Illegal Alprazolam Manufacturing: నందికొట్కూరులో మత్తు పదార్థాల తయారీ
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:12 AM
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం నడిబొడ్డున నిషేధిత మత్తు పదార్థాలను తయారు చేస్తున్న ఇద్దరిని నేషనల్ డొమెస్టిక్ ప్రిపేర్డ్‌నేస్ కన్సార్టియం (ఎన్‌డీపీసీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
లిక్విడ్ ఆల్ర్పాజోలం తయారుచేసి తెలంగాణకు తరలింపు
ఎన్‌డీపీసీ అదుపులో ఇద్దరు.. రెండు కిలోలకు పైగా డ్రగ్ స్వాధీనం
నందికొట్కూరు, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం నడిబొడ్డున నిషేధిత మత్తు పదార్థాలను తయారు చేస్తున్న ఇద్దరిని నేషనల్ డొమెస్టిక్ ప్రిపేర్డ్‌నేస్ కన్సార్టియం (ఎన్‌డీపీసీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని ఓ ఇంట్లో సురేష్ అనే వ్యక్తి గది అద్దెకు తీసుకున్నాడు. అక్కడ నిషేధిత ఆల్ర్పాజోలం మత్తు పదార్థాన్ని రెండు నెలలుగా తయారు చేస్తున్నట్టు ఎన్‌డీపీసీ అధికారుల నిఘాలో తేలింది. ఈ డ్రగ్‌ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. నిద్ర కలిగించే ఈ ఆల్ర్పాజోలం తయారీకి నందికొట్కూరును ఎంచుకున్నారు. పట్టణానికి చెందిన ఓ యువకుడు కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. అతన్ని ఎంపిక చేసుకొని ముడి సరుకులను తీసుకువచ్చి ఇక్కడ ద్రవ రూపంలో తయారు చేసి తెలంగాణ ప్రాంతానికి సరఫరా చేసి, అక్కడ విక్రయిస్తున్నట్టు సమాచారం. ఆ రాష్ట్రంలోని గద్వాలలో ఆల్ర్పాజోలం అమ్ముతున్న ముఠాను నార్కొటెక్ అధికారులు పట్టుకుని విచారించారు. ఈ క్రమంలో నందికొట్కూరులో తయారీ కేంద్రం ఉందని తెలిసింది. దీంతో ఎన్‌డీపీసీ అధికారులు పట్టుబడ్డ వారిలో ఒకరిని ఇక్కడికి తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం తయారీ కేంద్రంపై దాడులు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి సుమారు రెండు కిలోలకు పైగా ద్రవ రూప ఆల్ర్పాజోలం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుంది. కాగా.. హైదరాబాదుకు చెందిన నిపుణుల బృందం మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నందికొట్కూరుకు చేరుకుని పట్టుబడిన ద్రవ రూప అల్ర్పాజోలాన్ని పరిశీలించింది.