Shrimp Farming: తీర కవచం కకావికలం
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:39 AM
సముద్ర తీర ప్రాంత రక్షణ కవచం కకావికలమవుతోంది. విచ్చలవిడి నరికివేతతో మడ అడవులు కనుమరుగవుతున్నాయి. పచ్చని ప్రహరీలా తుఫానులు, ఉప్పెనల వంటి ప్రకృతి విపత్తుల నుంచి తీర ప్రాంతాలను...
ఉమ్మడి గుంటూరు జిల్లాలో యథేచ్ఛగా మడ అడవుల నరికివేత
అటవీ భూముల్లో రొయ్యల చెరువులు
చోద్యం చూస్తున్న అటవీ అధికారులు
(రేపల్లె-ఆంధ్రజ్యోతి)
సముద్ర తీర ప్రాంత రక్షణ కవచం కకావికలమవుతోంది. విచ్చలవిడి నరికివేతతో మడ అడవులు కనుమరుగవుతున్నాయి. పచ్చని ప్రహరీలా తుఫానులు, ఉప్పెనల వంటి ప్రకృతి విపత్తుల నుంచి తీర ప్రాంతాలను కాపు కాసే మడ చెట్లు మోడుబారిపోతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 37 వేల హెక్టార్లలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా రేపల్లె మండలం లంకేవానిదిబ్బ, మోళ్లగుంట, తాళ్లతిప్ప, నిజాంపట్నం మండలం కొత్తపాలెం, అడవులదీవి, దిండి, నిజాంపట్నం ప్రాంతాలు మడ అడవులకు ప్రసిద్ధి. మడ అడవులను ఇష్టానుసారంగా నరికివేస్తూ కొందరు దళారులు రొయ్యల చెరువులు సాగు చేసుకుంటున్నారు.
గత టీడీపీ హయాంలో ప్రత్యేక దృష్టి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మడ అడవుల అభివృద్ధిపై 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. తీర ప్రాంతాల్లో మడ మొక్కలను నాటి అడవులను విస్తరించింది. దీంతో మడ అడవులకు జాతీయ స్థాయిలో అవార్డు కూడా దక్కింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ దృష్టి సారించకపోవడంతో ఇష్టానుసారంగా మడ చెట్లను నరికివేశారు. ఈ కలపను తీసుకెళ్లి రొయ్యల చెరువుల గట్లపై కంచెగా నాటుకునేందుకు వినియోగిస్తున్నారు. వంట చెరకుగా విక్రయిస్తున్నారు. మడ అటవీ భూములను కొందరు భారీగా ఆక్రమించి రొయ్యల చెరువులను సాగు చేస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటూ రేపల్లె, నిజాంపట్నం మండలాల్లోని తీర ప్రాంతాల్లో మడ అడవుల బాగోగులు చూసుకోవాల్సిన అటవీ శాఖ అధికారులంతా బాపట్ల, గుంటూరు జిల్లా కేంద్రాలకే పరిమితమయ్యారు. ఉన్నతాధికారులు సందర్శనకు వచ్చినప్పుడు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోతున్నారు. మడ అడవుల రక్షణపై వారు దృష్టి సారించిన దాఖలాల్లేవు. ఈ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు కనీసం పెట్రోలింగ్ కూడా నిర్వహించడం లేదు.
ఎన్నో ఉపయోగాలు
మడ అడవులు ప్రకృతి విపత్తుల నుంచి తీర ప్రాంతాలను రక్షించడమే గాక పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాయి. తాబేళ్ల సంతానోత్పత్తికి అనువైన ప్రదేశాన్ని సృష్టిస్తాయి. మత్స్యసంపద అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న మడ అడవులను రక్షించుకునేందుకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తీర ప్రాంత గ్రామాల ప్రజలు, ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. లేకుంటే మడ అడవులు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.