Vijayawada: కలయా.. నిజమా
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:35 AM
రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విజయవాడలో ప్రముఖ సంగీత దర్శకుడు మ్యాస్ర్టో ఇళయరాజా మ్యూజిక్ కాన్సర్ట్ ఉర్రూతలూగించింది.
బెజవాడలో మ్యూజిక్ మ్యాస్ర్టో ‘లయ’ విన్యాసం
ఏపీలో తొలిసారిగా ఇళయరాజా మ్యూజిక్ కాన్సర్ట్
అలరించిన ప్రఖ్యాత సంగీత దర్శకుడి షో
ఉర్రూతలూగించిన ప్రముఖ గాయకుల పాటలు
40వేల మంది వీక్షకులతో ఐఎంజీ స్టేడియం కిటకిట
విజయవాడ, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విజయవాడలో ప్రముఖ సంగీత దర్శకుడు మ్యాస్ర్టో ఇళయరాజా మ్యూజిక్ కాన్సర్ట్ ఉర్రూతలూగించింది. దేశంలోనే ప్రసిద్ధ సంగీత దర్శకులలో ఒకరైన ఇళయరాజాకు విజయవాడ సాదర స్వాగతం పలికింది. ఇళయరాజా ఆరాధకులు, ఆయన సంగీతాన్ని ఇష్టపడేవారు.. విజయవాడలో నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్‌కు తరలివచ్చారు. అశేష సంఖ్యలో వచ్చిన ప్రేక్షకులతో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం కిటకిటలాడిపోయింది. ఇళయరాజా సారథ్యంలో నిర్వహించిన సంగీత కచేరీ ఆద్యంతం ఉర్రూతలూగించింది. ఇళయరాజా హార్మోనియం పరిచయంతో అమ్మవారిని కీర్తిస్తూ తన మాతృభాషలో భక్తిపాట వినిపించారు. ఆ తర్వాత ‘జగదానందకారక’ పాటతో ఆరంభమైన షో ఏకబిగిన దాదాపుగా మూడున్నర గంటలపాటు సాగింది. వర్థమా న గాయనీ గాయకులు ఎన్నో మధురమైన పాటలతో అలరించారు. ‘సిరిమల్లెపూవా.. సిరిమల్లెపూవా, ‘కల యా.. నిజమా’, ‘ఎన్నోరాత్రులొస్తాయిగానీ’, ‘ఓ ప్రియా ప్రియా’, ‘లలిత ప్రియాకమలం’, ‘కరిగిపోయాను కర్పూ ర వీణ లా’, ‘జాబిల్లి కోసం ఆకాశమల్లి’ వంటి అనేక మెలోడీ హిట్ సాంగ్స్‌ను గాయనీ గాయకులు ఆలపించారు. ప్రముఖ గాయకులు ఎస్సీబీ చరణ్, హరిచరణ్, శ్యామ్ అద్భుతగానం చేశారు. ప్లేబ్యాక్ సింగర్స్ మధు బాలకృష్ణ, ప్రియా హిమేష్, జితిన్ రాజ్, సుర్ముఖి, సారథ్ సంతోష్, అనితలతో పాటు సహాయ గాయకులు తమ గాత్రమాధుర్యంతో వీక్షకులను కట్టిపడేశారు.
నా జీవితం సంగీతం!
కాన్సర్ట్ మధ్యలో ఇళయరాజా.. ‘నా జీవితం సంగీతం’ అని చెప్పగానే చప్పట్లు మార్మోగాయి. ఒక పాటను విడివిడిగా విడదీస్తే సంగీతం ఎలా ఉంటుందో చూపించారు. ఒక పాటకు సంబంధించి ఒక్కో సంగీత పరికరం వాయిద్యం ఎలా ఉంటుంది? వివిధ సంగీత పరికరాలు కలిస్తే సంగీతం ఎలా ఉంటుంది? పాట తోడైతే ఎలా ఉంటుంది? అన్నీ కలిస్తే పాట ఎంత హృద్యంగా వస్తుందో చూపించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా 40 వేల మందికి పైగా విజయవాడ ప్రజలు బుక్‌మై షోలో బుక్ చేసుకుని మరీ చూశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, హోంమంత్రి అనిత , విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బొండా ఉమా, సినీ దర్శకుడు వంశీ తదితర ప్రముఖులు వీక్షించారు. కార్యక్రమం ముగింపులో బాణసంచా వెలుగుజిలుగులు అబ్బురపరిచాయి.