Share News

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌.. తీరని సమస్య

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:17 PM

జమ్మలమడుగు మండలంలోని ఎస్‌.ఉప్పలపాడు ఆదర్శ గ్రామాన్ని ఇటీవల కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ సందర్శించి ఎస్సీ కాలనీలో సమస్యలను ఇంటింటికి వెళ్లి ఆరా తీశారు.

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌.. తీరని  సమస్య
మాట్లాడుతున్న ఎస్‌.ఉప్పలపాడు గ్రామ మహిళలు

జమ్మలమడుగు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు మండలంలోని ఎస్‌.ఉప్పలపాడు ఆదర్శ గ్రామాన్ని ఇటీవల కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ సందర్శించి ఎస్సీ కాలనీలో సమస్యలను ఇంటింటికి వెళ్లి ఆరా తీశారు. ఆ సమయంలో ఎస్సీ కాలనీలోని కొందరు మహిళలు కలెక్టర్‌తో మాట్లాడు తూ తమకు గత నాలుగు సంవత్సరాలుగా జాబ్‌కార్డు ఉన్నప్పటికి వినియోగంలో లేదని, పని కల్పించలేదని తెలిపారు. ఇం దుకు కలెక్టర్‌ సంబందిత అధికారులతో మాట్లాడి జాబ్‌కార్డుల సమస్య వెంటనే పరిశీలించి అందించాలని ఆదేశించారు. అయినా సంబందిత అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం ఉదయం జమ్మలమడుగులోని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకం కార్యాలయం వద్దకు ఎస్‌.ఉప్పలపాడు గ్రామ మహిళలు వచ్చి సమస్యను ఎందుకు పరిష్కరించలేదని అధికారులను నిలదీశారు. కాగా ఈ విషయమై జమ్మలమడుగు ఎంపీడీవో సైదున్నీసాను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఉపాధి హామీ పనులలో ఎస్‌.ఉప్పలపాడు గ్రామంలో జరిగిన అక్రమాలకు సంబందించి జిల్లా అధికారులకు నివేదిక పంపడం జరిగిందన్నారు. ఆదర్శ గ్రామం ఎస్‌.ఉప్పలపాడులో 516 జాబ్‌కార్డులు ఉన్నాయని, అందులో 210 కార్డులు అమలులో ఉన్నాయని తెలిపారు. కూలీలకు 307 రూపాయలు రావాల్సి ఉండగా 301 రూపాయలు పడుతున్నాయని తెలిపారు. జమ్మలమడుగు మండలంలో మొత్తం జాబ్‌కార్డులు 5,878 ఉండగా యాక్టివ్‌గా 3,932 జాబ్‌కార్డులుపనిచేస్తున్నాయన్నారు. అందులో సైతం కొందరు హౌసింగ్‌ కోసం జాబ్‌కార్డులు తయారు చేసుకున్నారన్నారు. ఎస్‌.ఉప్పలపాడు గ్రామంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ లేకపోతే ఇన్‌చార్జిగా నియమించినట్లు ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్‌కు జాబ్‌కార్డుల సమస్య విన్నవించినవారికి వెంటనే సమస్య పరిష్కరిస్తామని ఎంపీడీవో తెలిపారు.

Updated Date - Jun 02 , 2025 | 11:17 PM