IIT Graduate: ఏఐపై పట్టు.. రూ.2.5 కోట్ల ప్యాకేజీ
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:28 AM
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ నాలుగో సంవత్సరంలోనే క్యాంపస్ సెలెక్షన్స్‌లో రూ.కోటి వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించిన రైల్వేకోడూరు యువకుడు..
రైల్వేకోడూరు యువకుడికి అమెరికాలో భారీ వేతనం
రైల్వేకోడూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ నాలుగో సంవత్సరంలోనే క్యాంపస్ సెలెక్షన్స్‌లో రూ.కోటి వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించిన రైల్వేకోడూరు యువకుడు.. ఆపై కృత్రిమ మేథ (ఏఐ)పై పట్టు సాధించి ఇప్పుడు ఏకంగా రూ.2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉన్నత ఉద్యోగం సాధించాడు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణం సూర్యానగర్‌కు చెందిన అదునుకోట చంద్రశేఖర్, మాధవి దంపతుల కుమారుడు అదునుకోట యశ్వంత్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ పూర్తిచేశాడు. అక్కడ నాలుగో ఏడాది చదువుతండగానే క్యాంపస్ సెలెక్షన్స్‌లో అమెరికాకు చెందిన థర్డ్ ఏఐ కంపెనీ అతనికి రూ.కోటి వార్షిక వేతనం చెల్లించేందుకు ముందుకొచ్చింది. 2022 నుంచి ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యశ్వంత్.. ఏఐపై మరింత పట్టు సాధించి రెండు వారాల క్రితమే కాలిఫోర్నియాకు చెందిన సర్వీస్ నౌ కంపెనీలో రూ.2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో మంచి ఉద్యోగం సాధించాడు. చిన్న ప్రింటింగ్ ప్రెస్‌తో జీవనం సాగిస్తున్న యశ్వంత్ తల్లిదండ్రులు తమ కుమారుడికి రెండున్నర కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తనలాగే చదవాలనుకునే వారికోసం త్వరలోనే కెరీర్ గైడెన్స్‌ను ప్రారంభిస్తానని యశ్వంత్ తెలిపాడు. చిన్నప్పటి నుంచి ఎలా చదవాలి, రోజుకు ఎన్ని గంటలు చదవాలి, ఏ యే సబ్జెక్టుల్లో పట్టుసాధించాలి, ఏ సబ్జెక్టు తీసుకుంటే క్యాంపస్ సెలెక్షన్స్‌లో ఉపయోగపడతాయి వంటి సూచనలు ఇస్తానని చెప్పాడు.