు వివరాలు బహిర్గతం

- స్థానికుల ఫిర్యాదుతో షోకాజ్‌, అపరాధ రుసుం నోటీసులతో సరిపెట్టిన అధికారులు

- మైనింగ్‌ శాఖకు నయా పైసా కట్టని అక్రమార్కులు

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అక్రమార్కులు రెచ్చిపోయారు. ఒక్క విజయవాడ రూరల్‌ మండలంలోనే రూ.156.81 కోట్ల అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. కొండలు, గుట్టలను తవ్వేసి 29.81 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి,గ్రావెల్‌ను తరలించుకుపోయారు. సమాచార హక్కు చట్టం దరఖాస్తుతో ఈ అక్రమాల వివరాలు బహిర్గతం అయ్యాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు మొక్కుబడిగా ఇచ్చిన నోటీసులు, అపరాధ రుసుం విలువే ఇంత ఉంటే.. దోచేసిన మొత్తం విలువ ఎంత ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ.కోట్లలో అపరాధ రుసుం విధించినా ఇప్పటి వరకు నయా పైసా చెల్లించకపోవటం గమనార్హం.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ రూరల్‌ మండలంలో జరిగిన అక్రమ మైనింగ్‌ వ్యవహారాల బండారం ఇన్నాళ్లకు బయట పడింది. అప్పట్లో స్థానికుల ఫిర్యాదులపై మొక్కుబడి కేసులు నమోదు చేసిన మైనింగ్‌ శాఖ అధికారులు.. నాటి అరాచకాలను తాజాగా బహిర్గతం చేశారు. కొత్తూరు, తాడేపల్లి, పి.నైనవరం, వేమవరం, పాతపాడు, జక్కంపూడి గ్రామాలతో పాటు, జీ కొండూరు మండలం వెలగలేరు తదితర ప్రాంతాల్లో జరిపిన అక్రమాలన్నీ సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో మైనింగ్‌ శాఖ అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ మైనింగ్‌ జరిగింది. చాలా వరకు చూసి చూడనట్లు వదిలేశారు. ప్రజల ఫిర్యాదులతో కేసుల లెక్కల కోసం.. గుర్తించిన అక్రమాలను చూస్తేనే కళ్లు తిరుగుతున్నాయి. ఇక పూర్తిస్థాయి అక్రమాలపై నిగ్గు తేల్చితే అంచనాలకు అందని పరిస్థితి. మైనింగ్‌ శాఖ విధించిన జరిమానాల ప్రకారం చూస్తే.. రూ.156.81 కోట్ల విలువ చేసే 29.81 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌/మట్టి సంపదను అక్రమార్కులు తన్నుకుపోయారు. అప్పట్లో కేవలం షోకాజ్‌ నోటీసులతో మైనింగ్‌ శాఖ అధికారులు సరిపెట్టారు. ఆ తర్వాత అపరాధ రుసుం చెల్లించాలని డిమాండ్‌ నోటీసులు ఇచ్చి వదిలేశారు. గ్రావెల్‌, మట్టి తవ్వుకుపోయిన వారెవరూ కూడా ఇప్పటి వరకు నయా పైసా చెల్లించలేదు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు అడుగుతుంటే.. తమ లోపాలు బయట పడతాయేమోనన్న భయంతో జిల్లా మైనింగ్‌ శాఖ అధికారులు అక్రమార్కులపై రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) యాక్ట్‌ ప్రయోగిస్తామని చెబుతున్నారు.

సమాచారం హక్కు చట్టం ద్వారా వెలుగులోకి..

సమాచార హక్కు చట్టం దరఖాస్తు మేరకు వెలుగు చూసిన అక్రమాలను చూస్తే విజయవాడ రూరల్‌ మండలంలో అడ్డగోలుగా జరిగిన అక్రమ తవ్వకాలు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థమవుతోంది.

- కొత్తూరు - తాడేపల్లి గ్రామంలో సర్వే నెంబర్లు 40/4, 5, 7, 8, 13, 14, 15, 18, 19, 20, 22, 23, 25, 26, 27, 28, 35 /ఎఫ్‌ఎఫ్‌జీ, 36/సీ, డీ, ఈ, ఎఫ్‌, జీ, జే, కే, ఐ, 39/9, 8, 114, 227/17, 41/,5, 6, 7, 256/3, 4, 260/10, 255/7, 260/4, 25,28, 28, 29, 34, 35, 16, 146/6, 2ఏ, 2బీ 2, 4, 5,6,7,8,10, 263/4, 263 / 5లలో రూ. 10.43 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌/మట్టి తవ్వి రవాణా చేసినట్టుగా నిర్ధారణ అయింది. మొత్తం 33 మంది అక్రమార్కులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వటంతో పాటు రూ. 57.86 కోట్ల జరిమానాతో కూడిన డిమాండ్‌ నోటీసులను ఇచ్చింది.

- కొత్తూరు గ్రామ సర్వే నెంబర్‌ 34, 34/1లలో 3,90,116 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ /మట్టి రవాణా చేసినట్టుగా నిర్ధారించారు. విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ పనులను చేపడుతున్న మేఘా ఇంజనీరింగ్‌ సంస్థకు షోకాజు నోటీసు ఇవ్వటంతో పాటు రూ.21.63 కోట్ల జరిమానాతో కూడిన డిమాండ్‌ నోటీసు పంపారు.

- వెలగలేరు గ్రామంలో సర్వే నెంబర్లు 501/2, 504/4ఈ, 508/ఏ, డీ, 509/1, 3సీ - 1, 2, 3 ఎఫ్‌, 3 బీ, హెచ్‌, 510 /3డీ, 3ఎఫ్‌, 511/5సీ, 5డీ, 4ఎఫ్‌, ఐ, 512 / బీ, ఎఫ్‌, జీ, హెచ్‌, ఐ, జే, హెచ్‌, ఎం, ఎల్‌, 520/ జే, కే, 521/ ఈ, ఎఫ్‌, జీ, ఐ, 522/ఈ, 523/డీఈహెచ్‌ఐఎం, 524/బీ,సీ,డీ,ఎఫ్‌,జీ, హెచ్‌, జే, కే, 525 /ఏ, డీ, ఎఫ్‌, ఈ, హెచ్‌, ఐ లలో 5.75 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ /మట్టి తవ్వి రవాణా చేసినట్టుగా మైనింగ్‌ శాఖ అధికారులు నిర్ధారించారు. మొత్తం 59 మంది అక్రమార్కులు అక్రమ తవ్వకాలకు పాల్పడినట్టుగా గుర్తించి, రూ.31.91 కోట్ల మేర అపరాధ రుసుం విధిస్తూ డిమాండ్‌ నోటీసు ఇచ్చారు.

- పి.నైనవరం గ్రామంలో సర్వే నెంబర్‌ 101/1, 2, 5, 7, 8,9, 103/1, పీఐపీఎల్‌ఎంసీ 103/2లలో 2,60,140 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ /మట్టి తవ్వకాలు జరిపిన వ్యక్తికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. రూ.14.42 కోట్ల అపరాధ రుసుంతో కూడిన డిమాండ్‌ నోటీసును ఇచ్చారు.

- వేమవరం గ్రామంలో సర్వే నెంబర్లు 147/6, 2ఏ, 2బీ, 2, 4, 5, 6, 7, 8, 10లలో 5,59,087 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ /మట్టిని తవ్వి రవాణా చేసినట్టు నిర్ధారించారు. 18 మందికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. రూ.30.99 కోట్ల అపరాధ రుసుంతో కూడిన డిమాండ్‌ నోటీసులను అందజేశారు.

- జక్కంపూడి గ్రామంలో సర్వే నెంబర్‌ 88లో 1,54,704 క్యూబిక్‌ మీటర్ల కంకరకు అనుమతి ఇచ్చారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు 1,710 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌/మట్టిని అక్రమంగా తవ్వారు. వారికి రూ.50 వేల డిమాండ్‌ నోటీసు ఇచ్చారు.

- పాతపాడు గ్రామంలో మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా 354 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌/మట్టిని తవ్వటం వల్ల ఆ ఇద్దరికీ వేర్వేరుగా రూ.20,320, రూ.66,000 అపరాధ రుసుం విధించారు.

- జీ కొండూరు మండల పరిధిలో కూడా అక్రమంగా గ్రావెల్‌, మట్టి తవ్వినవారిని గుర్తించారు. వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయటంతో పాటు అపరాధ రుసుం విధిస్తూ డిమాండ్‌ నోటీసులు ఇచ్చారు.

Updated Date - Aug 08 , 2025 | 01:09 AM