Anantapur: భార్యకు వేధింపులు.. తుపాకుల ముఠా గుట్టురట్టు
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:54 AM
నాటు తుపాకులను విక్రయించే ముగ్గురు సభ్యుల ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
5 నాటు తుపాకులు, ఒక తల్వార్ 7 మ్యాగజైన్లు, 30 బుల్లెట్లు స్వాధీనం
అనంత పోలీసుల అదుపులో జిమ్ నిర్వాహకుడు
ఇద్దరు మధ్యప్రదేశ్ వాసులు కూడా
అనంతపురం క్రైం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నాటు తుపాకులను విక్రయించే ముగ్గురు సభ్యుల ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులలో అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి(32)తో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన రోహిత్ పర్మారీ(24), శివం సింగ్ పరిహార్(25) ఉన్నారు. వీరి నుంచి ఐదు నాటు తుపాకులు, 7 మ్యాగజైన్లు, 30 బుల్లెట్లు, 3 బుల్లెట్ షెల్స్, ఒక తల్వార్ స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జగదీశ్ ఈ ముఠా వివరాలను వెల్లడించారు. అనంతపురంలో నల్లి రాజశేఖర్ రెడ్డి ఓ జిమ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేక భార్య ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంట్లోకి రానివ్వడం లేదని, దుస్తులు, తన వస్తువులు తెచ్చుకునేందుకు తోడుగా రావాలని పోలీసులను కోరారు. దీంతో ఆమెతో కలిసి ఇంటికి వెళ్లిన పోలీసులకు ఓ తుపాకీ లభించింది. దీంతో రాజశేఖర్ రెడ్డిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తుపాకీని మధ్యప్రదేశ్‌లో కొనుగోలు చేసినట్లు తేలింది. దీంతో ముఠాను పట్టుకునేందుకు సీఐలు శ్రీకాంత్ యాదవ్, రాజేంద్రప్రసాద్ యాదవ్, సీసీఎస్ సీఐ శేషగిరి, ఇద్దరు ఎస్‌ఐలతో ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాకు వెళ్లి రోహిత్ పర్మారీ, శివం సింగ్ పరిహార్‌ను అరెస్టు చేసింది.
జలంధర్‌లో పరిచయం
ముఠాలో రోహిత్ పర్మారీ అక్రమ ఆయుధాలు కొనుగోలు చేసి వాటి పనితీరును పరీక్షిస్తే.. శివం సింగ్ పరిహార్ వాటిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించి అమ్ముతుంటాడు. వీరిద్దరూ కలిసి గ్వాలియర్‌లో తక్కువ ధరకు తుపాకులు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటారు. జిమ్ నిర్వాహకుడు రాజశేఖర్‌రెడ్డి పంజాబ్‌లోని జలంధర్‌కు జిమ్ పరికరాలు కొనేందుకు వెళ్లిన సమయంలో మూడేళ్ల క్రితం వారితో పరిచయం ఏర్పడింది. జిమ్‌కు వచ్చేవారు తనను ఇబ్బంది పెడితే బెదిరించేందుకోసమని వారి వద్ద తుపాకీ కోనుగోలు చేశాడు. ఈ క్రమంలో తుపాకుల వ్యాపారంపై రాజశేఖర్ రెడ్డి మొగ్గు చూపాడు. ముగ్గురూ కలిసి తుపాకులు కొని అమ్మాలని నిర్ణయించారు. మధ్యప్రదేశ్‌లో రూ.40 వేలు నుంచి రూ.50 వేలకు తుపాకులు కొని, ఏపీలో రూ.20 వేల నుంచి రూ.30 వేల లాభానికి అమ్మాలని భావించారు. రాజశేఖర్ రెడ్డి భార్య ఫిర్యాదుతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.