Share News

Minister Satya kumar: పీపీపీ తప్పయితే నన్ను జైలుకు పంపు

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:24 AM

పీపీపీ విధానంలో చేపట్టే మెడికల్‌ కాలేజీల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారందరినీ.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలుకు పంపుతామనడం జగన్‌ అహంకారానికి అద్దం పడుతోంది.

Minister Satya kumar: పీపీపీ తప్పయితే నన్ను జైలుకు పంపు

  • ఈ విధానాన్ని సమర్థిస్తున్న

  • మోదీనీ చెరసాలకు పంపుతావా?

  • జగన్‌కు మంత్రి సత్యకుమార్‌ సవాల్‌

అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘పీపీపీ విధానంలో చేపట్టే మెడికల్‌ కాలేజీల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారందరినీ.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలుకు పంపుతామనడం జగన్‌ అహంకారానికి అద్దం పడుతోంది. పీపీపీ విధానం తప్పయితే... జగన్‌కు దమ్ముంటే... వైద్య శాఖ మంత్రిగా ఉన్న నన్ను ముందుగా జైలుకు పంపాలి’ అని మంత్రి సత్యకుమార్‌ సవాల్‌ విసిరారు. ‘ఏపీకి విజిటింగ్‌ పొలిటీషియన్‌గా ఉన్న జగన్‌ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ను తూలనాడుతున్నాడు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, పార్లమెంట్‌ స్థాయి సంఘం, నీతి ఆయోగ్‌, జాతీయ వైద్య మండలి, హైకోర్టు, సుప్రీంకోర్టు... అందరూ పీపీపీ విధానాన్ని సమర్థిస్తుంటే.. ప్రధాని మోదీతో సహా వీరందర్నీ జైలుకు పంపుతావా? మెడికల్‌ కాలేజీలపై కోటి సంతకాల పత్రాలంటూ గవర్నర్‌నూ పక్కదారి పట్టిస్తున్నారు. వైసీపీ హయాంలో మెడికల్‌ కాలేజీలకు రూ.600 కోట్లు ఖర్చు పెట్టేలా ఉత్తర్వులిచ్చి అక్రమాలకు పాల్పడ్డారు. అవన్నీ బయటకు వస్తాయన్న భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఆర్థిక నేరాల కేసుల్లో జగన్‌ మళ్లీ జైలుకెళ్లడం ఖాయం’ అని సత్యకుమార్‌ పేర్కొన్నారు.


పీపీపీపై బహిరంగ చర్చకు సిద్ధం: కొలుసు

పీపీపీ విధానం అంటే ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మేయడం, అప్పగించడం కాదని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ‘పీపీపీ పద్ధతి అంటే అర్థం తెలియని వైసీపీ నేతలు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. దేశంలో 70శాతం మెడికల్‌ కాలేజీలు పీపీపీ పద్ధతిలోనే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కార్డియాలజీ విభాగాన్ని ఈ విధానంలోనే నిర్వహించారు. దీనిపై బహిరంగ చర్చకు మేం సిద్ధం’ అని కొలుసు ప్రకటించారు.

Updated Date - Dec 19 , 2025 | 04:24 AM